తెలంగాణాలో ఈ సీజన్ కి చివరిగా మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి. ఎటూ అసెంబ్లీ , పార్లమెంటు ఎన్నికలు అయిపోయాయి. ఈ మున్సిపల్ ఎన్నికలతో ఇంకో నాలుగు సంవత్సరాలు ఎటువంటి ఎన్నికలు వుండవు. కేవలం కొన్ని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు తప్ప. చివరగా జరగబోయే ఈ మున్సిపల్ ఎన్నికల కోసం అన్ని పార్టీలు తయారవుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో తెరాస పూర్తి ఆధిక్యత ప్రదర్శించింది. దూరంగా రెండో స్థానంలో కాంగ్రెస్ నిల్చింది. బీజేపీ తన ఉనికిని చాటుకోలేకపోయింది.
మరి పురపాలక సంఘాల ఎన్నికల పరిస్థితి ఎలా వుండబోతుందనేది ప్రతి ఒక్కరి మనస్సులో ఉత్కంఠ రేపుతోంది. తెరాస మాత్రం పంచాయతీ ఎన్నికల ఫలితాలే ఇక్కడా వస్తాయనే ధీమాగా వుంది. పరిశీలకుల అంచనా ప్రకారం ఆ మోతాదులో ఫలితాలు గంపగుత్తగా ఒకవైపు ఉండకపోయినా తెరాస తన ఆధిక్యతను చాటుకుంటుందనే భావిస్తున్నారు. ఇవి పట్టణ ఓటర్లకు సంబంధించిన ఎన్నికలు కాబట్టి ప్రతిపక్షాలకు కూడా కొంత బలం చేకూరుతుందని భావిస్తున్నారు.
ముఖ్యంగా ఈ ఎన్నికలు తెరాస కు ఎవరు ప్రత్యామ్నాయ పార్టీ యో నిర్ణయించే ఎన్నికలుగా పరిశీలకులు భావిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల తర్వాత దేశంలో, రాష్ట్రం లో జరిగిన పరిణామాలు ఈ ఎన్నికల్ని ప్రభావితం చేస్తాయని బీజేపీ నాయకులు నమ్ముతున్నారు. ముఖ్యంగా దేశంలో ఆ తర్వాత వచ్చిన రామమందిర తీర్పు, పౌరసత్వ సవరణ చట్టం ప్రభావం పట్టాన ఓటర్లపై ఉంటుందని బీజేపీ రాష్ట్ర నాయకులూ నమ్ముతున్నారు. అదీకాక బీజేపీ కి మొదట్నుంచి పట్టణాల్లోనే ఎంతోకొంత బలం వుండటంకూడా పార్టీకి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. వీటితోపాటు కెసిఆర్ కనక ఒవైసీ తో బహిరంగంగా కలిసి పనిచేసేటట్లయితే అది బీజేపీ కి లాభం చేకూరుతుందని బలంగా నమ్ముతున్నారు. ముఖ్యంగా ఇది పట్టణ ఓటర్లలో హిందూ ఓటర్లు బీజేపీ వైపు సమీకరించబడే అవకాశం ఉందని నమ్ముతున్నారు.
ఇక కాంగ్రెస్ కి ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యే. ఎందుకంటే ఇందులోకనక బీజేపీ రెండో పార్టీగా అవతరిస్తే కాంగ్రెస్ కి దెబ్బతగిలే అవకాశం వుంది. మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు బీజేపీకి మారే అవకాశం వుంది. అదేజరిగితే కాంగ్రెస్ కోలుకోవటం కష్టమే అవుతుంది. అందుకనే ఎలాగైనా రెండో స్థానాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ విశ్వప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ లో ఇప్పటికీ జనాకర్షణ గల నాయకులు చాలా మందివున్నారు. ఈ జనాకర్షణ ఓట్లు రాలుస్తుందో లేదో చూడాలి. ఏదిఏమైనా ఈ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ కు కీలకంగా మారాయి. రెండు పార్టీలు రెండో స్థానంకోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరు రెండో పార్టీగా రాగలిగితే ఆ పార్టీకి 2024 లో భవిష్యత్తు ఉంటుందని అనుకుంటున్నారు. కాబట్టి ఈ ఎన్నికలు తెరాస కన్నా బీజేపీ, కాంగ్రెస్ కి కీలకంగా మారాయి. జనవరి 25వ తేదీనగాని వీటి భవిష్యత్తు తేలదు. ఆ ఫలితం కోసం వేచి వుందాం.