ఎస్పీజీ బిల్లుకి లైన్ క్లియర్, రాష్ట్రపతి ఆమోదమే తరువాయి

ఈ రోజు రాజ్యసభలో ఎస్పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) బిల్లు ఆమోదం పొందింది. గత వారం ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపిన విషయం తెల్సిందే.. దింతో ఉభయ సభల్లో ఆమోదం పొందడంతో.. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడటమే తరువాయి.. సవరణలతో కూడిన ఎస్పీజీ చట్టం అమల్లోకి వస్తుంది. రాజ్యసభలో ఈ బిల్లు చర్చకు వచ్చిన సమయంలో.. సోనియా, రాహుల్, ప్రియాంకలకు ఎస్పీజీ కవర్‌ను తప్పించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ వాకౌట్ చేసింది.

భద్రత గాంధీలకు మాత్రమే కాదు, భారతీయులందరికీ అవసరం అని అమిత్ షా అన్నారు. గాంధీ కుటుంబాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకొని ఎస్పీజీ బిల్లు తీసుకొచ్చామనడం నిజం కాదని షా తెలిపారు. ముప్పు తీవ్రతను అంచనా వేసిన తర్వాతే.. ఈ బిల్లును తీసుకురావడానికి ముందే.. గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను తొలగించామన్నారు.

ఎస్పీజీ చట్టానికి ఇది ఐదో సవరణ అని చెప్పిన అమిత్ షా.. గతంలో నాలుగు సవరణలు మాత్రం ఒకే ఒక కుటుంబాన్ని (గాంధీ) దృష్టిలో ఉంచుకొని జరిగాయన్నారు. తాజా సవరణ ద్వారా ఎక్కువ ప్రభావితం అయ్యేది ప్రధాని మోదీ అని హోం మంత్రి తెలిపారు. ప్రధాని పదవి నుంచి తప్పుకున్న ఐదేళ్ల తర్వాత ఆయనకు ఎస్పీజీ భద్రత ఉపసంహరిస్తారని ఆయన చెప్పారు.

భారత మాజీ ప్రధానులు పీవీ నరసింహా రావు, ఐకే గుజ్రాల్, చంద్ర శేఖర్, దేవేగౌడ, మన్మోహన్ సింగ్‌లకు సెక్యూరిటీ కవర్‌ను ప్రభుత్వం తొలగించినప్పుడు ఎలాంటి వివాదం తలెత్తలేదన్నారు.

ఎస్పీజీ సవరణ బిల్లు 2019 ప్రకారం.. ఇక నుంచి అత్యున్నత స్థాయి ఎస్పీజీ భద్రత కేవలం ప్రధాని, ఆయనతోపాటు అధికారిక నివాసంలో నివసించే కుటుంబ సభ్యులకు మాత్రమే వర్తిస్తుంది. మాజీ ప్రధానులు, ఆయనతో కలిసి నివసించే కుటుంబ సభ్యులకు ప్రధాని పదవి నుంచి వైదొలిగిన ఐదేళ్ల వరకు ఎస్పీజీ భద్రత కల్పిస్తారు. ఎస్పీజీ బిల్లుకు లోక్ సభ నవంబర్ 27న మూజువాణి ఓటు ద్వారా ఆమోదం తెలిపింది. అప్పుడు కూడా కాంగ్రెస్ ఎంపీలు వాకౌట్ చేశారు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.