శభాష్ విజయసాయి రెడ్డి

విజయసాయి రెడ్డి రాజ్య సభలో తనదయిన పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే తనకొక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇటీవల కాలంలో తెలుగువాళ్ళలో ఆ మాత్రం ప్రత్యేకతను సాధించిన వాళ్ళు లేరనే చెప్పాలి. దాదాపు ప్రతి బిల్లుపై చర్చల్లో పాల్గొంటూ సభలో ఓ ఇమేజ్ ని పెంచుకోగలిగాడు. అలాగే ప్రశ్నల గంట సమయంలో కూడా ఎక్కువ ప్రశ్నలు లేవనెత్తుతున్నాడు. సభ్యుల కోసం కేటాయించిన ప్రైవేట్ మెంబెర్ బిల్లు సమయంలోకూడా కొన్ని ప్రత్యేక బిల్లులు పెట్టటమే కాకుండా చివరిదాకా దాని ఆమోదం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఓ విధంగా ఆ విషయంలో ప్రభుత్వ వర్గాలను ఇరుకున పెడుతున్నాడని చెప్పాలి. మొన్నటికి మొన్న తలాక్ బిల్లుపై అందరూ వైస్సార్సీపీ మద్దత్తు ఇస్తుందని ఊహించారు. కానీ బిల్లు కి వ్యతిరేకంగా ఓటు వేసి తన పార్టీ పంథాను గట్టిగా వినిపించాడు. ఈ ఘటనలన్నీ చూస్తే ఇన్నాళ్లకు తెలుగువాడు ఒకడు పార్లమెంటులో గట్టి పిండం దొరికాడనిపిస్తుంది. డ్రెస్సులోనూ ఓ ప్రత్యేకంగా ఉంటున్నాడు. ప్యాంటు, షర్ట్ పై ఓ జాకెట్ తో కనిపిస్తున్నాడు. ఇదంతా ఎందుకుచెబుతున్నానంటే తెలుగు వాళ్ళు ఏ పార్టీ లో వున్నా సమర్ధత ఉంటే అభినందించాల్సిందే. ప్రతిదీ రాజకీయంగా చూడాల్సిన పనిలేదు. కాకపోతే హిందీ భాష అసలు మాట్లాడటం లేదు. జాతీయరాజకీయాల్లో రాణించాలంటే హిందీ భాష నేర్చుకుంటే మంచిది.

పాత లోక్ సభ, రాజ్య సభ లో ఇలా ప్రత్యేకతను చూపగలిగిన వాళ్లు లేరని చెప్పాలి. లోక్ సభ లో రామమోహన్ నాయుడు కొంతమేరకు అవలీలగా మాట్లాడగలిగేవాడు. తాను మళ్ళీ ఎన్నిక కావటం సంతోషం. అయితే తన ప్రతిభని పార్టీ సరిగ్గా ఉపయోగించుకోలేదనిపిస్తుంది. చంద్రబాబు అనుకూల ప్రచార సాధనాలు ఒక్కసారి గళ్ళా జయదేవ్ మోడీని విమర్శిస్తూ లోక్ సభ లో మాట్లాడితే హారతులు పట్టి స్వాగతించారు. కానీ అదే ప్రచారం రామమోహన్ నాయుడుకి రాలేదు. దీన్ని ఏమనాలి? రామమోహన్ నాయుడు సహజ సిద్దమైన వక్త. జయదేవ్ రాసుకొని చదువుతాడు. ఇద్దరికీ పోలికే లేదు. అయినా జయదేవ్ ఫస్ట్ , రామమోహన్ నాయుడు సెకండ్ . అదీ తెలుగుదేశం లో న్యాయం.

ఇకపోతే ఇన్నాళ్లు పార్లమెంటు లో తెలుగు వాళ్ళ ప్రాతినిధ్యం ఎలా వుంది? ఆంధ్ర ప్రాంతం లో కేవలం వ్యాపార ప్రయోజనాలు చూసుకొనేవాళ్లే ఎక్కువమంది వున్నారు. పార్లమెంటు లో అనర్గళం గా మాట్లేడేవాళ్లు తక్కువ. అదే తెలంగాణ నుంచి ఎక్కువమంది రాజకీయవేత్తలే వున్నారు. ఈ లోక్ సభ ఒక్క సెషన్ మాత్రమే అయిపోవచ్చింది. ఆంధ్రానుంచి ఒక్క విజయసాయి రెడ్డి మాత్రమే ఓ ఇంపాక్ట్ తెచ్చుకోగలిగాడు . మిగతా వాళ్ళ పనితీరు ఆ స్థాయిలో లేదు. ముందు ముందు ఏమైనా డెవలప్ అవుతారేమో చూడాలి. విజయసాయి రెడ్డి పనితీరుకు అభినందనలు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.