కెసిఆర్ తెలంగాణలో తిరుగులేని నాయకుడుగా రోజు రోజుకీ ఓ వైపు ఎదుగుతుంటే రెండోవైపు ఆయనకు ఒవైసీ గండం గ్రహణంలాగా పట్టుకున్నట్లు అనిపిస్తుంది. తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ఆసుపాసుల్ని పూర్తిగా ఆపోసన పట్టిన కెసిఆర్ కి తెలంగాణ అభివృద్ధికి ఎక్కడ ఏ చర్యలు తీసుకోవాలో బాగా తెలుసు. ముఖ్యంగా నీటిపారుదలరంగంలో తనదైన ముద్రవేస్తూ ముందుకు వెళ్తున్నాడు. మొదట్లో తుమ్మడిహట్టి నుంచి కాళేశ్వరం మార్చినందుకు వచ్చిన వివాదం క్రమక్రమంగా తగ్గుముఖంపట్టింది. ఎప్పుడయితే నీటిపారుదల ప్రాజెక్టులకు ఎక్కువ నిధులుకేటాయించి కాళేశ్వరం ప్రాజెక్టును పరుగులు పెట్టించాడో అప్పుడే రైతుల్లో సానుకూల వాతావరణం పెరుగుకుంటూ వచ్చింది. ఇంకో సంవత్సరానికి మొత్తం ప్రాజెక్టు ఫలితం రైతులకు చేరితే తనకు రాజకీయంగా తిరుగువుండదని అందరూ అనుకుంటున్నారు.
నిజంగాకూడా పరిస్థితులు పూర్తి అనుకూలంగా మారుతున్నాయని చెప్పొచ్చు. ఇదే వూపులో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కూడా పూర్తిచేస్తే తనను ప్రజలు నెత్తిన పెట్టుకొని పూజించుకుంటారు. ఒకసారి కాళేశ్వరం పూర్తయితే ఆ ప్రభావం దక్షిణ తెలంగాణ ప్రజలపై కూడా పడుతుందని మరచిపోవద్దు. పాలమూర్-రంగారెడ్డి, దిండి , సీతారామ ప్రాజెక్టులు కూడా పూర్తిచేస్తాడనే విశ్వాసం బలపడుతుంది. ఇవి రాజకీయంగా కెసిఆర్ కి అనుకూల పవనాలు. తనహయాంలో ఇన్ని ప్రాజెక్టులు పూర్తయితే ఒడిశాలో నవీన్ పట్నాయక్ లాగా దీర్ఘకాలం తెలంగాణాలో స్థిరపడే అవకాశం వుంది. ప్రజల్లో నవీన్ పట్నాయక్ పై వున్న సదభిప్రాయం కెసిఆర్ పై లేకపోయినా నీటిపారుదల ప్రాజెక్టులే తనని ఆ స్థాయిలో నిలబెడతాయని భావిస్తున్నారు.
అంతవరకు బాగానే వున్నా కెసిఆర్ అనవసరమైన రిస్కు తీసుకుంటున్నట్లు కనబడుతుంది. మొదట్నుంచీ రాజకీయాల్లో ధీటైన ఎత్తుగడలతో ప్రత్యర్థిని దెబ్బతీయటం కెసిఆర్ కి వెన్నతో పెట్టిన విద్య. దానికోసం అవసరమైతే విలువలను పక్కనపెట్టయినా ఎత్తుగడలు వేయటంలో తనకు మించినవాడు లేడు. దీంట్లో భాగంగానే తెలంగాణాలో ముస్లిం సామాజిక వర్గాన్ని జాగ్రత్తగా దగ్గరకు తీసి వాళ్ళ విశ్వాసాన్ని చూరగొనటం జరిగింది. అదేసమయంలో కేంద్రంలోని బీజేపీ తోకూడా సఖ్యతగా మెలుగుతూ కేంద్రం దగ్గర పనుల్ని చక్కదిద్దుకుంటూ వస్తున్నాడు. అయితే ఇది ఇటీవల ఇబ్బందిగా మారింది. ఒవైసీ కి బిజెపి కి పచ్చగడ్డివేస్తే భగ్గుమంటుందని తెలుసు. కేంద్రం లో మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని చర్యలు ముస్లిం సామాజిక వర్గంలో కొంతమేర వ్యతిరేకతను తీసుకొచ్చాయి. అంతకుముందు ముమ్మూరు తలాక్ , ఆర్టికల్ 370 బిల్లులపై కెసిఆర్ మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయటం తన మిత్రుడు ఒవైసీకి, ముస్లిం సామాజిక వర్గానికి కొంత అసంతృప్తిని కలిగించాయి. అయినా మొత్తం మీద రాష్ట్రంలో కెసిఆర్ ముస్లిం అనుకూల విధానాలు తీసుకోవటంతో కొంతవరకు సర్దుకుపోయింది.
కానీ ఇప్పుడు పౌరసత్వ చట్టం, ఎన్ పి ఆర్ , ఎన్ ఆర్ సి లపై ఏదోఒక వైపు మొగ్గాల్సిన పరిస్థితి కెసిఆర్ కి ఏర్పడింది. అందుకనే పౌరసత్వ బిల్లుపై బీజేపీ కి వ్యతిరేకంగా వోటువేయటం జరిగింది. ఇప్పుడు ఒవైసీ దేశవ్యాప్తంగా దీనిపై పెద్ద ప్రచారం చేపట్టటం తో పాటు కెసిఆర్ పై ఒత్తిడి పెంచటం జరిగింది. నిన్న ఒవైసీ ముస్లిం మత పెద్దల్ని తీసుకొని కెసిఆర్ తో మూడు గంటలు సమావేశం వేశాడు. కెసిఆర్ ని పూర్తిగా ఈ ప్రచారంలో భాగంగా మద్దత్తు కావాలని కోరినట్లు తెలుస్తుంది. కెసిఆర్ కూడా సానుకూలంగా ఉన్నట్లు అర్ధమవుతుంది. దీంట్లో భాగంగానే రేపు నిజామాబాదు లో జరిగే బహిరంగ సభకు తెరాస ప్రతినిధులు కూడా హాజరవుతారని తెలుస్తుంది. ఇదే జరిగితే కెసిఆర్ పెద్ద రిస్కు తీసుకున్నట్లే. ఇప్పటివరకు కెసిఆర్ ఒవైసీ పరోక్ష మద్దత్తు మాత్రమే తీసుకున్నాడు. ఇప్పుడు ప్రత్యక్షంగా తనతో కలిసి ప్రయాణం చేస్తే ఇది బీజేపీ కి ఓ లాటరీ తగిలినట్లే. కెసిఆర్ కి వ్యతిరేకంగా ఏదైనా ఘటన కోసం ఎదురుచూస్తున్న బీజేపీ కి ఓ ఆయుధాన్ని కెసిఆర్ ఇచ్చినట్లే అవుతుంది. ఎందుకంటే ప్రస్తుత సమస్య సమాజం లో మత పరమైన సమీకరణలకు వూతమిస్తుంటే కెసిఆర్ ఓ మతానికి పూర్తి మద్దత్తు ప్రకటించినట్లుగా బీజేపీ ప్రచారం చేసే అవకాశాలు మెండుగా వున్నాయి.
పౌరసత్వ బిల్లుని వ్యతిరేకించటం వేరు , ఒవైసీ తో కలవటం వేరు. ఈరెండింటిలో తేడా వుంది. ఇదే నిజామాబాద్ జిల్లా భైన్సాలో అక్బరుద్దీన్ ఒవైసీ హిందూ మతస్థులకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కేసులు ఎదుర్కుంటున్న సంగతి అందరికీ తెలుసు. ప్రజల్లో ఆ జ్ఞాపకాలు చెరిగిపోకముందే తిరిగి నిజామాబాదు లోనే ఈ బహిరంగ సభ జరగటం మెజారిటీ ప్రజలకు సమ్మతం కాదు. మరి ఈ సమావేశంలో తెరాస ప్రతినిధులు కూడా పాల్గొంటే అది ఆత్మహత్యా సదృశమవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. సమస్య ఏదైనా ఒవైసీ తో కలిసి సభను పంచుకోవటం కెసిఆర్ తీసుకుంటున్న పెద్ద రిస్కుగా భావించాలి. ఇది కెసిఆర్ వ్యూహాత్మక తప్పిదమవుతుందని అనుకుంటున్నారు. పొరపాటున సభలో ఒవైసీ ఏదైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే అది దావానలం లాగా మారుతుందని అందరికీ తెలుసు. ఇప్పుడు పూర్తి అనుకూల రాజకీయ వాతావరణంలో వున్న కెసిఆర్ కి ఇంత పెద్ద రిస్కు తీసుకోవాల్సిన అవసరం లేదు. కెసిఆర్ ఎత్తుగడల్లో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటాడని అందరూ భావిస్తున్న తరుణంలో ఇంత పెద్ద రిస్కు తీసుకుంటాడో లేదో వేచి చూద్దాం.