Amaravathi : అమరావతి పనికిరాదా జగనన్న
ఈ రెండింటిలో మౌలిక వసతులు కల్పన (రోడ్లు, విద్యుత్ సరఫరా), ఫ్యాక్టరీ షెడ్ల నిర్మాణం కోసం అక్షరాల రూ.1580 కోట్లతో పార్కులను అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే రూ.100 కోట్లు ఖర్చుచేశారు. ఇప్పుడు అదే నగరాన్ని ఎంపిక చేయడం విశేషం.

Amaravathi : అమరావతిపై వైసీపీ సర్కారు మరోసారి తన కర్కశాన్ని చూపింది. అభివృద్ధి చేయాల్సిన నగరాల జాబితాలో చోటు దక్కే చాన్స్ ఉన్నా కావాలనే తప్పించింది. ఇప్పటికే అమరావతిని శాసన రాజధానికి మాత్రమే పరిమితం చేయాలని జగన్ డిసైడయ్యారు. ఆయన భావిస్తున్నట్టు మాదిరిగా చేయాలన్నా అభివృద్ధి చేయాలి. కానీ కేంద్రమే అభివృద్ధి చేస్తామని ముందుకొచ్చినా ససేమిరా అన్నారు. రాజకీయ వ్యూహంలో భాగంగా అరుదైన అవకాశాన్ని కాలదన్నుకున్నారు. మరోసారి రాజకీయ చర్చకు కారణమవుతున్నారు.
15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వం దేశంలో కొత్తగా ఎనిమిది నగరాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఏపీ నుంచి ప్రతిపాదనలు కోరింది. దీంతో అంతా అమరావతిని సూచిస్తారని భావించారు. ఇప్పటికే ఇక్కడ భూ సేకరణ పూర్తికావడం, రహదారులు వంటి మౌలిక వసతులు కారణంగా ఎంపికకు అన్నివిధాలా శ్రేయస్కరం కూడా. కొత్త నగరాల ఏర్పాటులో కొన్ని సవాళ్లు ఎదురవుతాయని ఆర్థిక సంఘం భావించింది. అయితే ఈ సవాళ్లను అమరావతి ఎప్పుడో అధిగమించింది. కానీ ఇవన్నీ లెక్కలోకి తీసుకొని జగన్ సర్కారు కడప జిల్లా కొప్పర్తిని ఎంపిక చేసింది. ఇది వ్యూహాత్మక ఎంపిక అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అభివృద్ధి చేయాల్సిన నగరాల్లో సవాళ్లు, అవరోధాలు ఉండకూడదని ఆర్థిక సంఘం భావిస్తోంది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అటువంటి నగరాల ఎంపికకు ప్రాధాన్యమివ్వాలని సూచించింది. ఈ లెక్కకు అమరావతి కరెక్టుగా సరిపోతుంది. కానీ జగన్ సర్కారు మరోలా ఆలోచన చేసింది. ఇలా అభివృద్ధి చేయాల్సిన నగరాల్లో ఒక్కో నగరానికి రూ వెయ్యి కోట్లు చొప్పున ఇవ్వాలని కేంద్రానికి ఆర్దిక సంఘం ప్రతిపాదించింది. ఈ మేరకు ఎంపిక చేసిన ప్రాంతాల అభివృద్ధికి ప్రతీ ఏటా రూ. 250 కోట్లు కేంద్రం ఇవ్వనుంది. ఇలా వచ్చిన మొత్తంతోనైనా అమరావతిలో అభివృద్ధి జరుగుతుందని భావించినా.. వైసీపీ సర్కారు అడ్డంకిగా నిలిచింది.
అమరావతి ని కాదని ఇతర ప్రాంతాలను నగరంగా అభివృద్ధికి ప్రతిపాదించటం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే కడప జిల్లా కొప్పర్తి లో ఎలక్ట్రానిక్ మనుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. 540 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ మ్యానిఫ్యాక్చరింగ్ క్లస్టర్, 3167 ఎకరాల్లో మెగా ఇండస్ట్రీయల్ హబ్ నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ రెండింటిలో మౌలిక వసతులు కల్పన (రోడ్లు, విద్యుత్ సరఫరా), ఫ్యాక్టరీ షెడ్ల నిర్మాణం కోసం అక్షరాల రూ.1580 కోట్లతో పార్కులను అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే రూ.100 కోట్లు ఖర్చుచేశారు. ఇప్పుడు అదే నగరాన్ని ఎంపిక చేయడం విశేషం.