Mahesh babu: సినిమాలు, షూటింగులు, విదేశీ టూర్లతో ఎప్పుడూ బిజి బిజిగా ఉండే సూపర్ స్టార్ మహేష్ బాబు గత రెండు వేవ్ ల నుంచి తప్పించుకున్నాడు. మొదటి వేవ్, రెండో వేవ్ ల సమయంలోనూ కరోనా బారినపడలేదు. కానీ ఇప్పుడు ముచ్చటగా మూడో వేవ్ ముంచుకొస్తున్న వేళ మన మహేష్ బాబు కరోనా బారినపడ్డాడు. ఈ మేరకు తనకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని మహేష్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
‘అన్ని జాగ్రత్తలు తీసుకున్నా తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. స్వల్ప లక్షణాలు ఉన్నాయి. ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నా.. వైద్యుల సలహాలు తీసుకుంటున్నా.. ఇటీవల నన్ను కలిసిన వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోండి.. ఇప్పటివరకూ టీకా తీసుకోని వారు తక్షణమే టీకా తీసుకోండి.. ఇది నా అభ్యర్థన. టీకా తీసుకుంటే ఆస్పత్రిలో చేరే అవకాశాలు తక్కువగా ఉంటాయి.. జాగ్రత్తగా ఉండండి’ అని ట్విట్టర్ లో మహేష్ బాబు విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారి వారి పాట’ చిత్రంలో నటిస్తున్నారు. యాక్షన్ కామెడీ నేపథ్యంలో పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో నటిస్తున్నాడు. ఇటీవల దుబాయ్ లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన షూటింగ్ లో మహేష్ పాల్గొన్నారు. ఇక ఇటీవలే మహేష్ బాబుకు మోకాలి శస్త్రచికిత్స కూడా జరిగింది. ఎక్కడ ఎప్పుడు అంటిందో కానీ ప్రస్తుతం మహేష్ కోవిడ్ బారినపడ్డారు.
మహేష్ కు సోకింది డెల్టానా? లేక ఒమిక్రాన్ వైరస్ నా అన్నది తేలాల్సి ఉంది. మహేష్ కు కోవిడ్ అని తేలడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మహేష్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.