రుణమాఫీ పధకాన్ని మధ్యలో ఆపొద్దు

జగన్-చంద్రబాబునాయుడు రాజకీయ క్రీడలో ప్రజల్ని బంతిలాగా ఆడుకుంటున్నారు. అందులోభాగమే రైతు రుణమాఫీపై పిల్లిమొగ్గలు. సూత్రబద్ధంగా చూస్తే రైతు రుణమాఫీ పధకం అన్నివిధాలా చేటు చేసేదే. అయితే సమస్యల్లా మధ్యలో ప్రజల్ని బలిచేయటం. ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ పధకాలు సాధ్యమైన మేర కొనసాగించకపోతే నష్టపోయేది ప్రజలే. పరిపాలనా వ్యవస్థపై కూడా ఈ నిర్ణయాల ప్రభావం పడుతుంది. ఇప్పుడు రుణమాఫీ పధకం కూడా ఈ రాజకీయ క్రీడలో ఇరుక్కుపోయింది. జగన్ మొదట్నుంచీ రుణ మాఫీ పధకం పై సుముఖంగా లేడు. అంతవరకూ ఓకే . మరి ఇప్పుడు పధకాన్ని మధ్యలో ఆపితే ప్రజల పరిస్థితేమిటి?

రుణ మాఫీ పధకం ఆ పార్టీ , ఈ పార్టీ అని కాకుండా అన్ని పార్టీలు తరతమ భేదంతో రాష్ట్రాల్లో అమలు చేస్తున్న వాళ్ళే. బీజేపీ కేంద్రం లో వ్యతిరేకించినా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రుణ మాఫీ వాగ్దానంతోనే అనేక రాష్ట్రాల్లో నెగ్గింది. రిజర్వు బ్యాంకు మొదట్నుంచి ఈ పధకం మంచిది కాదని హెచ్చరిస్తూనే వుంది. అయినా ఓట్ల రాజకీయంతో పోలిస్తే దేశ ఆర్ధిక పరిస్థితి రాజకీయ పార్టీలకు ఓ లెక్కా. అసలు ఈ పధకం వలన కొద్ది మంది రైతులే లాభపడుతున్నారనిఆర్ధిక సంస్థల విశ్లేషణ. చిన్న, సన్నకారు రైతులు, కౌలుదారులు ఎక్కువమంది బ్యాంకుల్లో పంటరుణాలు తీసుకోవటం లేదని , ఇప్పటికీ ఇతర మార్గాల్లోనే అప్పులు తీసుకుంటున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. రుణమాఫీ పథకంతో పోలిస్తే ప్రత్యక్ష నగదు పధకాలు వేయిరెట్లు మేలని కూడా ప్రకటించాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాలు ప్రత్యక్ష నగదు పథకాలతో పాటు రుణమాఫీని కూడా అమలుచేస్తున్నాయి. ఇది రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితిపై పెనుభారాన్ని మోపింది.

రిజర్వు బ్యాంకు రుణమాఫీని మొదట్నుంచి వ్యతిరేకిస్తుంది. దీనివలన ఆర్ధిక క్రమశిక్షణ దెబ్బతింటుందని వాపోతుంది. రుణవసూళ్లు దీనివలన దారుణంగా పడిపోయాయని చెబుతుంది. అయితే కొంతమంది మేధావులు దీన్ని ఖండిస్తూ విజయ మాల్యా లాంటి మోసగాళ్లకు కోట్లకు కోట్లు బ్యాంకులు మాఫీ చేయంగా లేంది రైతులకు మాఫీచేస్తే తప్పేంటని వాదిస్తున్నాయి. ఇది పసలేని, వ్యతిరేక వాదనగా చూడాలి. ఒక తప్పుకు ఇంకో తప్పు జవాబు కాదు. అసలు మొదటి తప్పు విషయంలోనూ వాస్తవాల్ని వక్రీకరిస్తున్నారు. ప్రభుత్వంగానీ, బ్యాంకులు గానీ విజయ మాల్యా లాంటి మోసగాళ్లకు రుణమాఫీ చేయటంలేదు. వాళ్ళు రుణాలు తీసుకొని ఎగ్గొట్టి పారిపోయారు. వాళ్ళను సరైన సమయంలో పట్టుకోలేకపోవటం అధికార యంత్రాంగం, బ్యాంకు అధికారుల వైఫల్యమే. దాని నివారణకు గట్టి చర్యలు తీసుకోవాల్సి వుంది. వీళ్ళతో కుమ్మక్కైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అందరం ముక్త కంఠంతో అడగాలి. అంతేగాని ప్రభుత్వం వాళ్లకు రుణమాఫీ చేసిందని చెప్పటం వాస్తవాలను వక్రీకరించటమే అవుతుంది.

కాబట్టి సూత్రప్రాయంగా రుణమాఫీ దేశ ఆర్ధిక వ్యవస్థకు హాని చేస్తుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు సమస్యల్లా తప్పో , ఒప్పో రుణ మాఫీ అమలు చేస్తున్నప్పుడు మధ్యలో ఆపేస్తే వచ్చే పరిణామాలేంటి. మిగిలిపోయిన రుణాన్ని రైతులు భరించాల్సి ఉంటుంది. ఇది అనుకోని పరిణామం. ఋణం మొత్తం ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుందని రైతుకి హామీ వుంది కాబట్టి రైతు ఇప్పుడు ఆ పధకాన్ని రద్దు చేస్తే తిరిగి తానే కట్టుకోవాలంటే మానసికంగా షాక్ కి గురిఅవుతాడనే విషయం ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ప్రభుత్వంలో పార్టీలు మారినప్పుడల్లా ప్రజల జీవితాలతో ఆడుకోవటం ఎంతవరకు సబబు? ఈ ప్రభుత్వం కొత్తగా రుణమాఫీ చేయనంటే అందరూ ఆహ్వానిద్దాం. భవిష్యత్తులోనన్నా సరైన ఆర్ధిక విధానాలు అవలంబిస్తున్నారని సంతోషపడదాం. కానీ అమలవుతున్న పధకాన్ని మధ్యలో వున్నఫలానా ఆపేసి మీ బతుకు మీరు చావండి అనటం బాధ్యతా రాహిత్యం. ఇప్పటికైనా జగన్ తన నిర్ణయాన్ని మార్చుకొని వున్న పధకాన్ని చివరివరకు కొనసాగిస్తాడని ఆశిద్దాం.

ఇది చదవండి: అల్లి బొల్లి కబుర్ల సుజనా చౌదరి!

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.