Ajit Doval Visit Hyderabad: హైదరాబాదులో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్.. చీమ చిటుక్కుమన్నా తెలుసుకునే అధికారులు.. ఇంత సాధన సంపత్తి ఉన్నా… ఇంటెలిజెన్స్ అధికారులు ఉన్నా.. రెండో కంటికి తెలియకుండా జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ తెలంగాణకు వచ్చారు.. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చి వెళ్లారు.. రాష్ట్ర పోలీసులకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు.. భద్రత లేకుండా ఒక కారులో ప్రయాణించారు. కొందరు కీలక వ్యక్తులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.. గంటల తర్వాత తిరుగు ప్రయాణమయ్యారు. అయితే ఈ భేటీలో ఏం చర్చించారు అనేది కీలకంగా ఉంది. అంతర్గత భద్రతకు సంబంధించిన అంశాలు తెరపైకి వచ్చాయని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర సంస్థల వరుస దాడుల నేపథ్యంలో అజిత్ దోవల్ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.

Ajit Doval Visit Hyderabad
ప్రత్యేకంగా భేటీ
ఢిల్లీ నుంచి విమానం ద్వారా హైదరాబాద్ కు వచ్చిన అజిత్ దోవల్ ఒక చిన్న కారులో ఎటువంటి భద్రత లేకుండా కొంతమంది కీలక వ్యక్తులతో భేటీ అయ్యారు.. మూడు గంటల పాటు ఆయన హైదరాబాదులోనే ఉన్నారు. ఈ సమయంలో కీలకమైన చర్చలు జరిపారు.. ఆయన వెంటనే ప్రత్యేక విమానంలో ఢిల్లీ తిరిగి వెళ్లారు.. ఆయన పర్యటనపై రాష్ట్ర పోలీసులకు, నిఘా విభాగానికి ఎటువంటి సమాచారం లేదు. అత్యంత గోప్యంగా ఆయన పర్యటన జరిగిందంటే ఏదైనా బలమైన కారణం ఉండి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. ఇక అజిత్ దోవల్ ఏది చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది. పాకిస్తాన్ లో ఆయన ఎంతో కాలం రహస్యంగా ఉన్నారు. మారువేషాల్లో చివరికి భిక్షగాడివేషం లోనూ గూడ చర్యం చేసి భారతదేశానికి కీలక సమాచారం అందించారు. అమృత్ సర్ స్వర్ణ దేవాలయంలో ఉగ్రవాదులు చొరబడ్డ సమయంలో ఒక రిక్షావాలా వేషంలో అక్కడికి వెళ్లి పరిస్థితులను ఎప్పటికప్పుడు దేశ అంతర్గత భద్రత సిబ్బందికి చేరవేశారు. ఇలా ఆయన ఎన్నో ఆపరేషన్లలో పాల్గొన్నారు.

Ajit Doval Visit Hyderabad
బలమైన కారణం ఏమిటి
అజిత్ దోవల్ అత్యంత రహస్యంగా హైదరాబాద్ వచ్చి వెళ్లడం వెనుక బలమైన కారణం ఉంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి.. ఇటీవల హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మూలాలు బయటపడటం, రాష్ట్రంలో వరుసగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, కేంద్ర దర్యాప్తు సంస్థల వరుస దాడుల నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. చివరిసారిగా దోవల్ గత ఏడాది నవంబర్ లో హైదరాబాద్ వచ్చారు. అప్పట్లో జాతీయ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ ల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.. కెడేట్ల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు.. అయితే ఆయన పర్యటన ఈసారి మాత్రం ఎటువంటి సమాచారం లేకుండా జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసు వర్గాలు ఆయన పర్యటనపై ఆరా తీస్తున్నాయి. ఇంటెలిజెన్స్ వర్గాలకు కూడా సమాచారం లేదంటే తెర వెనుక ఏదో జరిగి ఉంటుందనే అనుమానం రాష్ట్ర పోలీసుల్లో కలుగుతున్నది.