Nara Lokesh: ఏపీ మంత్రి నారా లోకేష్( AP Minister Nara Lokesh ) జాతీయస్థాయిలో గుర్తింపు సాధిస్తున్నారు. మొన్నటివరకు ఆయన చంద్రబాబు కుమారుడుగానే సుపరిచితుడు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి మంత్రి అయ్యారు. గత 17 నెలల్లో తనకంటూ ఒక ముద్ర చాటుకుంటున్నారు. ప్రపంచ దిగ్గజ సంస్థలు ఏపీ వైపు వస్తుండడంతో మిగతా రాష్ట్రాల చూపు ఆంధ్రప్రదేశ్ పై పడింది. అందుకు కృషి చేస్తున్న నారా లోకేష్ జాతీయస్థాయిలో కూడా గుర్తింపు సాధించారు. ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖకు రానుంది. ఆ డేటా సెంటర్ కోసం వివిధ రాష్ట్రాలు ప్రయత్నించాయి. కానీ విశాఖకు రప్పించడంలో లోకేష్ పాత్ర ఉంది. జాతీయస్థాయిలో సైతం ఇది హైలెట్ అవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర పెద్దలు లోకేష్ కు ప్రత్యేక ఆహ్వానం పంపారు. బీహార్ ఎన్నికల్లో ప్రచారం చేయాలని ఆహ్వానించారు.
* రేపటితో ముగియనున్న ప్రచారం..
బీహార్( Bihar) అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి విడత పోలింగ్ జరిగింది. మలివిడత పోలింగ్ ఈనెల 11న జరగనుంది. 14న ఫలితాలు రానున్నాయి. ఎన్డీఏ వర్సెస్ మహా ఘాట్ బంధన్ మధ్య పోటీ గట్టిగానే ఉంది. సర్వేలు ఎన్డీఏకు అనుకూలంగా వస్తున్నా.. ఎక్కడో చిన్న అనుమానం వెంటాడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. అయితే బీహార్ ఉత్తరాది రాష్ట్రం కావడంతో దక్షిణాది నుంచి నేతలు ఎవరు ప్రచారానికి రావడం లేదు. అయితే ఇప్పుడు జాతీయస్థాయిలో లోకేష్ ప్రాధాన్యం పెరగడంతో బిజెపి పెద్దలు ప్రచారానికి ఆహ్వానించారు.
* నాలుగు కార్యక్రమాల్లో..
రేపటి సాయంత్రం ఐదు గంటలకు బీహార్ ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈరోజు రెండు సమావేశాలు, రేపు రెండు సమావేశాల్లో లోకేష్( Nara Lokesh) పాల్గొనేందుకు వీలుగా షెడ్యూల్ ఖరారు చేశారు. వాణిజ్యవేత్తలతో లోకేష్ ప్రత్యేకంగా సమావేశం అవుతారు. వారికి దిశ నిర్దేశం చేస్తారు. ఎన్డీఏ లక్ష్యాలను వివరిస్తారు. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో లోకేష్ పర్యటన ఉండనుంది. ఇప్పటివరకు చంద్రబాబు కుమారుడుగానే గుర్తింపు పొందారు లోకేష్. కానీ ఇప్పుడు ఏపీ భావి నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ సారధిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటున్నారు. గత పరిస్థితులకు భిన్నంగా బిజెపి పెద్దలు సైతం లోకేష్ ను ఆశీర్వదిస్తున్నారు. ఈ క్రమంలోనే బీహార్ ఎన్నికల ప్రచారానికి లోకేష్ వెళ్తున్నారు. బీహార్లో ఎన్డీఏ గెలిస్తే మాత్రం లోకేష్ పేరు మార్మోగిపోతుంది. బిజెపి పెద్దలు కూడా ఎనలేని ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది.