సంక్షోభం బాటలో తెలంగాణ ఆర్ధికం

ముఖ్యమంత్రి కెసిఆర్ నిన్న తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అసలు ఆరు నెలల తర్వాత బడ్జెట్టు ప్రవేశపెట్టటమే ఒక తప్పు. ఆరు నెలల వరకు బడ్జెట్టు ప్రవేశపెట్టకపోవటాన్ని ఏవిధంగా చూడాలి? సహేతుకమైన ప్రాతిపదిక, కారణం లేకుండానే ఇన్నాళ్లు బుడ్జెట్టుని వాయిదావేయటం ప్రజాస్వామ్య వ్యవస్థలో పెద్ద పొరపాటు. పెట్టిన బడ్జెట్ 6 నెలలకోసమే. అందుకనే ఇది ప్రాధమికంగా లోపంగా భావించాలి.

ఇకపోతే బడ్జెట్ స్వరూపం అభివృద్ధికి వూతం ఇచ్చేదిగా లేదు. వోట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టిన తర్వాత బడ్జెట్ అంచనాల్లో ఇంత కోత విధించటం బహుశా చరిత్రలో రికార్డులాగా వుంది. ఒకవైపు డబ్బులు లేవని చెబుతూనే రెండోవైపు సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయించటం ఆర్ధిక పరిభాషలో సంక్షోభబాట పట్టినట్లుగా భావించాలి. డబ్బులు లేనప్పుడు నిధుల పంపకంలో సమతుల్యత పాటించాలి. మౌలిక సౌకర్యాలకు , విద్యకు, ఆరోగ్యానికి భారీగా నిధుల్లో కోత విధించటం అదే సమయం లో సంక్షేమపథకాలకు విపరీతంగా నిధులు ఖర్చు పెట్టటం సామాజికాభివృద్ధికి దోహదం చేస్తుందా? ఖచ్చితంగా కాదనే చెప్పాలి. ఎందుకంటే సామాజికాభివృద్ది నాణ్యమైన విద్య, అందుబాటులో అధునాతన వైద్యం, కనీస మౌలిక సౌకర్యాలపై ఆధారపడివుంది. సంక్షేమ పధకాలు తాత్కాలిక ఉపశమన చర్యలు మాత్రమే. అయితే రాజకీయ నాయకులు మొదటి ఆప్షన్ బదులు రెండో ఆప్షన్ ఎన్నుకోవటానికి ఓట్ల రాజకీయాలే కారణం. ఈ విషయం లో ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరాకాష్టకు చేరారు. తెలంగాణ లో విభజన తర్వాత మిగులు నిధులు ఉండటం, హైద్రాబాదు అధిక ఆదాయాన్ని సమకూర్చటం లాంటి సౌకర్యాలతో మొదటి అయిదు సంవత్సరాలు కెసిఆర్ కి సంక్షేమ పథకాలపై అధిక మొత్తం లో నిధులు కేటాయించటానికి వెసులుబాటు కలిగింది. అప్పుడే ఆ మిగులు నిధులను జాగ్రత్తగా ఖర్చుచేసివుంటే ఈరోజు తెలంగాణ మరింత మెరుగైన ఆర్ధిక స్థితిలో ఉండేది. దురదృష్టవశాత్తు ఆ మిగులు నిధుల్ని విచ్చలవిడిగా ఖర్చు చేయటమే కాకుండా అప్పులుకూడా విపరీతంగా చేయటంవలన ప్రస్తుత పరిస్థితి దాపురించింది. ఇప్పటికైనా మేలుకొని ప్రాధాన్యాలను ఈ బడ్జెట్ లో మార్చుకొని ఉంటే తెలంగాణ వచ్చే ఐదేళ్లలో దేశంలోనే ప్రధమ స్థానం లో ఉండేది. ఇప్పటికే ముందుగా పెట్టుబడిపెట్టిన కాంట్రాక్టర్లు, డబ్బులు రావలసిన ఆసుపత్రులు రాష్ట్ర ప్రభుత్వంపై గుర్రుగా వున్నారు. ముందుగా ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దుకొని ఉంటే బాగుండేది. అందునా ఇప్పట్లో ఎన్నికలు లేనందున ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరమే ఆ వెసులుబాటు వుంది. ఆ అవకాశాన్ని కెసిఆర్ ఉపోయోగించుకోక పోవటం దురదృష్టం. దీర్ఘకాల ప్రయోజనాలకన్నా స్వల్పకాల లబ్ది కే కెసిఆర్ మొగ్గుచూపటం బాధాకరం.

ఈ పరిస్థితి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ వుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఇదే బాటలో పయనిస్తున్నాయి. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాలు ఇందులో ముందున్నాయి. ఆంధ్రాలో ఆదాయవనరులు తక్కువున్నా , రాష్ట్ర పరిస్థితి లోటులో వున్నా సంక్షేమ పధకాలకు పెద్దపీట వేసారు . వనరుల సమీకరణ పెద్ద సమస్యగా మారినా వీళ్ళ ఆలోచనల్లో మార్పురావటం లేదు. తెలంగాణ బడ్జెట్ లో ఈ సంవత్సరం వడ్డీ చెల్లింపులకే పద్నాలుగున్నర వేల కోట్లు కేటాయించటం దాని ఆర్ధిక పరిస్థిని తేటతెల్లం చేస్తుంది. బడ్జెటేతర రుణాలు ఈ సంవత్సరం తో కలుపుకుంటే లక్ష రూపాయలు చేరటం ఆందోళన కలిగిస్తుంది. ఇది బడ్జెట్ లో చూపిన 2 లక్షల రుణాలకు అదనం. స్థాయికి మించి అప్పులుచేస్తే తెలంగాణ ప్రజల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. ఆంధ్రాలో పరిస్థితి ఇంకా దారుణంగా వుంది. రాష్ట్రాల ఈ ఆర్ధిక పెడధోరణులపై 15 వ ఆర్ధిక కమిషన్ గట్టి నియంత్రణ పెట్టాల్సిన అవసరం ఎంతయినా వుంది. ఒకవైపు ఆర్ధిక మాంద్యం వైపు పయనిస్తున్నామని చెబుతూ రెండోవైపు ఈ విచ్చలవిడితనాన్ని అరికట్టకపోతే ప్రజలు ముందు ముందు ఇబ్బందులు పాలవుతారని పాలకులు గ్రహించాలి. లేకపోతే రాష్ట్రానికి, ప్రజలకు అన్యాయం చేసినవారవుతారు.

 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.