సానుకూలత తెచ్చిన జగన్ బడ్జెట్

జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సమాజంలోని అన్ని వర్గాలను సంతృప్తి పరిచిందని చెప్పాలి. చెప్పినవిధంగానే ఎన్నికల ప్రణాళిక లోని నవరత్నాలకు నిధులు కేటాయించటం జరిగింది. మొత్తంమీదచూస్తే వ్యవసాయరంగానికి అధికనిధులు కేటాయించి ఇది రైతుల ప్రభుత్వమని చాటుకున్నాడు. గ్రామసచివాలయాలకు , గ్రామ వాలంటీర్లకు బడ్జెట్ లో నిధులు కేటాయించి ఆలోచనలను వేగంగా అమలుచేస్తానని నిరూపించుకున్నాడు. ఈ కొత్త కాన్సెప్ట్ విజయవంతమయితే జగన్ కి ఇప్పట్లో తిరుగులేనట్లే. కానీ దీనికి ఓ కావియట్ వుంది. ఈ నాణేనికి రెండు వైపులా పదునుంది . విజయవంతమయితే ఎంత పేరు వస్తుందో విఫలమయితే అంతే అప్రతిష్ట మూట కట్టుకోవాల్సి ఉంటుంది. గ్రామవాలంటీర్ల ఆలోచన మంచిదయినా సమస్యల్లా దాన్ని అవినీతి అంటకుండా అమలుచేయడం లోనే వుంది. ఎందుకంటే మన సమాజం లో ప్రతిదీ కలుషితమే . గ్రామవాలంటీర్లు నిబద్దతతో పనిచేస్తే ప్రజలకు పెద్ద వెసులుబాటు కలుగుతుంది. వాళ్లలో స్వార్ధం పెరిగితే అదే జగన్ కి పెద్ద గుదిబండ అవుతుంది.

మిగతా రంగాల్లోనూ అధిక నిధులు కేటాయించటం జరిగింది. రాజకీయంగా చూస్తే కాపు సంక్షేమానికి 2వేలు కోట్లు కేటాయించి సామాజిక వర్గాల్లోఅతి పెద్దదైన కాపు సామాజిక వర్గంలో పట్టు సాధించటానికి ప్రయత్నం చేశాడు. అలాగే ఆర్టీసీ కి అండగా నిలబడటం ఎన్నికల్లో చెప్పింది చేస్తానని రుజువుచేసుకున్నాడు. నవరత్నాల్లో పింఛన్లకు పెద్దపీట వేశాడు. అలాగే జగన్ ముఖ్యపధకాలు అమ్మఒడి , రైతు భరోసా లాంటి పథకాలకు అధిక నిధులు కేటాయించాడు. అగ్రిగోల్డ్ బాధితులకు కూడా న్యాయం చేయటం జరిగింది

.

ఇవన్నీ బాగానే వున్నాయి కానీ ద్రవ్యలోటు 35 వేలకోట్లకు పైగా ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ఈ లోటును ఎలా పూడుస్తారో స్పష్టత లేదు. ఒకవేల అదనపు నిధులు సమకూరకపోతే ఇప్పుడు ప్రకటించిన అనేక పథకాలకు నిధుల్లో కోత విధించాల్సి వస్తుంది. ఇప్పటి పరిస్థితుల్లో ఇది అంత తేలిక కాదు. జీఎస్టీ వచ్చిన తర్వాత రాష్ట్రానికి అదనపు వనరుల సమీకరణాల్లో పరిమితులున్నాయి. కాబట్టి ఆర్ధికవేత్తలకి అదనపు వనరుల సమీకరణ చిక్కుముడిగా వుంది. మొత్తమ్మీద మొదటి బడ్జెట్ ప్రజల్లో సానుకూలతను తెచ్చిపెట్టింది. అయితే ఈ అనుకూలత ని నిలబెట్టుకోవటం అదనపు వనరుల సమీకరణ మీదనే ఆధారపడి వుంది. ప్రస్తుతానికి దీన్ని కాల పరీక్షకు వదిలిపెడదాం.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.