హరీష్ వెనుక కేసీఆర్ వ్యూహమేంటి?

నిన్నమొన్నటివరకు మంత్రి పదవి ఎందుకివ్వలేదంటూ రచ్చ... ఇప్పుడు పోయిపోయి ఆ శాఖ ఎందుకిచ్చారోనంటూ చర్చ... అటు రాజకీయ వర్గాల్లో... ఇటు సోషల్ మీడియాలో హరీష్ రావుపై హాట్ డిస్కషన్ జరుగుతోంది. ఎవరికి తోచిన రీతిలో వాళ్లు విశ్లేషిస్తున్నా, హరీష్ అభిమానుల్లో అయితే, ఒకవైపు ఆనందం... మరోవైపు ఆందోళన వ్యక్తమవుతోంది. దాదాపు పది నెలలపాటు నియోజకవర్గానికే పరిమితమైన హరీష్ ను ఇప్పుడు మంత్రివర్గంలోకి అసలు ఎందుకు తీసుకున్నట్లు? పైగా ఆర్ధికశాఖ ఎందుకిచ్చినట్లు? ఆర్ధిక సమస్యలతో సతమతమవుతోన్న రాష్ట్రాన్ని చక్కదిద్దే బాధ్యతలు అప్పగించారా? లేక అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నంలో భాగమా? ఇలా అనేక అనుమానాలు, ప్రశ్నలతో మాట్లాడుకుంటున్నారు హరీష్ అభిమానులు.

ఒకవైపు దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్ళు తగ్గిపోవడం, మరోవైపు రాష్ట్ర ఆర్థిక వనరులు కుంచించుకుపోతుండటం, ఇంకోవైపు అప్పులు భారీగా పెరగడం, అలాగే ఎన్నికల హామీలు గుదిబండగా మారిన నేపథ్యంలో ఆర్ధికశాఖను నిర్వహించడం హరీష్ రావుకు కత్తి మీదే సామే అంటున్నారు. అయితే, టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ కి కేసీఆర్ కావాలనే ఆర్ధికశాఖ అప్పగించారనే మాట వినిపిస్తోంది. సమర్ధుడైన హరీష్... దారితప్పిన ఆర్ధిక పరిస్థితిని గాడిలో పెడతారనే నమ్మకంతోనే ఆ శాఖను కట్టబెట్టారని భావిస్తున్నారు. కేసీఆర్ మొదటి ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖను సమర్ధవంతంగా నిర్వహించి, కాళేశ్వరంలాంటి అతిపెద్ద ప్రాజెక్టును రికార్డు టైమ్ లో పూర్తి చేయించిన రికార్డు హరీష్ కి ఉండటంతో, ఇప్పుడు ఆర్ధిక పరిస్థితిని కూడా చక్కదిద్దుతాడనే ఫైనాన్స్ ను మేనల్లుడి చేతిలో పెట్టారని టీఆర్ఎస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

మరి, ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో కావాలనే కీలక బాధ్యతలను హరీష్ కి అప్పగించారా? లేక మరో వ్యూహం ఏదైనా ఉందా? అనేది ముందుముందు తెలుస్తోంది. ఏదేమైనా ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్ధికశాఖ నిర్వహణ కత్తి మీదే సామే. మరి ఈ ఛాలెంజ్ లో హరీష్ సక్సెస్ సాధిస్తారో? లేక ముళ్లకిరీటంగా మారుతుందో చూడాలి

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.