India Future City: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దేశానికే ఆదర్శంగా నిర్మించాలని సంకల్పించింది. తెలంగాణ విజన్ 2047లో భాగంగా దీనిని నిర్మిస్తోంది. ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి ఈ ప్యూచర్ సిటీలోనే ఎకనామిక్ సమ్మిట్ నిర్వహించారు. భారీగా పెట్టుబడులు రాబట్టారు. ఈ నేపథ్యంలో సీఎం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏసీలు లేకుండా సిటీ నిర్మిచాలని భావిస్తున్నారు. ఏసీలకు ప్రత్యామ్నాయంగా డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ (డీసీఎస్) ప్రవేశపెడుతోంది.
30 వేల ఎకరాల్లో నిర్మాణ..
ఫ్యూచర్ సిటీని తెలంగాణ ప్రభుత్వం 30 వేల ఎకరాల్లో నిర్మించనుంది. రంగారెడ్డి జిల్లా మీరాఖాన్‌పేటలో ఈమేరకు పనులు జరుగుతున్నాయి. ఇందులో సెంట్రల్ బిజ్‌నెస్ డిస్ట్రిక్ట్ (సీబీడీ)లో ఏఐ సిటీ (300 ఎకరాలు), హెల్త్‌సిటీ (200 ఎకరాలు), ఎడ్యుకేషన్ హబ్ (500 ఎకరాలు), లైఫ్ సైన్సెస్ పార్క్ (3వేల ఎకరాలు) ఏర్పాటు. గుజరాత్ గిఫ్ట్ సిటీ, పోచంపల్లి ఇన్ఫోసిస్, ఐటీ కారిడార్ గేట్‌వేల్లో ఇప్పటికే డీసీఎస్ విజయవంతమైంది.
డీసీఎస్ పనితీరు ఇలా..
ఏసీల ఏర్పాటుతో వాయు కాలుష్యం పెరుగుతుంది. ఇప్పటికే ప్లాస్టిక్ రహిత నగరంగా హైదరాబాద్‌ను మాచ్చడంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ క్రమంలో ఫ్యూచర్ సిటీలోనూ కాలుష్యం లేకుండా నిర్మించడంలో భాగంగా ఏసీలు లేకుండా చేయాలని నిర్ణయించింది. ఏసీలు వేడిని పెంచుతాయి. డీసీఎస్ ఒక సెంట్రల్ పాయింట్‌లో నీటిని చల్లబరిచి పైపుల ద్వారా భవనాలకు సరఫరా చేస్తుంది. గదులలోని ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్లు ఈ చల్లని నీటితో ఉష్ణోగ్రత తగ్గిస్తాయి. వేడెక్కిన నీరు తిరిగి ప్లాంట్‌కు వెళ్తుంది. మళ్లీ చల్లబడి పైపల ద్వారా తిరిగి వస్తుంది.
30 శాతం విద్యుత్ ఆదా..
డీసీఎస్‌తో 30 శాతం విద్యుత్ ఆదా అవుతుంది. పర్యావరణం దెబ్బతినకుండా ఉంటుంది. కార్బన్ ఉద్గారాలు 25–40% వరకు తగ్గుతాయి. ఫ్యూచర్‌సిటీలో మాల్స్, టౌన్‌షిప్‌లకు ఇది అనువైన మోడల్. దీర్ఘకాలంలో నిర్మాణ ఖర్చు తక్కువ, ఆస్తి విలువలు పెరుగుతాయి. తెలంగాణలో మొదటిసారి డీసీఎస్ ఫ్యూచర్ సిటీలో అమలవుతోంది. దీంతో ఈ నగరం గ్లోబల్ స్మార్ట్ సిటీల స్థాయికి ఎదుగుతుంది.