AP Congress : ఏపీ కాంగ్రెస్ కొత్త చీఫ్ గా గిడుగు రుద్రరాజు, కొత్త కార్యవర్గం ఇదే.. కేవీపీ ముద్ర.. కిరణ్ కు షాక్
AP Congress : ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ బలమైన పార్టీ. వైఎస్ఆర్ హయాంలో శత్రుదుర్భేద్యంగా ఉండేది. టీడీపీని రెండు సార్లు అధికారానికి దూరం చేసి ఎక్కడ చూసినా కాంగ్రెస్ నేతలే కనిపించేవారు. రెండు సార్లు ఏపీలో అధికారం కొల్లగొట్టి బలమైన పార్టీగా ఉండేది. కానీ ఏపీ విభజన.. తెలంగాణ, అవిభాజ్య ఏపీ ఏర్పాటుతో కాంగ్రెస్ కుదేలైంది. రెండు రాష్ట్రాల్లోనూ అధికారానికి దూరమైంది. ఇక ఏపీలో అయితే అసలు ఉనికి లేకుండా పోయింది. రాష్ట్ర విభజన తర్వాత […]

AP Congress : ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ బలమైన పార్టీ. వైఎస్ఆర్ హయాంలో శత్రుదుర్భేద్యంగా ఉండేది. టీడీపీని రెండు సార్లు అధికారానికి దూరం చేసి ఎక్కడ చూసినా కాంగ్రెస్ నేతలే కనిపించేవారు. రెండు సార్లు ఏపీలో అధికారం కొల్లగొట్టి బలమైన పార్టీగా ఉండేది. కానీ ఏపీ విభజన.. తెలంగాణ, అవిభాజ్య ఏపీ ఏర్పాటుతో కాంగ్రెస్ కుదేలైంది. రెండు రాష్ట్రాల్లోనూ అధికారానికి దూరమైంది. ఇక ఏపీలో అయితే అసలు ఉనికి లేకుండా పోయింది.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో నామమాత్రంగా మారిన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అయ్యింది. ఇప్పటివరకూ ఏపీ అధ్యక్షుడిగా ఉన్న శైలజానాథ్ ను పక్కనపెట్టిన కొత్త కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆయన స్థానంలో గిడుగు రుద్రరాజును నియమించారు. వర్కింగ్ ప్రెసిడెంట్లతోపాటుగా పలు కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కూర్పు మొత్తం చూస్తే ఇందులో ఒకప్పటి వైఎస్ఆర్ ఆత్మ, కేవీపీ రాంచంద్రరావు మార్క్ కనిపిస్తోంది.
ఇక పీసీసీ చీఫ్ పదవిలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అందరికంటే ముందు ఉంటారని అందరూ ఆశించారు. ఆయనకు కీలక పదవి దక్కుతుందని అనుకున్నారు. కానీ కిరణ్ కు నామమాత్రపు పదవికి పరిమితం చేయడం అందరినీ షాక్ కు గురిచేసింది. పార్టీ పీసీసీ పగ్గాలు వదిలేసి వ్యవసాయం చేసుకుంటున్న సీనియర్ కాంగ్రెస్ నేత రఘువీరాకు బాధ్యతలు కేటాయించడం విశేషం.
-ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు
ఏపీ పీసీసీ చీఫ్ గా గిడుగు రుద్రరాజును నియమిస్తూ పార్టీ అధినేత మల్లిఖార్జున ఖర్గే నిర్ణయం తీసుకున్నారు. తొలి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండడంతోపాటుగా అధినాయకత్వంతో సత్సంబంధాలు కలిగిన రుద్రరాజుకు ఏపీ బాధ్యతలను కేటాయించారు. గిడుగుపై ఇప్పుడు పెద్ద బాధ్యత ఉంది. 2014కు ముందు కాంగ్రెస్ ఏపీలో ఎంత బలంగా ఉందో అంతటి స్థాయికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. 2014, 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కస్థానం కూడా గెలుచుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు మారడంతో.. ఏపీలోని అధ్యక్షుడి మార్పు జరిగింది. రుద్రరాజుకు ఇప్పుడు ఏపీ పగ్గాలు సవాల్ గా మారనున్నాయి.
-మిగతా పీసీసీ కార్యవర్గం ఇదీ
ఇక పీసీసీ చీఫ్ తోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మస్తాన్ వలీ, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, పీ. రాజేశ్ రెడ్డిలను నియమించారు. ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్ గా పల్లంరాజు నియమితులయ్యారు. క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గా హర్షకుమార్ కు బాధ్యతలు అప్పగించారు. మీడియా, సోషల్ మీడియా కమిటీ చైర్మన్ గా తులసిరెడ్డి నియామకం అయ్యారు.
ప్రస్తుత పీసీసీ చీఫ్ రుద్రరాజు సీనియర్ నేత కేవీపీకి అత్యంత సన్నిహితుడని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఆయన నియామకం వెనుక కేవీపీ చక్రం తిప్పారని అంటున్నారు. శైలజానాథ్ యాక్టివ్ గా ఉండకపోవడం.. రఘువీరా పార్టీ బాధ్యతలు వద్దనడంతో రుద్రరాజు పేరును కేవీపీ ప్రతిపాదించారని.. ఆయన నియామకం వెనుక కేవీపీ ఉన్నారని అంటున్నారు.
ఇక ఏపీ కాంగ్రెస్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీని నియమించారు. అందులో కాంగ్రెస్ సీనియర్ జాతీయ నేతలు ఉమెన్ చాందీ, క్రిస్టోఫర్ తికల్, కేవీపీ, రఘువీరారెడ్డి, శైలజానాథ్, రుద్రరాజు, పళ్లంరాజు, చింతామోహన్, సుబ్బిరామిరెడ్డి, జేడీ శీలం, జవీ హర్షకుమార్, బాపిరాజు, తులసిరెడ్డి, కొప్పుల రాజు, మస్తాన్ వలీ, ప్రసాద్, ఉషానాయుడలకు చోటు దక్కింది.
ఇక 33 మందితో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో కిరణ్ కుమార్ రెడ్డికి కీలక పదవి దక్కకపోవడం గమనార్హం. ఆయనకు కోఆర్డినేషన్ కమిటీలో మాత్రమే అవకాశం కల్పించారు. ప్రస్తుతం కిరణ్ ఏపీ కాంగ్రెస్ లో యాక్టివ్ గా లేరు. ఆయన సోదరుడు కిషోర్ టీడీపీలో ఉన్నారు. కాంగ్రెస్ వ్యవహారాలతో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. అందుకే కాంగ్రెస్ సీఎంగా చేసిన కిరణ్ ను పక్కనపెట్టినట్టు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ PCC అధ్యక్షుడుగా గిడుగు రుద్రరాజు నియామకం pic.twitter.com/ee9bBygInm
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) November 23, 2022
