Sureedu: రాజశేఖర్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు సూరీడు అరెస్ట్
సూరీడు కుమార్తె గంగాభవానికి కడపకు చెందిన పోతిరెడ్డి సురేంద్రనాథ్ రెడ్డితో వివాహమైంది. ఆ తరువాత దంపతులు ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో గంగాభవాని భర్త సురేంద్రనాథ్ రెడ్డి పై వరకట్న వేధింపుల కేసు పెట్టారు.

Sureedu: దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు సూరీడుపై తాజాగా పోలీసు కేసు నమోదు అయ్యింది. రాజశేఖర్ రెడ్డి ఎక్కడ ఉన్న ఆయన వెన్నంటే సూరీడు కనిపించేవారు. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆ కుటుంబానికి సూరీడు దూరమయ్యారు. తాజాగా ఆయనపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఆయనతో పాటు ముగ్గురు పోలీస్ అధికారుపై సైతం కేసు నమోదు కావడం విశేషం. ఇందుకు సంబంధించి బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
సూరీడు కుమార్తె గంగాభవానికి కడపకు చెందిన పోతిరెడ్డి సురేంద్రనాథ్ రెడ్డితో వివాహమైంది. ఆ తరువాత దంపతులు ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో గంగాభవాని భర్త సురేంద్రనాథ్ రెడ్డి పై వరకట్న వేధింపుల కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో 2021 మార్చి 23న అత్తవారింట్లో ఉన్న కుమార్తెను చూసేందుకు సురేంద్రనాథ్ సూరీడు ఇంటికి వెళ్లారు. అక్కడ మామ,అల్లుడి మధ్య గొడవ జరిగింది. పోలీసులు సురేంద్రనాథ్ రెడ్డి ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ తనను నిర్బంధించి దాడి చేశారని ఆరోపిస్తూ సురేంద్రనాథ్ కోర్టును ఆశ్రయించారు.
ఏపీలో ప్రస్తుతం ఐజీగా పనిచేస్తున్న పాలరాజు, అప్పటి జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, ఎస్సై నరేష్ తనపై దాడి చేశారని.. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. సూరీడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గురు పోలీస్ అధికారులపై సైతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.
