Sitarampur Temple Land: బంగారు తెలంగాణలో పెద్ద హిందువు ఘనకార్యమిదీ!

రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం సీతారాంపూర్‌లోని సీతారామచంద్రస్వామి ఆలయానికి చెందిన 1148.12 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా సర్కారు సేకరించింది.

  • Written By: Bhaskar
  • Published On:
Sitarampur Temple Land: బంగారు తెలంగాణలో పెద్ద హిందువు ఘనకార్యమిదీ!

Sitarampur Temple Land: “ఆ మోదీ మత పిచ్చి లేపుతుంటడు. ఏవేవో మాట్లాడుతూ విద్వేషాలు రెచ్చగొడుతుంటాడు. రాముడి పేరుని రాజకీయాల కోసం వాడుకుంటాడు. నేను అతిపెద్ద హిందువుని. గుళ్ళు గోపురాలు నిర్మించాను. హిందూ మతం అంటే పరమత సహనాన్ని పాటించేది” ఇలానే ఉంటాయి కేసీఆర్ మాటలు. కానీ చేతలే వేరే విధంగా ఉంటాయి. అంతటి దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం రామయ్య కళ్యాణానికి కనీసం వెళ్ళడు. ముత్యాల తలంబ్రాలకు రూపాయి కేటాయించడు. కేవలం ఆ రాముడు మాత్రమే కాదు.. ఇప్పుడు హైదరాబాద్ పరిధిలో ఉన్న ఒక రాముడికి కూడా ఇలాంటి శఠగోపమే పెట్టాడు. ఇప్పుడు ఇది తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అక్కడ ఏం జరిగింది అంటే..

అభివృద్ధి పేరుతో ..

రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం సీతారాంపూర్‌లోని సీతారామచంద్రస్వామి ఆలయానికి చెందిన 1148.12 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా సర్కారు సేకరించింది. పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు దానిని అప్పగించింది. ఈ క్రమంలో దేవాదాయ చట్టాన్ని ఉల్లంఘించడంతోపాటు న్యాయస్థానం అనుమతి ఇవ్వకపోయినా మొండిగా ముందుకెళ్లింది. సీతారాంపూర్‌లోని 350 ఏళ్ల చరిత్ర కలిగిన సీతారామచంద్రస్వామి ఆలయానికి సర్వే నెంబరు 1663 నుంచి 1673 వరకు 1,148.12 ఎకరాల భూమి ఉంది. ఇది కాకుండా షాద్‌నగర్‌ సమీపంలోని రంగంపల్లిలో మరో 148 ఎకరాల భూమి ఉంది. రాజా లక్ష్మణ్‌రావు, ఆయన కుటుంబ సభ్యులు ఈ భూములను రాములోరికి కానుకగా ఇచ్చారు. కాగా, ఆలయ మనుగడ కోసం వివిధ వృత్తి పనులు చేసేవారికి దేవాలయ భూమిలో కొంత భూమిని ఉచితంగా సాగు చేసుకునేందుకు ఇచ్చారు. ఆ భూమిని సాగు చేసుకుంటూ ఆలయాన్ని చూసుకునేలా ఏర్పాటు చేశారు.

సర్కారు కన్ను…

హైదరాబాద్‌ శివారులో పారిశ్రామిక పార్కు ఏర్పా టు చేయాలనుకున్న ప్రభుత్వం కన్ను రాములోరి భూములపై పడింది. మరో ఆలోచన లేకుండా భూసేకరణ పూర్తిచేసింది. పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు గ్రామ సభలు నిర్వహించినా.. ఎవరి అభ్యంతరాలనూ పరిగణనలోకి తీసుకోలేదు. పైగా దేవాదాయ శాఖకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే గ్రామసభలు నిర్వహించింది. దశాబ్దాలుగా దేవాదాయశాఖ భూమి ని సాగు చేసుకుంటున్న రైతులు అభ్యంతరం చెప్పి నా ప్రభుత్వం పట్టించుకోలేదు. వాస్తవానికి దేవాదాయశాఖ పరిధిలోని భూములను ప్రజా అవసరాల నిమిత్తం సేకరించే సమయంలో అనుసరించాల్సిన విధానాలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి.

ఏ అవసరం నిమిత్తం ఉందో..

ముందుగా ఏ అవసరం నిమిత్తం భూములు తీసుకుంటున్నది దేవాదాయశాఖ అధికారులకు వివరించాల్సి ఉంటుంది. కొద్దిమొత్తంలో స్థలం అయితే దేవాదాయశాఖ అధికారులు అనుమతిస్తారు. అనంతరం నోటీఫికేషన్‌ జారీ చేసి బహిరంగ వేలం నిర్వహించాల్సి ఉంటుంది. వేలంలో ఎక్కువ మొత్తానికి కోట్‌ చేసినవారికి భూమి కేటాయిస్తారు. ఒకవేళ పెద్ద మొత్తంలో భూమిని తీసుకోవాలంటే కచ్చితంగా కోర్టు నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సీతారామచంద్రస్వామి ఆలయ విషయంలోనూ ప్రభుత్వం కోర్టును అనుమతి కోరింది. ఈ మేరకు హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ (డబ్ల్యూపీ నెంబరు 18106) దాఖలు చేసింది. భూసేకరణ కోసం అంతకుముందు 2005లో దాఖలు చేసిన డబ్ల్యూపీ నెంబరు 15055తోపాటు మరికొన్నింటిని ఉదహరించింది. ఆలయం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది.. ఇది పురాతన దేవాలయమని, ఆలయ భూములను ఎవరికీ అమ్మడానికి వీల్లేదని గుర్తు చేశారు. దేవాలయాలు, ధార్మిక అభివృద్ధి కోసం దాతలు ఇచ్చిన భూములను కారుచౌకగా అమ్మడం కుదరదన్నారు. ఒకవేళ ఆ భూములను అమ్మేందుకు దేవాదాయశాఖ అనుమతిస్తే.. బహిరంగ వేలం నిర్వహించి అమ్మాలని, భూములను అమ్ముతున్నట్లు రాతపూర్వకంగా రికార్డు చేయాల్సి ఉంటుందని తెలిపారు. దేవాదాయ చట్టంలోని సెక్షన్‌ 80లో నిర్దేశించిన పద్ధతులను అనుసరించాలని చెప్పారు. వాదనలు విన్న హైకోర్టు.. సీతారామచంద్రస్వామి ఆలయ భూములు సేకరించేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. అయినా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లింది. ఆ భూములను సేకరించి పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేసింది.

వారసులు ఏమంటున్నారంటే..

ఆలయానికి భూములను కానుకగా ఇచ్చిన రాజా లక్ష్మణరావు వారసులు ఇప్పటికీ ఉన్నా తమ పూర్వీకులు ఇచ్చిన భూమి విషయంలో జోక్యం చేసుకునేందుకు ఆసక్తి చూపడంలేదు. గ్రామసభల్లో ప్రజాభిప్రాయం తీసుకున్నామంటూ ఆలయ భూములను సేకరించిన ప్రభుత్వం.. అందు కు పరిహారం చెల్లింపులోనూ నిబంధనల్ని పాటించలేదు.

పరిహారం చెల్లించాకే..

ముందుగా పరిహారం చెల్లించాకే భూమిని సేకరించాల్సి ఉండగా.. పూర్తి పరిహారం చెల్లించకుండానే తనపని కానిచ్చేసింది. ప్రస్తుతం ఎకరాకు రూ.2కోట్ల పైనే ఉన్న భూమికి ప్రభుత్వం ఎకరాకు రూ.21 లక్షల పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. అందులో ఆ భూమిని సాగు చేసుకుంటున్న రైతులకు రూ.10.50 లక్షలు, దేవాదాయశాఖకు రూ.10.50 లక్ష లు చెల్లించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ధర ప్రకారం ఎకరాకు రూ.3.50 లక్షలు ఉండటంతో మూడు రెట్లు అధికంగా చెల్లించే విధంగా రూ.21 లక్షలకు సర్కారు ఆమోదం తెలిపింది. ఈ లెక్కన 1,148.12 ఎకరాల భూమికిగాను దేవాదాయశాఖకు రూ.90 కోట్లు చెల్లించింది. అయితే ఎకరాకు రూ.10.50 లక్షల చొప్పున ఈ మొత్తం 800 ఎకరాలకు మాత్రమే సరిపోతుంది. మిగతా 300 ఎకరాల భూమికి సంబంధించిన పరిహారం పరిస్థితి ఏంటన్నదానిపై ఇంతవరకూ స్పష్టత రాలేదని దేవాదాయశాఖ అధికారులు చెబుతున్నారు. రైతులకు చెల్లించే పరిహారం విషయంలోనూ.. ఇదే ధోరణి కొనసాగుతున్నది. ప్రస్తుతం కౌలు సాగులో ఉన్నవారికి కాకుండా.. దశాబ్దాల క్రితం సాగులో ఉన్నవారికి, 1983-84 రికార్డుల ప్రకారం పరిహారం చెల్లిస్తున్నారు. దీంతో తమ పరిస్థితి ఏమిటని ప్రస్తుతం సాగులో ఉన్నవారు ప్రశ్నిస్తున్నారు.

టాటాకే వద్దన్నారు..

దేవాదాయశాఖ భూమిలో ప్రైవేటు సంస్థలు ఏర్పాటు చేయాలన్న ఆలోచన కొత్తేదేమీ కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం టాటా సంస్థకు ఈ భూములను ఇవ్వాలని నిర్ణయించింది. టాటా సంస్థల అధినేత రతన్‌ టాటా స్వయంగా సీతారాంపూర్‌ భూములను పరిశీలించేందుకు వచ్చారు. అయితే స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఆ తర్వాత టాటా కంపెనీ తమ ప్రాజెక్టును బెంగాల్‌కు మార్చింది. అప్పటి టీడీపీ నాయకుడు, ప్రస్తుత బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వం సేకరించిన దేవాదాయ భూములు మహేందర్‌ రెడ్డి స్వగ్రామానికి కేవలం 5 కీలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. మహేందర్‌ రెడ్డి.. ఇప్పుడు ఆ భూమి విషయంలో ప్రభుత్వానికి సహకారం అందించడమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Read Today's Latest Telangana politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు