Aditya L1 Solar Mission: సూర్యుడికి చేరువగా.. ఇస్రో అనుకున్నట్టుగానే ఆదిత్య పయనం
ఆదిత్య-ఎల్1 మొత్తం ఏడు పేలోడ్లను తీసుకుని నింగిలోకి ఎగిరింది. వాటిలో ముఖ్యమైనది. విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ (వీఈఎల్‌సీ). ఈ మిషన్‌లో ఇదే అత్యంత క్లిష్టమైన సాధనం. దీని బరువు 190 కిలోలు.

Aditya L1 Solar Mission: ఇస్రో చేపట్టిన సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1 లక్ష్యం దిశగా సాఫీగా సాగుతోంది. ప్రస్తుతం భూకక్ష్యలో తిరుగుతున్న ఈ వ్యోమనౌకకు తొలి కక్ష్య పెంపు ప్రక్రియను విజయవంతంగా చేపట్టినట్టు ఇస్రో ఆదివారం ప్రకటించింది. బెంగళూరులోని ఇస్ట్రాక్ ఉపగ్రహ నియంత్రణ కేంద్రం నుంచి ఈ విన్యాసాన్ని చేపట్టినట్టు వెల్లడించింది. దీంతో ప్రస్తుతం ఆదిత్య 245 కి.మీ. – 22,459 కి.మీ. కక్ష్యలోకి ప్రవేశించిందని ఇస్రో ఎక్స్ (ట్విటర్)లో పేర్కొంది. తదుపరి కక్ష్య పెంపు ప్రక్రియను మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు చేపడతామని తెలిపింది. తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి శనివారం ఉదయం 11:50 గంటలకు ఆదిత్య-ఎల్1 ఉపగ్రహాన్ని తీసుకుని నింగిలోకి ఎగిరిన పీఎస్‌ఎల్వీ-సీ57 రాకెట్ దాన్ని 63 నిమిషాల్లో భూకక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇది 16 రోజులపాటు భూకక్ష్యలోనే తిరిగి.. ఆ తర్వాత భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్1 పాయింట్ దిశగా పయనించనుంది. ఇది ఎల్1 కక్ష్యలోకి చేరడానికి 125 రోజులు పడుతుంది.
సూర్యుడికి ఎంత దగ్గరగా వెళ్తుందంటే..?
ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 చందమామ ఉపరితలంపై దిగింది. అయితే ఆదిత్య-ఎల్1 మాత్రం సూర్యుడిపై దిగదు. ఎందుకంటే అక్కడ మండే ఉష్ణోగ్రతలను ఇది తట్టుకోలేదు. అందుకే సూర్యుడిని పరిశీలించేందుకు దీన్ని సూర్య-భూ వ్యవస్థ కక్ష్యలోనే ఉంచనున్నారు. భూమి నుంచి సూర్యుడికి మధ్య దూరం 15 కోట్ల కిలోమీటర్లు కాగా.. ఆదిత్య-ఎల్1 వెళ్లేది 15 లక్షల కిలోమీటర్ల వరకు మాత్రమే. అంటే భూమి నుంచి సూర్యుడికి మధ్య ఉన్న దూరంలో ఇది ఒక వంతు మాత్రమే. అక్కడి లాగ్రేంజియన్ (ఎల్1) కక్ష్య నుంచి ఇది సూర్యుడిపై పరిశోధనలు చేస్తుంది. ఆదిత్య-ఎల్1లో ఉండే ఏడు పేలోడ్లు సూర్యుడి పొరలైన ఫొటోస్పియర్, క్రోమోస్పియర్, సౌర కరోనాను అధ్యయనం చేస్తాయి. అలాగే సౌర జ్వాలలు, సౌర రేణువుల గురించి ఎన్నో అంశాలను శోధిస్తాయి.
రోజుకి 1440 ఫొటోలు పంపే వీఈఎల్‌సీ
ఆదిత్య-ఎల్1 మొత్తం ఏడు పేలోడ్లను తీసుకుని నింగిలోకి ఎగిరింది. వాటిలో ముఖ్యమైనది. విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ (వీఈఎల్‌సీ). ఈ మిషన్‌లో ఇదే అత్యంత క్లిష్టమైన సాధనం. దీని బరువు 190 కిలోలు. ఇది నిర్దేశిత కక్ష్యకు చేరుకున్నాక రోజుకు 1440 ఫొటోలు తీసి ఇస్రోకు పంపుతుంది. ఇది ఐదేళ్లపాటు సేవలందిస్తుంది. ఇంధనం మిగిలి ఉంటే మరింత ఎక్కువ కాలం పనిచేస్తుంది. దీంతోపాటు మరో ఆరు పేలోడ్లు దీనిలో ఉన్నాయి. సోలార్ ఆలా్ట్రవైలెట్ ఇమేజింగ్ టెలీస్కోప్… అనేది సూర్యుడిలోని ఫొటోస్పియర్, క్రోమోస్పియర్ ప్రాంతాలను చిత్రీకరిస్తుంది. తద్వారా సౌర రేడియోధార్మికతను కొలుస్తుంది. సోలార్ లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రో మీటర్ (సొలెక్సెస్), హై ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెకో్ట్రమీటర్ (హెచ్‌ఈఎల్1 ఓస్).. ఈ రెండూ సూర్యుడి నుంచి వెలువడే ఎక్స్‌రే జ్వాలలను అధ్యయనం చేస్తాయి. ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పెరిమెంట్ (ఆస్పెక్స్), ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య (పాపా).. ఈ రెండు పరికరాలు సౌర గాలులు, ఆవేశిత అయాన్లు, వాటిలో శక్తి విస్తర తీరుని పరిశీలిస్తాయి. ఇక మాగ్నెటోమీటర్.. ఎల్1 బిందువు వద్ద అయస్కాంత క్షేత్రాలను అధ్యయనం చేస్తుంది.
ఆదిత్య-ఎల్1 ఎందుకు..?
భారత దేశపు మొట్టమొదటి సౌర అన్వేషణ మిషన్‌కు ఇస్రో ఆదిత్య-ఎల్1 అని పేరు పెట్టింది. సూర్యుడిపై అధ్యయనం చేయడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. సంస్కృతంలో ఆదిత్య అంటే సూర్యుడు. ఇక ఎల్1 అనేది సూర్యు-భూమి వ్యవస్థలో కీలకమైన స్థానమైన లాగ్రేంజ్ పాయింట్1ను సూచిస్తుంది. ఇది భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. అందుకే ఈ మిషన్‌కు ఆదిత్య-ఎల్1 అనే పేరుపెట్టారు. ‘ఎల్1 అనేది సూర్యుడు, భూమి వంటి రెండు ఖగోళ వస్తువుల గురుత్వాకర్షణ బలాలు సమతాస్థితిలో ఉన్న అంతరిక్షంలోని ఒక ప్రదేశం. దీనివల్ల అక్కడ ఉంచిన ఒక వస్తువు రెండు ఖగోళ వస్తువులకు సంబంధించి సాపేక్షంగా స్థిరంగా ఉంటుంది’ అని ఇస్రో చెబుతోంది.
