111 GO Abolished: జీవో 111 రద్దు వెనుక రాజకీయ ” భూ” ప్రయోజనం: అధికార, ప్రతిపక్షాల చేతిలో వందల ఎకరాలు

గ్రామాల వారీగా ప్రభుత్వ భూమి ఎంత? పట్టా భూమి ఎంత? అని తెలుసుకునేందుకు ధరణిలో ఆప్షన్‌ ఉంది. ఏ సర్వే నెంబరులో ఎంత భూమి ఉంది. అది ఎవరి పేరునా ఉందో కూడా తెలుసుకోవచ్చు. దీంతో పాటు ప్రైవేట్‌ ప్రైవసీ ఆప్షన్‌తో యజమాని తన భూమి వివరాలు ధరణిలో కనిపించకుండా పెట్టుకోవచ్చు. రాజకీయ ప్రముఖులు, అధికారులు, సినీ ప్రరిశ్రమకు చెందిన వ్యక్తులు ప్రైవేట్‌ ప్రైవసీ ద్వారా సర్వే నెంబరు, భూమి విస్తీర్ణం, యజమాని పేరు ధరణి పోర్టల్‌లో కనిపించ కుండా పెట్టుకుంటున్నారు.

111 GO Abolished: జీవో 111 రద్దు వెనుక రాజకీయ ” భూ” ప్రయోజనం: అధికార, ప్రతిపక్షాల చేతిలో వందల ఎకరాలు

111 GO Abolished: రాష్ట్ర ప్రభుత్వం జీవో 111 రద్దు చేసింది. ఫలితంగా లక్ష ఎకరాల భూమి అందుబాటులోకి వచ్చింది. ఈ చర్య వల్ల మరో నూతన హైదరాబాద్ నగర నిర్మాణం ఊపందుకుంటుంది. ఇప్పటికే పాత, కొత్త హైదరాబాద్ నగరాలతో రాష్ట్ర రాజధాని కనివిని ఎరుగని స్థాయిలో అభివృద్ధి చెందింది. ఇప్పుడు లక్ష ఎకరాలు అందుబాటులోకి వస్తే మరింత అభివృద్ధి చెందుతుంది.. ఇదీ ప్రభుత్వం చెబుతున్న లెక్క. కానీ వాస్తవ పరిస్థితి వేరే విధంగా ఉంది. కాయిన్ కు బొమ్మ బొరుసు ఉన్నట్టు.. 111 జీవో రద్దు చేసిన నేపథ్యంలో అందుబాటులోకి వచ్చే భూమి లక్ష ఎకరాలు అయినప్పటికీ.. ఇందులో అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకుల భూములు అధికంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది.

బడా బాబులకు లబ్ధి

రాష్ట్రప్రభుత్వం 111 జీవోను ఎత్తేయాలని తాజాగా తీసుకున్న నిర్ణయం బడా బాబులకు భారీగా లబ్ధి చేకూర్చనుంది. ఈ జీవో పరిధిలోని 84 గ్రామాల్లోని లక్ష ఎకరాల ప్రైవేటు భూముల్లో దాదాపు 70 శాతం ఈ బడా బాబులవే. రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్ లు, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ అధికారులు, వ్యాపారులు, రియల్టర్లదే అక్కడి భూముల్లో సింహభాగం. ఈ జీవో పరిధిలో ఉన్న గ్రామాల్లో మొత్తంగా సుమారు 1.32 లక్షల ఎకరాలు ఉంటుందని అంచనా. ఇందులో గ్రామ కంఠం, ప్రభుత్వ భూములు తదితర స్థలాలు తీసేస్తే లక్ష ఎకరాలు నికరంగా ఉంటుంది. ఇందులో 70 వేల ఎకరాలు పెద్దోళ్ల చేతుల్లోనే ఉంది. మిగిలిన 30 శాతం భూమి మాత్రమే రైతుల చేతుల్లో ఉంది. కొన్ని కొన్ని గ్రామాల్లో అయితే గ్రామ కంఠం భూమి తప్ప మిగిలిన భూమి అంతా పెద్దోళ్ల చేతుల్లోనే ఉంది. కొన్ని గ్రామాల్లో 70 శాతం, మరి కొన్ని గ్రామాల్లో 50 శాతం భూములు వీరి చేతుల్లో ఉన్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీ నుంచి మంత్రుల వరకు జీవో 111 పరిధిలోభూములను కొనుగోలు చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో కీలక పాత్ర పోషిస్తున్న ఐదుగురు మంత్రులకు పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి.

రాజకీయ నాయకులకు..

కొందరు ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, ప్రస్తుత ఎంపీలు వందల ఎకరాల భూమి ఫాంహౌజ్‌ల రూపంలో ఉంచుకున్నారు. అధికార పక్షమే కాకుండా ప్రతిపక్షానికి చెందిన ప్రజాప్రతినిధులకు కూడా భారీగా భూములు ఉన్నాయి. గత ఏడాది ఒక ఎంపీ వందల ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ ఏడాదిలోనూ అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు పదుల ఎకరాల నుంచి వందల ఎకరాలు కొన్నారు. అంటే వీరికి 111 జీవోను ఎత్తేస్తారని సమాచారం ముందుగానే ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రముఖులంతా జీవో 111 పరిధిలోనే వేల ఎకరాల భూములు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న మొయినాబాద్‌, శంకర్‌పల్లి, చేవెళ్ల, గండిపేట, శంషాబాద్‌, షాద్‌నగర్‌, షాబాద్‌ మండలాల్లో రాజకీయ నేతలతో పాటు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున భూములు కలిగి ఉన్నారు. క్యారెక్టర్‌ ఆర్టిస్టు నుంచి కమెడియన్‌ వరకు, విలన్‌ ఆర్టిస్టు నుంచి హీరోల దాకా ఇక్కడ భూములు కొనుగోలు చేసిన వారి జాబితాలో ఉన్నారు. సినీ పరిశ్రమలో పేరు మోసిన నిర్మాతలు, దర్శకులకు సైతం ఈ జీవో పరిధిలో పట్టా భూములున్నాయి. ఇక ఐఎఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ ఉన్నతాధికారులు కూడా ఇక్కడి ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు కలిగి ఉన్నారు.

ఎంపీకి 650 ఎకరాలు

అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీకి ఏకంగా 650 ఎకరాలు భూమి ఉంది. ఈ ఎంపీ గత ఏడాదే వందల ఎకరాల భూములను 111 జీవో పరిధిలో కొనుగోలు చేశారని విశ్వసనీయ సమాచారం. మరోవైపు బీఆర్‌ఎస్ కు చెందిన ఒక ఎమ్మెల్సీకి 600 ఎకరాల భూమి ఉన్నట్లు సమాచారం. మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వందల ఎకరాల్లో ఇక్కడ భూములు కలిగి ఉన్నారు. ఈ ప్రజా ప్రతినిధులు సీలింగ్‌ యాక్ట్‌ పరిధిలోకి రాకుండా ముందు జాగ్రతగా వారి కుటుంబ సభ్యులు, బినామి వ్యక్తుల పేర్లమీద రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఐదుగురు మంత్రులు కూడా జీవో 111 పరిధిలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి ఫాంహౌజ్‌లు నిర్మించుకున్నారు. కొందరు ఎంపీలు, ఎమ్మెల్సీలు ఒక్కొక్కరికి ఏకంగా 100 ఎకరాలకు పైగా భూములు కలిగి ఉన్నారు. ఈ భూమి ఒకరి పేరు మీదకాకుండా వారి బంధువులు, బినామీల పేరు మీద రిజిస్టర్‌ చేశారు. షాబాద్‌ మండల పరిధిలో ఓ మంత్రిదాదాపు 50 ఎకరాలకు పైగా భూమి కొనుగోలు చేశారు. ఎకరాభూమి లేని ఆ మంత్రికి ఇంత భూమి ఎలా వచ్చిందని ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంపీ ప్రశ్నించిన విషయం తెలిసిందే.

ధరణి పోర్టల్‌లో వీరి పేర్లు కనిపించకుండా

గ్రామాల వారీగా ప్రభుత్వ భూమి ఎంత? పట్టా భూమి ఎంత? అని తెలుసుకునేందుకు ధరణిలో ఆప్షన్‌ ఉంది. ఏ సర్వే నెంబరులో ఎంత భూమి ఉంది. అది ఎవరి పేరునా ఉందో కూడా తెలుసుకోవచ్చు. దీంతో పాటు ప్రైవేట్‌ ప్రైవసీ ఆప్షన్‌తో యజమాని తన భూమి వివరాలు ధరణిలో కనిపించకుండా పెట్టుకోవచ్చు. రాజకీయ ప్రముఖులు, అధికారులు, సినీ ప్రరిశ్రమకు చెందిన వ్యక్తులు ప్రైవేట్‌ ప్రైవసీ ద్వారా సర్వే నెంబరు, భూమి విస్తీర్ణం, యజమాని పేరు ధరణి పోర్టల్‌లో కనిపించ కుండా పెట్టుకుంటున్నారు.

75 శాతం వారి చేతుల్లోనే..

మొయినాబాద్‌ మండలంలో 48,335 ఎకరాల భూమి ఉంటే 75 శాతం భూమి వీఐపీల చేతుల్లో ఉంది. ఈ మండలంలోని తొల్‌కట్ట గ్రామంలో 2066 ఎకరాల భూమి ఉంటే, అందులో అటవీ, గ్రామ కంఠం, ప్రభుత్వ భూమి, అసైన్ట్‌ భూమి పోను మిగిలిన భూమిలో 90 శాతం భూమి పెద్దల చేతుల్లోనే ఉంది. పెద్దమంగళారం, రెడ్డిపల్లి గ్రామాల్లో 8 నుంచి 10 శాతం భూమి మాత్రమే రైతుల చేతుల్లో ఉంది. చేవెళ్ల మండలం ముడిమ్యాల, రావులపల్లి, కమ్మెట, ఎన్నెపల్లి, ఈర్లపల్లి గ్రామాల్లోని 75-80 శాతం భూమి రియల్టర్ల చేతుల్లో ఉంది. రాష్ట్రంలోనే ప్రముఖ రియల్టర్‌ 150 ఎకరాల భూమి కలిగి ఉన్నారు. శంకర్‌పల్లి, చేవెళ్ల మండలాల పరిధిలోని 7 గ్రామాల్లో మరో రియల్‌ ఎస్టేట్‌ సంస్థ 350 ఎకరాలకు పైగా కలిగి ఉంది. శంకర్‌పల్లి మండలం మహరాజ్‌పేట, జన్వాడ గ్రామాల్లో 3350 ఎకరాల భూమిలో వీఐపీలు, సినీ హీరోలు, రియల్టర్లు దాదాపు 80 శాతం భూమిని కలిగి ఉన్నారు. బడా బాబులు కొనుగోలు చేసిన ఈ భూముల్లో కొన్నింటిని దశాబ్దాల క్రితమే కొనుగోలు చేయగా…. 111జీవో రద్దు చేస్తారనే విషయం తెలిశాక కొనుగోలు చేసిన వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారని సమాచారం. ఇక రైతుల వద్ద మిగిలిన భూమి కూడా కొద్దిమొత్తంలోనే ఉంది. బడా బాబులు వద్ద పదుల నుంచి వందల ఎకరాలుంటే….రైతుల వద్ద ఎకరం నుంచి ఐదెకరాల లోపులోనే ఎక్కువుగా ఉంది. రైతుల చేతుల్లో భూమి కొద్ది మొత్తమే ఉన్నప్పటికీ దానికి భారీగా విలువ రావడంతో వాళ్లు కూడా సంతోషంగానే ఉన్నారు. అయితే, లావాదేవీలు పెరిగే కొద్ది రైతుల చేతిలో భూమి ఎన్నాళ్లు ఉంటుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు ప్రభుత్వానికి అధికారిక ఆదాయం.. మరోవైపు అనధికార అమ్యామ్యాలకు కూడా ఇప్పుడు ఈ లక్ష ఎకరాల భూమి కేంద్రం అవుతుందనే అభిప్రా యం కూడా వినిపిస్తోంది. ఒక ఎకరా భూమిని వ్యవసాయ భూమి నుంచి నివాస భూమిగా మార్చేందుకు కన్వర్షన్‌ కోసం సుమారు రూ.12 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో భవన నిర్మాణాలు, హైరైజ్‌ అపార్ట్‌మెంట్ల నిర్మాణాలకు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. అధికారికంగా చెల్లించాల్సిన ఫీజులతో పాటు బ్లాక్‌లో చెల్లించాల్సింది కూడా వెంచర్‌ను బట్టి పెద్ద మొత్తాల్లోనే ఉంటుందన్నది బహిరంగ రహస్యమే. ఇలా సమకూరే నిధులు అధికార పార్టీకి ఎన్నిక ల్లో బాగా పనికొస్తాయనే వాదన కూడా ఉంది. అదే సమయంలో జీవో 111 ఎత్తేయడంతో సందడి మొదలైంది. ఇక లావాదేవీలు పెరుగుతాయి. ఈ క్రమంలో తాము తక్కువ ధరలకు కొనుగోలు చేసిన భూముల్లో ఒక స్వల్ప భాగం అమ్ముకున్నా ఎన్నికల ఖర్చు వెళ్లిపోతుందనే వాదన ఉంది. ఇక ఈ 84 గ్రామాల్లో కూడా విల్లాల నుంచి బహుళ అంతస్తుల నిర్మాణాలకు అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో.. అనుమతుల రూపంలో చెల్లించే డబ్బు, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ల్లు, ఆనక జీఎస్టీ.. ఈ లోపుగానే తెర వెనక మొత్తాలు ఇవన్నీ అందే అవకాశాలున్నాయి. ఇక్కడి ప్రాంతాల్లో ఇతర సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, సంస్థలు ఏర్పాటు చేసే అవకాశాలు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.