PM Modi- Jagan: వైసీపీ సర్కారుకు కేంద్ర ప్రభుత్వం వరుసగా షాకులిస్తోంది. ఆర్థిక క్రమశిక్షణ కట్టుదాటిన ఏపీపై కఠినంగా వ్యవహరించాలన్న నిర్ణయానికి వచ్చినట్టుంది. రెండో వారం సమీపిస్తున్నా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలు ఇచ్చుకోలేని స్థితిని గుర్తించినట్టుంది. శేష జీవితం అనుభవిస్తున్న పింఛనుదారులకు పెన్షన్ అందించలేని దయనీయ స్థితిని తెలుసుకున్నట్టుంది. అందుకే ఇక నుంచి ఆర్థికంగా జగన్ సర్కారును కట్టడి చేయాలని డిసైడ్ చేసుకున్నట్టుంది. ఇప్పటివరకూ ఇచ్చినది.. ఇవ్వాల్సింది లెక్కకట్టి మరీ అప్పజెబుతోంది. వివిధ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం సర్దుబాటు చేసే క్రమంలో ఏపీ నుంచే తమకు ఇంకా బకాయిలు ఉన్నాయని కేంద్రం చెబుతుండడంతో జగన్ సర్కారు ఇప్పుడు బేల చూపులు చూస్తోంది. అసలే ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం సహాయ నిరాకరణ ఇప్పుడు జగన్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

PM Modi- Jagan
కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ, ఇతర రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.982 కోట్లు కేటాయించినట్టు ప్రకటించింది. అయితే ఆ నిధులు మళ్లీ వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది. నిధులు వచ్చాయని సంబరపడిన రాష్ట్రానికి చుక్కెదురయినట్టయ్యింది. కేంద్ర ప్రభుత్వం ప్రతీనెలా రాష్ట్రాలకు జీఎస్టీ రూపంలో వచ్చిన ఆదాయాన్ని సర్దుబాటు చేస్తోంది. అందులో భాగంగా ఏపీ సర్కారుకు సుమారు రూ.1,000 కోట్లు కేటాయించడంతో సర్కారు ఎంతో ఆనంద పడింది. సంక్షోభంలో ఉన్న సమయంలో కొండంత సాయంగా భావించింది. కానీ కేంద్రం ఇచ్చినట్టే ఇచ్చి ఆ నిధులను వెనక్కి తీసుకుంది. పాత సర్దుబాట్లు కింద తిరిగి జమ చేసుకుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు ఆరాతీయగా.. రాష్ట్రం నుంచి పాత బకాయిలు అలానే ఉండిపోయాయని.. అందుకే తిరిగి తామే సర్దుబాటు చేసుకుంటున్నామని సెలవిచ్చారు. దీంతో ఆర్థిక శాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
వాస్తవానికి ఏ రోజు ఎంత మొత్తం ఆదాయం వస్తుంది? ఏ రూపంలో వస్తుందో చెబుతూ ప్రతీరోజూ రాత్రి రిజర్వ్ బ్యాంక్ నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులకు సమాచారం వస్తుంది. అందులో ఆ రాష్ట్రం ఆదాయం, చేసిన అప్పులు, చెల్లింపులు, కేంద్రం నుంచి ఏ రూపంలో ఎంత మొత్తం ఉంటుందో వివరంగా ఉంటుంది. ఆర్థిక శాఖలో ఉన్నతస్థాయి వర్గాలకు చెందిన ఒకరిద్దరికి మాత్రమే వివరాలు తెలుస్తాయి. ఈ నేపథ్యంలో ఇటీవల రూ.1000 కోట్ల నిధులు విడుదలైనట్టు ఉత్తర్వులు వెలువడినా.. నిధులు జమకాకపోయేసరికి ఆర్థిక శాఖ అధికారులు ఆరా తీసేసరికి కేంద్రం చల్లని కబురు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమకావని.. బకాయిల కింద సర్దుబాటు చేసుకున్నామని చెప్పేసరికి రాష్ట్ర అధికారులకు నోట మాట రాలేదు.

PM Modi- Jagan
ప్రస్తుతం ఏపీ సర్కారుకు ఎక్కడా అప్పు పుట్టడం లేదు. పరిమితికి మించి అప్పులు చేయడంతో ఆర్బీఐ సెక్యూరిటీ వేలంలో కూడా చాన్స్ దక్కలేదు. పోనీ ఓవర్ డ్రాప్ట్ కు వెళదామంటే నిర్ఠిష్ట సమయానికి కచ్చితంగా చెల్లించాలి. గడువు దాటితే డిఫాల్టర్ రూపంలో సర్కారు పేరు బయటకు వస్తుంది. అది జరిగితే రాజకీయంగా డ్యామేజ్ జరుగుతుంది. మరోవైపు ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేదు. పింఛన్ దారులకు పెన్షన్ మొత్తం అందలేదు. చాలా మంది ఐఏఎస్ లకు, విభాగాధిపతులకు సైతం జీతాలు పడలేదు. ఈ నెల 15 వరకూ ప్రతీరోజూ కొద్ది కొద్దిగా చెల్లింపులు జరుగుతున్నాయి. తక్కువ శాలరీ ఉన్నవారికి ముందుగా చెల్లింపులు చేస్తున్నారు. జీతాలు, పింఛన్ల రూపంలో ఇంకా రూ.2,900 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది, మరోవైపు క్రిస్మస్ సమీపిస్తోంది. కొందరు ఉద్యోగులు ఈఎంఐల గడువు తీరుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. సంబంధిత కంపెనీల నుంచి ఫోన్లు వస్తుండడంతో అధిక వడ్డీ పడక తప్పదని భావిస్తున్నారు.
అటు అభివృద్ధి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు లేవు. సొంత పార్టీ ప్రజాప్రతినిధులు సైతం చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏళ్ల తరబడి పెండింగ్ లో పెడుతుండడంతో లెక్కకు మించి కోర్టులో పిటీషన్లు వేస్తున్నారు. అటు కోర్టు బిల్లులు చెల్లించాలని ఆదేశాలిస్తోంది. కానీ రకరకాల కారణాల చూపుతూ కోర్టు ఆదేశాలను అమలుచేయడం లేదు. ఉద్యోగుల జీతాలకే ఇబ్బందిపడుతుంటే ఆ చెల్లింపులు చేయలేమన్న డిసైడ్ కు ప్రభుత్వం వచ్చినట్టుంది. చెల్లింపుల నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తోంది. కేసులన్నీ ఆర్బిట్రేషన్ కిందకు తీసుకొచ్చేలా ప్రయత్నిస్తోంది. ఇందుకుగాను కొందరు మాజీ న్యాయమూర్తులను ఆశ్రయిస్తోంది. వారికి భారీగా శాలరీ ప్యాకేజీ ఇచ్చి ఇటువంటి కేసుల బాధ్యతను అప్పగించాలని చూస్తోంది. మొత్తానికై ఏపీ సర్కారు తీవ్ర ఆర్థిక సంక్షోభం దిశగా కూరుకుపోతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలో అదును చూసి మోదీ సర్కారు దెబ్బతీస్తోంది.