Akshay Kumar IPL: కోట్ల ఐపీఎల్ కాంట్రాక్టును ఒక్క మాటతో వద్దన్నాడు.. అక్షయ్ ది ఎంత మంచి మనసు?
2009 సీజన్‌లో అప్పటి ఢిల్లీ డేర్‌డెవిల్స్ నష్టాల బాట పట్టడంతో అక్షయ్ కుమార్‌తో చేసుకున్న మూడేళ్ల కాంట్రాక్ట్‌ను మధ్యలోనే వదిలేసిందట. అయితే కాంట్రాక్ట్ ప్రకారం అక్షయ్ తనకు రావాల్సిన భారీ మొత్తాన్ని వదులుకుని తన మంచి మనసు చాటుకున్నాడట.

Akshay Kumar IPL: అనేక దశాబ్దాలుగా బాలీవుడ్ మరియు క్రికెట్ మధ్య మంచి అనుబంధం ఉంది. భారతదేశంలోని ఈ రెండు వినోద వనరులు దేశ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చాక ఈ అనుబంధం మరింత పెరిగింది. ఫ్రాంచైజీ యజమానులుగా బాలీవుడ్ తారలు ఎంట్రీ ఇవ్వడమే అందుకు కారణం. అంతేకాదు లీగ్ ఆరంభంలో ఎందరో హీరో, హీరోయిన్లు బ్రాండ్ అంబాసిడర్‌లుగా కూడా వ్యవరించారు. అందులో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఉన్నాడు. ఈ విషయం చాలా మందికి తెలియదు. అయితే అక్షయ్‌కి సంబందించిన ఓ న్యూస్ తాజాగా బయటికోచ్చింది.
ఢిల్లీ జట్టు కోసం.. కాంట్రాక్టు.. రద్దు..
2009 సీజన్‌లో అప్పటి ఢిల్లీ డేర్‌డెవిల్స్ నష్టాల బాట పట్టడంతో అక్షయ్ కుమార్‌తో చేసుకున్న మూడేళ్ల కాంట్రాక్ట్‌ను మధ్యలోనే వదిలేసిందట. అయితే కాంట్రాక్ట్ ప్రకారం అక్షయ్ తనకు రావాల్సిన భారీ మొత్తాన్ని వదులుకుని తన మంచి మనసు చాటుకున్నాడట. ఈ విషయాన్ని మాజీ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ అమృత్ మాథుర్ ఆటో బయోగ్రఫీ ‘పిచ్‌సైడ్: మై లైఫ్ ఇన్ ఇండియన్ క్రికెట్’ పుస్తకంలో తెలిపాడు. 2008లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఎంట్రీ ఇవ్వగా.. ప్రమోషనల్ ఫిల్మ్, ఈవెంట్లలో పాల్గొనడం, కార్పొరేట్ ఈవెంట్లకు హాజరు కావడం వంటి బాధ్యతలతో కూడిన కాంట్రాక్ట్‌ను అక్షయ్‌తో కుదుర్చుకుంది. మరుసటి ఏడాదికే ఢిల్లీ నష్టాల బాట పట్టడంతో పొదుపు చర్యలకు దిగింది. ఇందులో భాగంగానే అక్షయ్‌తో డీల్ క్యాన్సిల్ చేసుకుంది.
సంక్షోభంతో కాంట్రాక్టు రద్దుకు..
అక్షయ్ కుమార్ సేవలను ఎలా వినియోగించుకోవాలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు తెలియలేదు. 2009 సీజన్ ముగింపు సమయంలో ఆర్థిక నష్టాలు తలెత్తాయి. దీంతో అక్షయ్‌తో ఒప్పందాన్ని రద్దు చేయడం లేదా కాంట్రాక్ట్‌పై మళ్లీ చర్చలు చేయాలని ఢిల్లీ నిర్ణయానికొచ్చింది. అయితే కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం అక్షయ్‌తో డీల్‌ను రద్దు చేయడం కష్టం. మూడేళ్ల కాలానికి ఇచ్చిన కాంట్రాక్ట్‌లో గ్యారంటీలు ఉన్నాయి. దీంతో అక్షయ్ సిబ్బందిని ఢిల్లీ జట్టు లాయర్లు కలిశారు. కాంట్రాక్ట్ రద్దు చేసుకునేందుకు వారు సుముఖంగా లేరు. మధ్యలో కాంట్రాక్ట్‌ను రద్దు చేయాల్సి వస్తే మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. నాటి పరిస్థితిలో ఇది డీడీకి సాధ్యం కాలేదు.
జట్టు కోసం కోట్లు వదులుకున్న హీరో..
దీంతో నేరుగా అక్షయ్‌తోనే మాట్లాడాలని ఢిల్లీ యాజమాన్యం డిసైడ్ అయ్యింది. అప్పుడు ‘చాందినీ చౌక్ టు చైనా’ సినిమా షూటింగ్‌లో అక్షయ్ ఉన్నాడు. నాటి బీసీసీఐ మాజీ మేనేజర్, ఢిల్లీ జట్టు అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న మధుర్, ఢిల్లీ యాజమాన్యంతో కలిసి అక్షయ్ వద్దకు వెళ్లారు. పరిస్థితిపై వివరణ ఇచ్చి.. విషయం చెప్పారు. అది విన్న అక్షయ్.. వర్కౌట్ కానప్పుడు వదిలేద్దాం అని అన్నాడు. న్యాయపరమైన చిక్కులు గురించి కూడా అక్షయ్‌తో మాట్లాడితే.. ‘నేను మా లాయర్‌కు చెప్తా అన్నాడు’. దాంతో ఢిల్లీ సమస్య కొంత తీరింది. అయితే ఇంత పెద్ద మొత్తం అక్షయ్ అంత ఈజీగా ఎలా వదులుకోవడంతో చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారు. నిముషాల్లో కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకోవడం మామూలు విషయం కాదు. అందుకే ‘అక్షయ్ మంచి మనసున్నోడు’ అని మాథుర్ పేర్కొన్నారు.
