సెల్ఫ్ గోల్స్ వేసుకుంటున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పని ఒకదానిమీద ఒకటి సెల్ఫ్ గోల్స్ వేసుకోవటంలాగుంది. లోక్ సభ కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి కాశ్మీర్ అంతర్గత సమస్యనా, ద్వైపాక్షికమా లేక అంతర్జాతీయ సమస్యనా అనే సందేహం లేవనెత్తి సెల్ఫ్ గోల్ వేసుకుంటే మనోజ్ తివారి అనవసరంగా ఆంధ్ర-తెలంగాణ విభజన ని కెలికి ఇంకో సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. ఆంధ్ర - తెలంగాణ విభజన సమయంలో మేము ఎంత అద్భుతంగా అందరినీ సంప్రదించించి బిల్లు తెచ్చామో చూడండంటూ మనోజ్ తివారి మాట్లాడిన తీరు పెద్ద వివాస్పదమయింది. అనవసరంగా మండుతున్న గాయాన్ని ఇంకోసారి కెలికినట్లయింది. కాశ్మీర్ బిల్లు విషయంలో ఆంధ్ర-తెలంగాణ విభజన బిల్లు పోలిక తెచ్చి లబ్ది పొందుదామనుకుంటే మొదటికే మోసం వచ్చింది.

అటు అధిర్ రంజాన్ చౌదరిని, ఇటు మనోజ్ తివారి ని అమిత్ షా పూర్తిగా ఎండకట్టటం తో పాటు ఇద్దర్నీ ఓ ఆట ఆడుకున్నాడని చెప్పాలి. మనోజ్ తివారి కి సమాధానమిస్తూ ఆంధ్ర-తెలంగాణ విభజన బిల్లు ఎంత అప్రజాస్వామికంగా పాస్ అయ్యిందో సోదాహరణంగా వివరించాడు. కాశ్మీర్ అసెంబ్లీ లేని తరుణంలో ఈ బిల్లు పాస్ చేయటం అప్రజాస్వామికం అని చెప్పేవాళ్ళు వుమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేసినప్పుడు పార్లమెంట్ ఆ అభిప్రాయాన్ని తుంగలో తొక్కటం ఎటువంటి ప్రజాస్వామ్యమో చెప్పాలని అమిత్ షా గట్టిగా ప్రశ్నించాడు. లైట్లు ఆపి, టీవీ ప్రసారాలు బంద్ చేసి బిల్లు పాస్ చేసిన రోజు ఈ నీతులేమయ్యాయని ప్రశ్నించాడు. మెల్లి, మెల్లిగా మానుతున్న గాయాన్ని తిరిగి కెలకడం సెల్ఫ్ గోల్ కాక మరేంటి?

కాంగ్రెస్ పార్టీ దశ దిశా లేని నావ లాగా అయిపొయింది. ముఖ్యంగా కాశ్మీర్ సమస్యపై కాంగ్రెస్ నాయకుల్లో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ లో ముఖ్య నాయకులైన జ్యోతిరాదిత్య సింధియా , భూపేందర్ హుడా , మిలింద్ దేవర లాంటి యువనాయకులు ప్రభుత్వాన్ని సమర్ధిస్తూ ప్రకటనలివ్వటం జరిగింది. రాజ్య సభ చీఫ్ విప్ భువనేశ్వర్ కాలిట ఏకంగా పదవికే రాజీనామా చేశాడు. అయినా మంకుపట్టు వీడకుండా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కాశ్మీరుపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానం చేసింది. కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా తయారయ్యింది. ఇది చివరకు ఎక్కడికి చేరుతుందో అంతుచిక్కటంలేదు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.