దక్షిణాఫ్రికా టెస్ట్ : క్లీన్ స్వీప్ పై భారత్ కన్ను

దక్షిణాఫ్రికాతో శనివారం నుంచి రాంచీ వేదికగా జరిగే మూడో టెస్టు కోసం టీమిండియా ముమ్మర సాధన చేస్తోంది.ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. దీని కోసం భారత ఆటగాళ్లు సాధనలో నిమగ్నమయ్యారు. కీలక ఆటగాళ్లు చటేశ్వర్ పుజారా, ఇషాంత్ శర్మ, అశ్విన్, మయాంక్ అగర్వాల్ తదితరులు గురువారం సాధన చేశారు. చాలా మంది భారత క్రికెటర్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. ప్రధాన కోచ్ రవిశాస్త్రితో పాటు సహాయక సిబ్బంది పర్యవేక్షణలో ప్రాక్టీస్ సాగింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ఇప్పటికే రెండు టెస్టుల్లో గెలిచింది. 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్ తాజాగా క్లీన్‌స్వీప్‌పై దృష్టి పెట్టింది. ఆఖరి మ్యాచ్‌లోనూ గెలిచి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చాలా బలంగా ఉన్న విరాట్ కోహ్లి సేనకు ఈ మ్యాచ్‌లో గెలవడం పెద్దగా కష్టం కాక పోవచ్చు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌కు జట్టులో కొదవలేదు. ఆటగాళ్లందరూ ఫామ్‌లో ఉండడం కూడా భారత్‌కు కలిసి వచ్చే అంశం.

నిలకడగా ఆడితే చివరి మ్యాచ్‌లోనూ విజయం సాధించడం భారత్‌కు కష్టం కాకపోవచ్చు. రాంచీ పిచ్ కూడా స్పిన్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని పిచ్ క్యూరేటర్ తనతో చెప్పాడని దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ పేర్కొన్నాడు. ఈ విషయం నిజమైతే అశ్విన్, జడేజాలతో సఫారీలకు మరోసారి ఇబ్బందలు తప్పక పోవచ్చు. సిరీస్‌లో అశ్విన్ 14 వికెట్లు పడగొట్టి తానెంటో నిరూపించాడు. జడేజా ఇటు బ్యాట్‌తో అటు బంతితో నిలకడగా రాణిస్తున్నాడు. పది వికెట్లు తీసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మయాంక్, రోహిత్‌లు రెండేసి సెంచరీలతో సత్తా చాటారు. కోహ్లి కూడా అజేయ డబుల్ సెంచరీతో ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. ఈ పరిస్థితుల్లో రాంచీలో జరిగే ఆఖరి మ్యాచ్ సౌతాఫ్రికాకు సవాలుగా మారిందనే చెప్పాలి.

 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.