ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకూ కుల సమీకరణాలుగా మారుతున్నాయి. దానికి ప్రస్తుత రాజధాని వ్యవహారం కీలకంగా మారింది. ఆంధ్ర ప్రదేశ్ విభజన అయినదగ్గర్నుంచి ఈ కుల రాజకీయాలు ఊపందుకున్నాయి. జనాభాతో సంబంధంలేకుండా ఆంధ్ర రాజకీయాలు కేవలం రెండు కులాల ఆధిపత్యంలోనే నడుస్తున్నాయి. కమ్మ సామాజిక వర్గం రాజధాని విజయవాడ దగ్గరలోనే వుండాలని కోరుకున్నారు. వాళ్ళ కోరిక ఇప్పటిది కాదు. మద్రాసు నుండి ఆంధ్ర విడిపోయినప్పటినుండి వాళ్ళకది నెరవేరని కోరికలాగా మిగిలిపోయింది. అప్పుడు రాయలసీమ వాళ్ళ పట్టుదలతో అది కర్నూలుకి తరలిపోయింది. ఆ తర్వాత వుమ్మడి రాష్ట్రం ఏర్పాటయినా మధ్యలో మధ్యలో ఈ టాపిక్ లేవనెత్తుతూనే వున్నారు. ప్రత్యేక రాష్టం ఏర్పడినా న్యాయంగా దక్కాల్సిన రాజధాని దక్కలేదనే బాధ వ్యక్తంచేస్తూనే వున్నారు. తిరిగి 2014 లో ఆ అవకాశం వచ్చినప్పుడు ఎలాగైనా ఈసారి సాధించాలనే పట్టుదల ఎక్కువైంది.
కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణ న్ కమిటీ అందుకు సుముఖత వ్యక్తంచేయకపోవటంతో వారి కి పెద్ద షాక్ తగిలింది. దానికనుగుణంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. చంద్రబాబు నాయుడు కూడా అదే ఆలోచనలో ఉండటంతో కాగల కార్యం గంధర్వులు నెరవేర్చినట్లయ్యింది. నారాయణ అధ్యక్షతన ఏర్పాటుచేసిన కమిటీ ద్వారా ఏమి కావాలనుకుంటున్నారో దాన్నే చెప్పించి రాజధానిని అమరావతిలో ఏర్పాటుచేశారు. అందుకు కావాల్సిన భూమిని రైతులకు నచ్చచెప్పి ఇప్పించారు. అందుకు రాజధాని ఏర్పడితే అభివృద్ధిచేసి ఇచ్చే వాళ్ళ ప్లాట్లకు విపరీతమైన డిమాండ్ వుంటుందనే ఆశ కల్పించటంలో సక్సెస్ అయ్యారు. రెండోది ఆ ప్రాంతంలో పలుకుబడి కలిగిన రైతుల్లో ఎక్కువమంది వాళ్ళ సామజిక వర్గానికే చెందినవాళ్లు కావటంవలన పని కొంతమేర సులువయ్యింది. అవసరమైన చోట బెదిరింపులకు కూడా దిగారు. పచ్చని అరటితోటలను రాత్రికి రాత్రే ధ్వంసం చేయటం ఇందులో భాగమే. అదేసమయంలో రెడ్డి , కాపు సామజిక వర్గం ఎక్కువగా వున్న తాడేపల్లి, ఉండవల్లి గ్రామాల్లో ఎక్కువమంది రైతులు భూమి ఇవ్వలేదు. ఇచ్చినవాళ్లు ప్రభుత్వం చెప్పిన అధిక రాబడి ని దృష్టిలో ఉంచుకొని ఇవ్వటం జరిగింది.
అయితే రెడ్డి సామాజిక వర్గం దీన్ని జీర్ణించుకోలేకపోయారు. అమరావతి దగ్గర రాజధాని అనేది వాళ్ళ దృష్టిలో వాళ్ళ రాజకీయ అధిపత్యానికి ఎదురుదెబ్బ తగిలినట్లుగా భావించారు. అయినా ఏమీ చేయలేని పరిస్థితి. అందుకనే మొదట్నుంచీ వాళ్ళ పత్రికలో , ఛానల్ లో రాజధాని నిర్ణయం పై సన్నాయి నొక్కులు నొక్కుతూనే వున్నారు. ముఖ్యంగా ప్రచార సాధనాలన్నీ వారి వైరి సామాజికవర్గం కింద ఉండటంతో ఏమీచేయలేక అదనుకోసం ఎదురుచూస్తున్నారు. అదేసమయంలో దీన్ని ఎన్నికల్లో ఓ ప్రచారాస్త్రంగా వ్యూహాత్మకంగానే వాడలేదు. కానీ ఎన్నికల తదనంతరం వాళ్ళ వ్యూహాలకు పదునుపెట్టారు. రాజధాని ప్రకటించకముందే ఆ సామాజికవర్గం వేల ఎకరాల భూముల్ని కైవసం చేసుకోవటం మంచి ఎలిబీగా ఉపయోగపడింది. మొదట్నుంచీ మనసులోదాగివున్న వ్యతిరేకతను అమలు చేయటానికి చక చకా పావులు కదిపారు. చంద్రబాబు నాయుడు ప్రయోగించిన అస్త్రాన్నే జగన్ మోహన్ రెడ్డి ప్రయోగించాడు. అవకతవకల పై మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించాడు. నిపుణుల పేరుతో రెండు కమిటీలను ఏర్పాటుచేశాడు. ఇప్పుడు ఇంకో హై పవర్ కమిటీని నియమించాడు. చంద్రబాబు నాయుడు, జగన్ మోహన రెడ్డి వాళ్ళ సామాజికవర్గ ఒత్తిడితో తీసుకునే నిర్ణయాలకు కమిటీ సిఫార్సులను ప్రయోగించారు. కాబట్టి ఇద్దరూ ఆ తానులో ముక్కలేనని నిరూపించారు.
ఈ కుల జాడ్యం ఈ రెండు పార్టీలకే పరిమితం కాలేదు. మిగతా పార్టీల్లో వున్న నాయకులకూ అంటింది. సుజనా చౌదరి, పురందేశ్వరి బీజేపీ లో వున్నా ఈ విషయంలో సామాజికవర్గ ఆకాంక్షలమేరకే పనిచేస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ ను తెలివిగా సెంటిమెంటుతో పడగొట్టారు. ఒకటి తను గుంటూరు వాడు కావటం, రెండు ప్రధానమంత్రి శంఖుస్థాపన చేయటం లాంటి సెంటిమెంటుతో కన్నా లక్ష్మీనారాయణ కాపు సామాజిక వర్గానికి చెందినా వీళ్ళ స్టాండ్ కే మద్దతిచ్చాడు. ఇక చికెన్ నారాయణ కూడా పైకి ఎన్నిచెప్పినా సామాజికవర్గ ప్రయోజనాలకు పరోక్షంగా తోడ్పడుతుంటుంటాడు. ఇది అదివరకు కూడా ఎన్నో సంఘటనల్లో నిరూపనయ్యింది. అలాంటిదే స్వతంత్ర మేధావులు, విశ్లేషకులు కూడా చేస్తున్నపని. ఇదీ ఆంధ్ర రొచ్చు రాజకీయాల కధ.
అయితే ఈ నేపధ్యాన్ని పక్కనపెట్టి అసలు విషయాన్ని పరిశీలిద్దాం. అమరావతి రాజధానిగా అసెంబ్లీ ఆమోదించి, ప్రధానమంత్రి శంఖుస్థాపన చేసి, పనులు మొదలుపెట్టినతర్వాత ఇప్పుడు ఆ నిర్ణయాన్ని తిరగదోడాలనుకోవటం బుద్ధిమాలిన పని. పరిపాలనా కేంద్రం ఇక్కడేవుంచి మిగతా నిర్ణయాలను సమీక్షించుకోవచ్చు. ముఖ్యంగా కొత్త మహానగరాన్ని నిర్మించాలనుకోవటం అనుభమున్న చంద్రబాబు నాయుడు చేయాల్సిన పనికాదు. ఇప్పటికే ఆ లక్షణాలున్న విశాఖను అభివృద్దిచేస్తే మహానగరంగా రూపొందే అవకాశాలు మెండుగా వున్నాయి. ఈ విషయంలో ఇంత రచ్చ చేసుకునే బదులు పరిపాలనా కేంద్రాన్ని ఇక్కడేవుంచి మిగతా విషయాల్లో ఉదాహరణకు ఐటీ లాంటి పరిశ్రమలు విశాఖలో కేంద్రీకరిస్తే ఆ నగరం మహా నగరంగా రూపొందుతుందికదా. అనవసర రాద్ధాంతం చేసేబదులు విశాఖ మౌలిక సౌకర్యాల అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తే సరిపోయివుండేది కదా. గోటితో పొయ్యేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకోవటమంటే ఇదే.