2018 Movie Review: 2018 మూవీ ఫుల్ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

ఇక సినిమా కథ ఊహించినట్టు జరుగుతూ వెళ్తుంటే పెద్దగా కిక్ రాదు. మనం కోరుకునేది తెరపై జరుగుతూ ఉంటే చాలా సంతోషం వేస్తుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు కోరుకున్నవన్నీ జరిగిపోతూ ఉంటాయి.

2018 Movie Review: 2018 మూవీ ఫుల్ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

2018 Movie Review: సినిమా పేరు: 2018
నటినటులు: టొవినో థామస్, అసిఫ్ అలీ, లాల్, వినీత్ శ్రీనివాసన్, అపర్ణ బాలమురళి, కున్ చకో బోబన్, అజు వర్గీస్, నరైన్, కలై యారసన్, తదితరులు.
నిర్మాతలు: వేణ కున్న పిల్లై, సీకే పద్మ కుమార్, ఆటో జోసెఫ్.
తెలుగులో విడుదల: “బన్ని” వాసు
దర్శకత్వం: జూడ్ ఆంథోని జోసెఫ్.
సంగీతం: నోబిన్ పాల్
విడుదల: మే 26, 2023

ప్రకృతి మనకు అన్ని ఇచ్చింది. పీల్చేందుకు గాలి, తాగేందుకు నీరు, తినేందుకు తిండి, ఉండడానికి ఆవాసం.. ఇలా సకల సౌకర్యాలు ఇచ్చింది. కానీ మనిషి మాత్రం అభివృద్ధి పేరుతో ప్రకృతిని తన చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ ప్రయత్నంలో ప్రకృతి విధ్వంసానికి గురవుతోంది. ఆ విధ్వంసం తాలూకు పర్యవసనాలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అకాలమైన వర్షాలు, మాడు పగలగొట్టే ఎండలు, వెన్నులో వణుకు పుట్టించే చలిగాలులు.. ఇవన్నీ ప్రకృతి ప్రకోపానికి ప్రబల నిదర్శనాలు. ఇలాంటి వాటిని మనం టీవీలో చూస్తే చలించి పోతాం. ముఖ్యంగా ముంచెత్తే వర్షాలకు తీరని నష్టం వాటిల్లుతుంది. అలాంటి వర్షాలు ఎడతెరిపి లేకుండా వారాలపాటు కురిస్తే? వర్షాల ధాటికి భీకరమైన వరదలు వస్తే? ఆ వరదలు కట్టుకున్న ఇళ్లను నిలువునా కూల్చివేస్తే.. ఇలాంటి ప్రకృతి విపత్తులు నిత్యం ఏదో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. కొన్నిసార్లు వాటి తాలూకు వార్తలను మనం చూసి వెంటనే టీవీ ఛానల్ మార్చేస్తాం. ఒకవేళ అలాంటి ప్రకృతి విపత్తు మన దగ్గర కనుక సంభవిస్తే ఎలా ఉంటుంది? నిండు గర్భిణి అయిన మీ భార్య వరదల్లో చిక్కుకొనిపోతే? వైకల్యంతో బాధపడుతున్న మీ కొడుకు ఉన్న ఇంట్లోకి వరద నీరు వచ్చి చేరితే? కష్టపడి చదివిన మీ కూతురు డిగ్రీ సర్టిఫికెట్స్ వరద నీటిలో కొట్టుకుపోతే? ఇష్టపడి కట్టుకున్న ఇల్లు కళ్ళముందే నీటిలో కూలిపోతే? చుట్టూ నీరు ఉన్నప్పటికీ తాగడానికి గ్లాసెడు మంచినీళ్లు కూడా లభించకపోతే? ఇవన్నీ హైదరాబాద్ నగర వాసులు గత ఏడాది కురిసిన భారీ వర్షాల వల్ల చవి చూశారు. అంతకుముందు కేరళ ప్రజలు అనుభవించారు. 2018లో అక్కడ సంభవించిన వరదలు కేరళ రాష్ట్రాన్ని చిగురుటాకులా వణికించాయి. ఆ సమయంలో అక్కడి ప్రజలు ఒకరికి ఒకరు అన్నట్టుగా కలిసికట్టుగా ప్రకృతి ప్రళయాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు. అయితే ఆ సంఘటనలను కథగా మలిచి “2018” పేరుతో జూడ్ ఆంథోనీ జోసెఫ్ సినిమాను తెరకెక్కించారు. మే ఐదున కేరళలో విడుదలైన ఆ చిత్రం 130 కోట్లకు పైగా వసూలు రాబట్టి కొత్త రికార్డు సృష్టించింది. ఆ సినిమాను తెలుగులో బన్నీ వాసు శుక్రవారం అంటే మే 26న విడుదల చేస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా కథ ఏమిటి? ఎలా ఉంది? ఒక్కసారి ఈ రివ్యూ లో చూద్దాం.

– కథ

కేరళలోని అరువిక్కుళం గ్రామానికి చెందిన అనూప్( టోవినో థామస్) ఎంతో ఇష్టపడి ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవుతాడు. అయితే అక్కడి కఠిన శిక్షణ చూసి భయపడి ఉద్యోగం మానేసి తిరిగి వస్తాడు. అతడిని చూసి ఆ గ్రామ ప్రజలు మొత్తం నవ్వుతారు. ఇక అనూప్ మాత్రం ఆవేవీ పట్టించుకోకుండా దుబాయ్ వెళ్లి భారీగా డబ్బు సంపాదించాలని వీసా కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి వచ్చిన స్కూల్ టీచర్ మంజు (తన్వి రామ్) తో ప్రేమలో పడతాడు. వీరిద్దరి మధ్య కథ ఇలా సాగుతూ ఉండగానే మరోవైపు నిక్సన్(అసిఫ్ అలీ) మోడల్ కావాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అతని తండ్రి (లాల్), అన్నయ్య (నరైన్) సముద్రంలో చేపలు పడుతూ జీవిస్తూ ఉంటారు. వారిది సముద్ర తీర ప్రాంతం కావడంతో వర్షం పడినప్పుడల్లా ఇంటిని వదిలి చేపల వేటకు వెళుతూ ఉంటారు. ఇక కోశి(అజు వర్గీస్) టాక్సీ డ్రైవర్ గా జీవనం సాగిస్తూ ఉంటాడు. కేరళ ను చూసేందుకు వచ్చిన విదేశీ పర్యాటకులకు తన క్యాబ్లో అన్ని ప్రాంతాలు తిప్పి చూపిస్తుంటాడు. సేతుపతి (కలై యారా సన్) లారీ డ్రైవర్. డబ్బు కోసం బాంబులను సరఫరా చేసేందుకు వెళుతూ ఉంటాడు. ఇలా ఆ ప్రాంతంలో ఒక్కొక్కరిది ఒక్కో జీవితం. వీరందరి జీవితాలను 2018లో సంభవించిన వరదలు ఎలా తారుమారు చేశాయి, ప్రకృతి కన్నెర చేస్తే అక్కడి ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకుని ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డారు? వరదల సమయంలో కేరళ ప్రజలు ఎటువంటి బాధలు అనుభవించారు? ఈ దృశ్యాలను కళ్ళకు కట్టినట్టు చూపించిన సినిమా “2018”.

– విశ్లేషణ

2018లో కేరళలో ఆగస్టు మాసంలో రెండుసార్లు అత్యంత తీవ్రమైన వరదలు సంభవించాయి. కేరళ చరిత్రలో అత్యంత తీవ్రమైన వరదలు అంటే ఇవే. దీనిని ఆధారంగా చేసుకొని జోసెఫ్ ఈ చిత్ర కథ రాసుకొని, దానిని అద్భుతంగా తెరకెక్కించాడు. అందుకే ఈ చిత్రానికి అక్కడి ప్రజలు బాగా కనెక్ట్ అయ్యారు. ఇది అక్కడ జరిగిన సంఘటన కాబట్టి అందరి మనసులోకి దగ్గరయింది. మలయాళ ప్రజలు మాత్రమే కాదు తెలుగు ప్రజలు కూడా కనెక్ట్ అయ్యే కథ ఈ సినిమాలో ఉంది. అయ్యో పాపం ఎవరైనా సహాయం చేస్తే బాగుండేదే? నేను అక్కడికి వెళ్లినా సహాయం చేసేవాడిని అని అనిపించేలా కొన్ని వరద సన్నివేశాలు తీర్చిదిద్దారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు వరదల్లో మనవాళ్లు చిక్కుకున్నట్టు, వాళ్లకు ఎవరో ఒకరు సహాయం చేస్తే మనవాళ్లు బయటపడ్డారు అనే అనుభూతి కలుగుతుంది.

ఇక సినిమా కథ ఊహించినట్టు జరుగుతూ వెళ్తుంటే పెద్దగా కిక్ రాదు. మనం కోరుకునేది తెరపై జరుగుతూ ఉంటే చాలా సంతోషం వేస్తుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు కోరుకున్నవన్నీ జరిగిపోతూ ఉంటాయి. కొన్ని కొన్ని సన్నివేశాలు హృదయాన్ని హత్తుకుంటాయి. కంట నీరు పెట్టిస్తుంటాయి. ముఖ్యంగా దివ్యాంగుడైన తన కొడుకును కాపాడుకునేందుకు ఓ జంటపడే కష్టం, గర్భవతిని హెలికాప్టర్లో ఎక్కించే సన్నివేశం, ధ్రువపత్రాల కోసం ఇంట్లోకి నిక్సన్ వెళ్ళే దృశ్యం.. చాలా సన్నివేశాలు మనల్ని వేటాడుతూ ఉంటాయి. కొన్ని సన్నివేశాలు అయితే మనతో కంట నీరు పెట్టిస్తుంటాయి. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడుకునేందుకు మత్స్యకారులు ముందుకు వస్తే ఇది కదా మానవత్వం అనిపిస్తుంది. మొత్తానికి “2018” ఒత్తిడి పెంచుతుంది, భయ పెడుతుంది, చివరకు బాధపెడుతుంది, కులాలు, మతాల కంటే మానవత్వమే గొప్పదని చాటి చెబుతుంది.

-చివరగా..

ఇక ఈ సినిమాలో ప్రతి ఒక్క ప్రతి నటీనటులు నటించారు అనేకంటే జీవించారు అనడం సబబు. ప్రతి ఒక్కరూ తమ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశారు. ఇక నోబిన్ పాల్ నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. అఖిల్ జార్జి ఫోటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. చమన్ చాకో ఎడిటింగ్ అద్భుతంగా ఉంది. వి ఎఫ్ ఎక్స్ సహజ సిద్ధంగా ఉంది. నిర్మాణ విలువలు కూడా అద్భుతంగా ఉన్నాయి.

oktelugu.com రేటింగ్ 3/5