Adani Group: ఆయనో అపరకుబేరుడు. ఆయన నికర సంపద 120 బిలియన్ డాలర్లు. మూడేళ్లకు ముందు ఆయన సంపద 20 బిలియన్ డాలర్లు అయితే మూడేళ్ల తర్వాత 120 బిలియన్ డాలర్లు. అంటే మూడేళ్లలోనే 100 బిలియన్ డాలర్ల సంపద పెరిగింది. ఆసియాలోనే ధనవంతుడిగా ఆయన పేరు రికార్డులకెక్కింది. ఆయన అడుగుపెట్టని వ్యాపారం లేదు. పట్టిందల్లా బంగారమే అన్నట్టు ఆయన ప్రస్థానం కొనసాగింది. కానీ ఓ పరిశోధక సంస్థ ఆరోపణ ఆయన వ్యాపారాల్ని నట్టేట ముంచుతోంది. షేర్ హోల్డర్లకు జాగ్రత్త అంటూ హెచ్చరిక జారీ చేస్తోంది. ఇంతకీ కథేంటో తెలుసుకోండి.

Adani Group
గౌతమ్ అదానీ.. ఈ పేరు తెలియని వారు ఉండరు. అనితరసాధ్యమైన వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించారు. అనతికాలంలోనే వ్యాపార రంగంలో ఆకాశమే హద్దుగా ఎదిగారు. కానీ హిండెన్ బర్గ్ అనే ఇన్వెస్ట్మెంట్ రీసర్చ్ సంస్థ ఆరోపణలు ఆయన కంపెనీల షేర్లను నేలచూపులు చూసేలా చేస్తున్నాయి. హిండెన్ బర్గ్ సంస్థ.. అదానీ కంపెనీల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు చేసింది. కంపెనీల్లో అకౌంటింగ్ మోసాలు జరుగుతున్నాయని హెచ్చరించింది. కొన్ని విదేశాల్లో డొల్ల కంపెనీలు సృష్టించి అక్రంగా మనీ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారంటూ ఆరోపించింది. అదానీ కంపెనీల ఆర్థిక ఫలితాలు, వాటి ఫేస్ వాల్యూ ఆధారగా పరిశీలిస్తే ఇన్వస్టర్లకు మొత్తం పరిస్థితి అర్థం అవుతుందని హిండెన్ బర్గ్ సూచిస్తోంది.
అదానీ కంపెనీల ఆర్థిక ఫలితాలు నేలపై ఉంటే.. వాటి షేర్ల విలువలు ఆకాశంలో ఉన్నాయని హిండెన్ బర్గ్ స్పష్టం చేసింది. అదానీ కంపెనీల్లోని మాజీ ఉద్యోగులతో చర్చించి, వివిధ దేశాల్లోని కార్యాలయాలు పరిశీలించాకే ఈ రిపోర్ట రూపొందించామని చెబుతోంది. హిండెన్ బర్గ్ రీసర్చ్ చేసిన ఆరోపణలు లాంటివే గతంలో ఫిచ్ గ్రూప్ కి చెందిన క్రెడిట్ రైట్స్ ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ తీసుకున్న అప్పులు ఆందోళనకరంగా ఉన్నాయని హెచ్చరించింది. మూడేళ్ల కాలంలో అదానీ షేర్లు భారీగా లాభపడ్డాయి. ఒక్కో కంపెనీ దాదాపు 819 శాతం లాభపడింది. కానీ కంపెనీ స్టాక్ రిటర్న్ తగ్గట్టుగా వాటి ఆర్థిక ఫలితాలు ఉండటంలేదు. స్టాక్ మార్కెట్ పరిభాషలో ఓవర్ వాల్యూడ్ పొజిషన్ లో ఉన్నాయని చెప్పవచ్చు.

Adani Group
అదానీ కంపెనీల షేర్ల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో అదానీ సంపద కూడ పెరిగింది. పెరిగిన కంపెనీల షేర్ల వాల్యూను చూపించి అదానీ కంపెనీ అప్పులు తీసుకుంది. భవిష్యత్తులో ఇది అదానీ కంపెనీలకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. తీసుకున్న అప్పులు సమయానికి చెల్లించకపోతే.. వడ్డీ పెరిగిపోతుంది. కంపెనీ లాభాలు వడ్డీ కట్టడానికి కూడ సరిపోని పరిస్థితుల్లో షేర్ హోల్డర్ల విశ్వాసం సన్నగిల్లుతుంది. ఫలితంగా తమ షేర్లను అమ్ముకుంటారు. దీంతో అదానీ కంపెనీల పై అమ్మకాల ఒత్తిడి పడుతుంది. అప్పుడు అదానీ కంపెనీల వాల్యూ పడిపోతుంది. ఏ వాల్యూను చూపి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నారో… ఆ బ్యాంకుల పై ఒత్తిడి పెరుగుతుంది. ఆ బ్యాంకులు తమ తాకట్టులో ఉన్న షేర్లను తెగనమ్ముతాయి. దీంతో ఒక పెద్ద ఆర్థిక సంక్షోభమే ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుంది.
హిండెన్ బర్గ్ రీసర్చ్ ఆరోపణలను అదానీ కంపెనీ కొట్టిపారేసింది. అవన్నీ ద్వేషపూరితం, నిరాధారం అని తేల్చిచెప్పింది. తమపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీయడానికి చేసిన ఆరోపణలుగా అదానీ కంపెనీ చెప్పింది. అయితే అదానీ కంపెనీలు అప్పులతో ప్రయాణం చేయడం కంపెనీతో పాటు షేర్ హోల్డర్లకు ప్రమాదమని విశ్లేషకులు చెబుతున్నారు. అకౌంటింగ్ మోసాల ఆరోపణల నేపథ్యంలో చిన్నచిన్న పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.