Ladakh Tourism: వేసవిలో టూరిస్టు ప్రాంతాలు పర్యాటకులతో కళకళలాడుతున్నాయి. అయితే మన దేశంలో అందమైన కశ్మీర్‌లోని పహల్గాంలో గతేడాది జరిగిన ఘటనలో పర్యాటకులు కాస్త తగ్గారు. కానీ కేంద్రం, ఆర్మీ తీసుకున్న రక్షణ చర్యలతో ఈ వేసవిలో లద్దాక్‌కు పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఈ మే నెలలో మొత్తం 72,834 మంది పర్యాటకులు లద్దాక్‌ను సందర్శించారు. గత ఏడాది మే నెలలో 32,927 మంది మాత్రమే వచ్చిన విషయాన్ని పోలిస్తే ఇది 121.2% అద్భుత పెరుగుదల. లద్దాక్ టూరిజం చరిత్రలో ఇది ఒక నిజమైన మైలురాయి. జనవరి నుంచి మే వరకు మొత్తం 1,17,546 మంది సందర్శకులు వచ్చారు. గతేఏడాది అదే కాలంతో పోలిస్తే 43.65% వృద్ధి. ఇందులో దేశీయ పర్యాటకుల సంఖ్య 1,10,585 (45.9% పెరుగుదల), విదేశీయులు 6,961 (15.5% పెరుగుదల). లద్దాక్ ఆర్థిక వ్యవస్థలో టూరిజం ఎంత కీలక పాత్ర పోషిస్తోందో స్పష్టంగా చెప్పే సంకేతాలు.
ప్రభుత్వ చర్యలతో సానుకూల వాతావరణం..
లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఈ వృద్ధిని సమర్థించడమే కాకుండా, టూరిజం రంగానికి స్థానికులకు ఉపాధి కల్పించే ముఖ్యమైన ఇంజిన్‌గా అభివర్ణించారు. ఆయన నాయకత్వంలో గత కొన్ని నెలల్లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఈ పెరుగుదలకు దోహదపడ్డాయి. హోటల్స్, హోమ్‌స్టేలు, టూర్ ఆపరేటర్ల కోసం ఏకీకృత, సరళీకృత రిజిస్ట్రేషన్ విధానం, టూరిజం యూనిట్లకు ‘‘ఇండస్ట్రీ’’ స్టేటస్ ఇవ్వడం
కాంప్లయన్స్ భారం తగ్గించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను ప్రోత్సహించాయి.
యువతకు ఉపాధి..
ఈ సంస్కరణలు స్థానిక యువతకు మరిన్ని అవకాశాలు కల్పించాయి. హోమ్‌స్టేలు, ట్రాన్స్‌పోర్ట్, హ్యాండిక్రాఫ్ట్, ఫుడ్ అండ్ బెవరేజెస్ రంగాల్లో ఉపాధి పెరిగింది. మెరుగైన రోడ్డు కనెక్టివిటీ, ఎక్కువ విమాన సర్వీసులు, సోషల్ మీడియా ద్వారా లద్దాక్ సౌందర్యం వైరల్ కావడం, పోస్ట్–పాండమిక్ ట్రావెల్ బూమ్ ఈ సీజన్‌ను రికార్డు స్థాయికి తీసుకెళ్లాయి. ప్రత్యేకించి మే నెలలో రోడ్లు తెరవడం, అనుకూల వాతావరణం, పర్వతాలు, సరస్సులు, మఠాలు, అడ్వెంచర్ యాత్రలు కలిపి ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తున్నాయి. ఈ అపూర్వ వృద్ధి ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నప్పటికీ, లద్దాక్ పర్యావరణ సున్నితత్వాన్ని మరచిపోకూడదు. ఇప్పటికే పాపులర్ స్పాట్లైన పాంగాంగ్ లేక్, నుబ్రా వ్యాలీ, లే–మనాలి హైవేల్లో క్రౌడింగ్, వాస్తే మేనేజ్‌మెంట్, నీటి కొరత, వాహనాల నుంచి వచ్చే కాలుష్యం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. లద్దాక్ ఒక ఫ్రాజైల్ ఎకోసిస్టమ్. ఇక్కడ టూరిజం వృద్ధి చెందాలంటే అది సస్టైనబుల్, రెస్పాన్సిబుల్ టూరిజంగా మాత్రమే ఉండాలి. ప్రభుత్వం, స్థానికులు, టూరిజం స్టేక్‌హోల్డర్లు కలిసి పనిచేసి, క్యాపాసిటీ బిల్డింగ్, ఆఫ్–సీజన్ టూరిజం ప్రోత్సాహం, ఎకో–టూరిజం, వేస్ట్ మేనేజ్‌మెంట్, కార్బన్ ఫుట్‌ప్రింట్ తగ్గించడం వంటి వ్యూహాలను అమలు చేయాలి.
లద్దాక్ టూరిజం ప్రస్తుతం చూస్తున్న ఈ బూమ్ ఒక అపూర్వ అవకాశం. సరైన ప్రణాళిక, స్థానికుల పాల్గొన్నత, పర్యావరణ సంరక్షణతో కూడిన విధానాలతో ఈ వృద్ధిని మరింత స్థిరంగా, అర్థవంతంగా మార్చుకోవాలి. లద్దాక్ కేవలం ఒక టూరిస్ట్ డెస్టినేషన్ కాదు.. ఇది ఒక ప్రత్యేకమైన జీవన విధానం, సంస్కృతి, ప్రకృతి. దానిని కాపాడుకుంటూ అభివృద్ధి చేయడమే నిజమైన విజయం.
