
Aha Naa Pellanta
Aha Naa Pellanta: కామెడీ చిత్రాలకు దర్శకుడు జంధ్యాల ఓ లైబ్రరీ. హాస్యంలో ప్రత్యేకమైన శైలి సృష్టించిన జంధ్యాల దశాబ్దాల పాటు హాస్య ప్రియులకు వినోదం పంచారు. ఈ తరం దర్శకులు కూడా ఆయన సినిమాలను రిఫర్ చేస్తూ ఉంటారు. జంధ్యాల చిత్రాల్లోని హాస్య సన్నివేశాలు, పాత్రలను స్ఫూర్తిగా తీసుకుని కామెడీ రాసుకుంటారు. జంధ్యాల తెరకెక్కించిన హాస్యపు ఆణిముత్యాల్లో ‘అహనా పెళ్ళంట’ మొదటి స్థానంలో ఉంటుంది. టైం లెస్ కామెడీ చిత్రంగా అహనా పెళ్ళంట నిలిచిపోయింది. అద్భుతమైన పాత్రలు సృష్టించిన జంధ్యాల అత్యద్భుతమైన క్యాస్టింగ్ సెట్ చేసుకున్నారు. దీంతో ఒక వెండితెర నవ్వుల వండర్ ఆవిష్కృతమైంది.
దగ్గుబాటి రామానాయుడు గారు ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ చేయాలనుకున్నారు. దానికి జంధ్యాల కరెక్ట్ ఛాయిస్ అనుకున్నారు. అప్పటికే జంధ్యాల టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఉన్నారు. రచయిత ఆదివిష్ణు పల్లకి వార పత్రిక కోసం రాసిన ‘సత్యం గారి ఇల్లు’ నవల కథగా ఎంచుకున్నారు. సినిమా చేయడానికి అవసరమైన కమర్షియల్ అంశాలు జోడించి మార్పులు చేర్పులు చేశారు. క్యాస్టింగ్ విషయంలో కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకున్నాయి. రాజేంద్ర ప్రసాద్, రజనీలను హీరో హీరోయిన్ గా ఎంచుకున్నారు.
రావుగోపాలరావుకు అనుకున్న పాత్ర కోటా శ్రీనివాసరావు దక్కింది. సుత్తివేలు బిజీగా ఉండటంతో ఎక్కడో అత్తిలిలో పాఠాలు చెప్పుకుంటున్న బ్రహ్మానందం పంట పండింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, పల్లెటూళ్లలో జంధ్యాల చకచకా షూటింగ్ పూర్తి చేశారు. చెన్నైలో ప్రీమియర్ షో వేయగా అద్భుత రెస్పాన్స్ వచ్చింది. మూవీ విజయంపై యూనిట్ లో ఆశలు కలిగాయి. 1987 నవంబర్ 27న విడుదల చేశారు.
రామానాయుడు ఊహించిన దానికి పదిరెట్లు అధిక విజయం సాధించింది. కోటా-బ్రహ్మానందం కామెడీ నభూతో నభవిష్యత్. వారిద్దరి యాక్టింగ్ ఎంత సహజంగా ఉందంటే మరొకరు ఆ పాత్రలకు న్యాయం చేయలేరేమో అన్నంతగా. రాజేంద్రప్రసాద్-రజిని కెమిస్ట్రీ కుదిరింది. రమేష్ నాయుడు మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై వసూళ్ల వర్షం కురిపించింది.

Aha Naa Pellanta
అహనా పెళ్ళంట థియేటర్స్ ఎదుట హౌస్ ఫుల్ బోర్డ్స్ వెలిశాయి. వందల రోజులు నాలుగు షోలతో ఆడింది. ముఖ్యంగా కోటా , బ్రహ్మానందంల కెరీర్స్ కి బలమైన పునాది వేసిన చిత్రంగా నిలిచిపోయింది. ఆ సినిమాతో బ్రహ్మానందం ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. కుప్పల తెప్పలుగా ఆఫర్స్ వచ్చిపడ్డాయి. హీరో,హీరోయిన్ కి మించి కోటా, బ్రహ్మానందం చేసిన లక్ష్మీపతి, అరగుండు పాత్రల గురించి ప్రేక్షకులు చెప్పుకున్నారు. ఇక ఈ సినిమాకు వచ్చిన లాభం చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి. కేవలం రూ. 16 లక్షల బడ్జెట్ తో నిర్మించగా ఏకంగా రూ. 5 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.