కేంద్రంలో, పలు రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉండడంతో సహజంగా వరించి అధికార ఆర్భాటాల మోజులో చిక్కుకోవద్దని స్వయంసేవక్ లను ఆర్ ఎస్ ఎస్ అధినేత డా. మోహన్ భగవత్ సున్నితంగా వారించారు. ఫొటోల కోసం, పూలదండల కోసం పని చేయకండి, అది మన పద్ధతి కాదని అంటూ సున్నితంగా మందలించారు.
ఆరెస్సెస్ తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగర శివారులోని భారత్ ఇంజనీరింగ్ కాలేజీలో గురువారం జరిగిన ముగింపు కార్యక్రమంలో స్వయం సేవకులకు మాట్లాడుతూ సార్వజనిక ఉత్సవంలో భాగంగా బ్యానర్లు వేయించడంపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని హితవు చెప్పారు.
‘‘క్రమశిక్షణతో కూడిన శక్తిమంతమైన సమాజ నిర్మాణమే సంఘ్ లక్ష్యం. స్వయం సేవకులు కష్టాలను ఎదిరించి ధైర్యంగా ముందుకు సాగాలి. విశ్వగురు స్థానంలో ఉండిన భారత దేశం పరమ వైభవం సాధించడమే స్వయం సేవకుల అంతిమ లక్ష్యం కావాలి” అంటూ ఉద్భోదించారు. వారి ప్రతి అడుగును సమాజం గమనిస్తుందని గుర్తించాలని హెచ్చరించారు.
.
ఆత్మ సమర్పణ భావంతో చేసే ప్రతి పని విజయవంతమవుతుందని స్పష్టం చేసారు. ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉంటూ సంఘ్ శాఖలు మరింత విజయవంతంగా అన్ని గ్రామాలు, బస్తీలకు చేరాలని సూచించారు. కొత్తగా వచ్చిన స్వయం సేవక్‌లను నిలబెట్టుకోవాలని, పని విస్తృతిని పెంచుకోవాలని చెప్పారు.
సమాజంలో స్వయంసేవకుల ప్రవర్తన, భాష, సమాజ మేలు కోరే ఆలోచనలు, వాటిని తెలియచేసే విధానం కార్యవిస్తరణలో కీలకమని వాటిని విస్మరించకూడదని హితవు చెప్పారు.