తెలంగాణలో బంద్ ప్రారంభం, అరెస్టులు ఆరంభం

తెలంగాణాలో ఆర్టీసీ కార్మికులు 15 రోజులుగా చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్త బంద్‌ జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు బంద్‌లో పాల్గొంటున్నాయి. కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ-టీఎస్‌, టీజేఎస్‌, సీపీఐ, సీపీఎం, జనసేన, ఎమ్మార్పీఎస్‌, యూసీసీఆర్‌ఐ (ఎంఎల్‌), సీపీఐఎంఎల్‌, న్యూ డెమొక్రసీ, ఎంసీపీఐ పార్టీ నేతలు బంద్‌కు మద్దతు ఇచ్చి బంద్ ను విజయవంతం చేయాలనుకుంటున్నాయి. బంద్‌లో భాగంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఒక వైపు బంద్‌ను విజయవంతం చేసి ప్రభుత్వం దిగొచ్చేలా చేయాలన్న లక్ష్యంతో ఆర్టీసీ కార్మికులు మరో వైపు తెరాస ప్రభుత్వం కూడా భారీగా పోలీసులను మొహరింప చేసి బంద్‌ను నీరుకార్చాలని ప్రభుత్వం యేచిస్తుంది ఆలోచిస్తుంది. ఈ నేపధ్యం లో ఇప్పటికే అనేకచోట్ల కోదండరామ్‌ ను, బీజేపీ, వామపక్షాల నేతలను, టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా అరెస్టుల పర్వం కొనసాగుతుంది.

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సికింద్రబాద్‌ జూబ్లీ బస్టాండ్‌ వద్ద బంద్‌లో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌, పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆర్టీసీ కార్మికులతో వెంటనే ప్రభుత్వం చర్చలు జరపాలని ఈ సందర్భంగా కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులను పోలీసులు అరెస్ట్‌ చేశారు

వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలకడంతో వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నాయి. పరకాల పట్టణం నిర్మానుష్యంగా మారింది. ప్రయాణికులు లేక పరకాల బస్టాండ్ వెలవెలబోతోంది. తాత్కాలిక డ్రైవర్లు కండక్టర్లు విధులకు హాజరు రాకపోవడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. డిపో ప్రాంగణంలో భారీగా పోలీసులను మొహరించారు. పరకాల ఆర్టీసీ జేఏసీకి చెందిన 20 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఉదయం 5 గంటల నుండే ఇండ్లలోకి పోయి కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిజమాబాద్ జిల్లా వ్యాప్తంగా బంద్‌ కొనసాగుతోంది. డిపోల ఎదుట భారీగా పోలీసులను మొహరించారు. అర్ధరాత్రి నుంచి కార్మిక సంఘాల నేతలు ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంద్‌ నేపథ్యంలో 6 డిపోల పరిధిలో 670 బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రోడ్డు ఎక్కని బస్సులతో ప్రయాణికుల ఇబ్బందులు పడుతున్నారు. బోధన్ బస్టాండ్‌లో ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. బోధన్ బస్ డిపో ముందు ధర్నా చేస్తున్న వామపక్షాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.