Allu Arjun – Manchu Vishnu : మంచు విష్ణు కి ధన్యవాదాలు తెలిపిన అల్లు అర్జున్ ఎందుకో తెలుసా…
తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు.. అల్లు అర్జున్‌ను అభినందిస్తూ, ప్రశంసిస్తూ ఒక లేఖ రాశారు. ఆ లేఖకు మన ఐకాన్ స్టార్ స్పందించారు.

Allu Arjun – Manchu Vishnu : పుష్ప సినిమాతో నేషనల్ అవార్డు సాధించి తనకంటూ ప్రత్యేక స్థాయిని తెచ్చుకున్నారు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి పుష్ప 2 సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ఇక తెలుగు హీరోల్లో మొదటి నేషనల్ అవార్డ్ సంపాదించిన హీరోగా అల్లు అర్జున్ నిలవగా, తెలుగు సినిమా పరిశ్రమలోని స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలతో పాటు ఇతర సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు సైతం అల్లు అర్జున్‌కు అభినందనలు తెలిపారు.
ఇక ఈ అవార్డు వచ్చిన కొన్ని రోజుల తరువాత తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు.. అల్లు అర్జున్‌ను అభినందిస్తూ, ప్రశంసిస్తూ ఒక లేఖ రాశారు. ఆ లేఖకు మన ఐకాన్ స్టార్ స్పందించారు.
‘మీరు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. ‘పుష్ప’ చిత్రంలో మీ అసాధారణ నటనకు గాను ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డును గెలుచుకున్నందుకు మీకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అంకితభావం, కృషి, అత్యుత్తమ నటన మీకు ఇంతటి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఈ గుర్తింపునకు మీరు ఎంతో అర్హుడు.మీ విజయం మీ అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఎనలేని గర్వాన్ని తీసుకురావడమే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమకు గణనీయమైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది. జాతీయ అవార్డుకు ఎంపికైన తొలి తెలుగు నటుడు కావడం మీ అసమాన ప్రతిభకు, మీ నైపుణ్యానికి నిదర్శనం. మీ విశేషమైన విజయం మన పరిశ్రమలో సమర్థతకు కొత్త నిదర్శనం. మీరు సాధించిన విజయంతో ఇతర తెలుగు నటీనటులు జాతీయ వేదికపై అలాంటి గుర్తింపు కోసం ఆకాంక్షించేలా తలుపులు తెరుచుకున్నాయి.మీరు మీ అసాధారణమైన నటనతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా భావితరాల నటీనటులు మీ అడుగుజాడల్లో నడవడానికి మార్గం సుగమం చేశారన్నది నిజంగా స్ఫూర్తిదాయకం. పరిశ్రమలో ఉన్న హద్దులు దాటి విభిన్నమైన పాత్రలను అన్వేషించడం పట్ల మీ అంకితభావం అందరి హృదయాలను దోచుకోవడమే కాకుండా జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకి ఉన్న అపారమైన సామర్థ్యాన్ని చూపించింది
నేను ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాను. ఈ సమయంలో మీకు వ్యక్తిగతంగా నా అభినందనలు తెలియజేయలేకపోతున్నాను. అయితే, నేను 17వ తేదీన హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నాను. మిమ్మల్ని వ్యక్తిగతంగా కలుసుకోవడానికి, నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.డియర్ బన్నీ, మీరు సాధించిన ఈ అసాధారణ విజయానికి మరోసారి మీకు నా అభినందనలు. రాబోయే సంవత్సరాల్లో మీ ప్రయాణం భారతీయ సినిమా స్థితిగతిని ప్రేరేపించేలా, ప్రభావితం చేసేలా కొనసాగుతుంది’’ అని పెద్ద లేఖ రాసుకు వచ్చాడు మంచు విష్ణు.
ఇక ఈ లేఖకు సమాధానముగా ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు, ప్రెసిడెంట్ మంచు విష్ణు గారుకి నా కృతజ్ఞతలు’ అంటూ రాసుకు వచ్చారు బన్నీ. అంతేకాదు విష్ణు ప్రశంసలు తన మనసును హత్తుకున్నాయన్నారు. ఈ ఆనందాన్ని త్వరలోనే వ్యక్తిగతంగా కలుసుకుని పంచుకుంటానని అన్నారు.
