ABN RK – Jagan : జగన్‌ డ్యూయల్‌ లవ్‌ స్టోరీ సరే ఆర్కే.. చంద్రబాబు జాణతనం గురించి రాయగలడా?

ఇదే రాధాకృష్ణ అప్పట్లో రేణూదేశాయ్‌తో ఇంటర్వ్యూ చేయలేదా? ఇదేం వెనుకటి కాలం కాదు కదా! సోషల్‌ మీడియా జమానా నడుస్తోంది. ప్రతీ దానికి ఆధారాలు, రుజువులు ఉంటాయి.

  • Written By: NARESH ENNAM
  • Published On:
ABN RK – Jagan : జగన్‌ డ్యూయల్‌ లవ్‌ స్టోరీ సరే ఆర్కే.. చంద్రబాబు జాణతనం గురించి రాయగలడా?

ABN RK – Jagan : కొన్ని బంధాలు ఎప్పటికీ చిక్కగుంటాయి. రామ్‌కో సిమెంట్‌ లాగా దృఢంగా ఉంటాయి. వాటికి బీటలు వారవు. పగుళ్లివ్వవు. ఇలాంటి బంధాలకు పర్‌ ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ అంటే చంద్రబాబు- రాధాకృష్ణ. ఈనాడు రామోజీరావు అయినా పచ్చస్తోత్రాన్ని పక్కనపెడతాడేమో గాని.. రాధాకృష్ణ పొరబాటున కూడా దూరం పెట్టడు. పైగా అక్షరం అక్షరంలోనూ తన గురు భక్తిని చాటుతాడు. చంద్రబాబు అనుకూలమైన సంఘటన లేదా ఇంకేదైనా జరిగితే చాలు ఆరోజు రాధాకృష్ణ పంట పండినట్టే. పేజీలకు పేజీలు కుమ్మేస్తాడు. షరభ షరభ అంటూ పోతురాజు లాగా ఒళ్లంతా ఛర్నాకోల్‌ కొట్టుకుంటూ నర్తిస్తాడు. ఇక తన పత్రిక ఆంధ్రజ్యోతిలో ప్రతీ ఆదివారం కొత్త పలుకు పేరుతో వర్తమాన రాజకీయాల మీద వ్యాసాలు రాస్తుంటాడు. ఇవి కొన్ని సార్లు నిజమవుతాయి. మరికొన్ని సార్లు గాలికి కొట్టుకుపోయే పేలపిండి అవుతాయి. అయినప్పటికీ ఆర్కేలో జర్నలిస్టిక్‌ టెంపర్‌ మెంట్‌ను తప్పు పట్టలేం.

వరుసగా రెండు వారాలు కేసీఆర్‌ను చెడుగుడు ఆడిన(ఆర్కే, కేసీఆర్‌ బావాబామ్మర్దులు ఈ వైరాన్ని నమ్మలేం) ఆర్కే.. ఈ వారం కాస్త బ్రేక్‌ ఇచ్చి.. జగన్‌ మీద పడ్డాడు. ‘అమ్మా జగనా! భారతీయ జనతా పార్టీతో ప్రేమలో మునిగి తేలుతూ.. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ పైకి కూడా వలపు బాణాలు విసిరావా? ఎంత జాణతనం? వారం వారం అప్పులు చేస్తూ ప్రభుత్వాన్ని నడుపుతూ.. నీ పై ఉన్న కేసులతో పాటు వివేకానందరెడ్డి హత్య కేసును కూడా నీరుగార్చడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకుంటున్నావు. తాజాగా నేనూ మీవాడినే ఎన్నికల తర్వాత మా ఎంపీలు మీకు మద్దతు ఇస్తారు అని కాంగ్రెస్ పెద్దలకు చెప్పడం మాములు విషయం కాదు. కాంగ్రెస్‌ పొడ గిట్టని నరేంద్రమోడీకి ఇవి తెలిస్తే ఏమన్నా ఉందా?’ అని రాధాకృష్ణ రాసుకొచ్చాడు. తన తండ్రి మరణం తర్వాత తనకు సీఎం పదవి ఇవ్వలేదనే అక్కసుతో జగన్‌ పార్టీ పెట్టాడు. జనంలో సింపతీ కోసం పాదయాత్ర చేశాడు. ఓదార్పు యాత్ర చేశాడు. కాంగ్రెస్‌ మీద ఆరోపణలు చేశాడు. చంద్రబాబును ఇరుకున పెట్టాడు. ఒక్క అవకాశం అంటూ 2019లో ఫ్యాన్‌ గాలి వీయించాడు. సరే ఇవన్నీ ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అన్పించవచ్చు. జగన్‌ కూడా రాజకీయ పార్టీ నడుపుతున్నాడు కాబట్టి.. అదేం స్వాములోరి మఠం కాదు కాబట్టి.. తనకూ అవసరాలే ముఖ్యం కాబట్టి.. తన పార్టీకి తనే సుప్రీం కాబట్టి.. అలానే ఉంటాడు. ఇందులో తప్పు పట్టడానికి ఏముంది? కాంగ్రెస్‌తో విభేదించి మమతా బెనర్జీ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఇండియా కూటమిలో చేరింది కదా!

జగన్‌ మీద అంతెత్తున ఎగురుతున్న ఆర్కే.. చంద్రబాబు మీద రాయగలడా? ఆయన ద్వంద్వ ప్రేమల గురించి వివరించగలడా? నాడు మోడీ ప్రభుత్వంతో అంటకాగి… ప్రత్యేకా హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అనలేదా? ప్రత్యేక హోదా అంటే జైల్లో వేస్తా అని బెదిరించలేదా? విపక్షాల కూటమికి ఆర్థిక సాయం చేయలేదా? ఎన్నికల ముందు పవన్‌ కల్యాణ్‌ మద్దతు తీసుకుని, రాజధాని రైతుల కోసం పవన్‌ నిరసన చేస్తుంటే కుల, కూలీ మీడియాతో అడ్డగోలు వార్తలు రాయించలేదా? మూడు పెళ్లిళ్ల గురించి విలువలు, వలువలు వదిలేసి ప్రచారం చేయించ లేదా? ఇదే రాధాకృష్ణ అప్పట్లో రేణూదేశాయ్‌తో ఇంటర్వ్యూ చేయలేదా? ఇదేం వెనుకటి కాలం కాదు కదా! సోషల్‌ మీడియా జమానా నడుస్తోంది. ప్రతీ దానికి ఆధారాలు, రుజువులు ఉంటాయి. అంటే చంద్రబాబు చేస్తే రాజకీయం, మిగతవారు చేస్తే మరొటినా? నాడు చంద్రబాబు నవ్యాంధ్ర సభల పేరుతో మోడీని తిట్టింది నిజం కాదా? కుటుంబాన్ని బయటకు లాగ లేదా? మానసిక ఆరోగ్యం బాగోలేదని సర్టిఫికెట్‌ తెచ్చుకున్న బాలకృష్ణ మోడీని ఎలా తిట్టారో జనం మర్చిపోయారా? ఆ మధ్య మోడీ శరణు జొచ్చింది నిజం కాదా? ఐటీ నోటీసులు రాగానే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను చంద్రబాబు కలిసింది అబద్ధమా? ఆర్కే స్థూలంగా చెప్పేది ఏంటంటే.. మా కులపోల్లే రాజకీయాలు చేయాలి. మేం చెప్పిందే నిజం అనుకోవాలి. మేం ప్రచురించేవే కళ్లకద్దుకుని చదువుకోవాలి.. ఇన్నాళ్లూ ఇలా పరిచిన భ్రమలు ఒక్కొక్కటిగా తొలగి పోతున్నాయి. అందుకే కదా జనం కాండ్రించి 23 దగ్గర నిలబెట్టింది. అయిననూ మారకపోతే ఎలా? ఇలాంటి పచ్చ రాతలేల? అంటే జగనేం సుద్దపూస అని కాదు. సర్వపరిత్యాగి అని చెప్పడం కాదు. చెల్లెతో గొడవ, బాబాయి హత్య కేసు విచారణలో యూటర్న్‌, అమ్మను పార్టీ నుంచి తొలగించడం, కేంద్రం ముందు మోకరిల్లడం.. చెప్పుకుంటే చాలానే ఉన్నాయి. కానీ చంద్రబాబుతో పోలిక అనేసరికి తక్కెడ జగన్‌ వైపు మొగ్గదు. అదీ అసలు తేడా!

Read Today's Latest Ap politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు