నేడు దేశంలో అత్యధికంగా ప్రజలను కలచి వేస్తున్నది నిరుద్యోగ సమస్య. ముఖ్యంగా పట్టణ ప్రజలలో సగం మంది ఈ సమస్యతో కలవరం చెందుతున్నారు. ఇటీవల కాలంలో దేశం మరెన్నడు ఇంత తీవ్రమైన నిరుద్యోగ సమస్యను ఎదుర్కొనలేదు. అయితే వీరిలో 69 శాతం మంది దేశం సరైన దిశలోనే పయనిస్తున్నదని భావిస్తుండడం కొంత ఉపశమనం కలిగిస్తుంది.
భారతీయులకు ఆందోళన కలిగిస్తున్న ఇతర అంశాల్లో ఆర్థిక, రాజకీయ అవినీతి, నేరాలు, హింస, పేదరికం, సామాజిక అసమానతలు, వాతావరణ మార్పులు తదితర అంశాలున్నట్టు తాజాగా జరిపిన ఓ సర్వే వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతున్న అంశాలేమిటన్నదానిపై ప్రముఖ పరిశోధనా (రిసెర్చ్) సంస్థ ఇప్సోస్ ఈ సర్వే నిర్వహించింది.
ప్రపంచ దేశాల ప్రజల్లో 61 శాతం మంది తమ దేశం సరైన దిశలోనే పయనిస్తున్నదని అభిప్రాయపడుతున్నారని, దీనితో పోలిస్తే భారత్‌లో పరిస్థితి మెరుగ్గానే ఉన్నదని, పట్టణప్రాంతాల్లోని 69 శాతం మంది భారతీయులు దేశం సరైన దిశలోనే పయనిస్తున్నట్టు భావిస్తున్నారని ఈ సర్వేలో వెల్లడయింది. నిరుద్యోగ సమస్య తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని పట్టణప్రాంతాల్లోని దాదాపు 46 శాతం మంది భారతీయులు ఈ సర్వేలో వెల్లడించారు.
ఈ అభిప్రాయాన్ని వ్యక్తంచేసినవారి సంఖ్య ఇంతకుముందు (అక్టోబర్‌లో) నిర్వహించిన సర్వేతో పోలిస్తే నవంబర్‌లో నిర్వహించిన సర్వేలో 3 శాతం పెరిగింది. ముఖ్యంగా పేదరికం, సామాజిక అసమానతలే ప్రపంచ దేశాల ప్రజలను ఎక్కువగా కలవరపెడుతున్నాయి.
వీటి తర్వాత నిరుద్యోగం, నేరాలు, హింస, ఆర్థిక, రాజకీయ అవినీతి, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన సమస్యలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అని ఈ సర్వే వెల్లడించింది. ఇప్సోస్ తన ఆన్‌లైన్ ప్యానల్ సిస్టమ్ ద్వారా ప్రపంచంలోని 28 దేశాల్లో నెలవారీగా ఈ సర్వే నిర్వహిస్తున్నది.