కోస్టల్‌ జాగ్వార్‌లో అగ్ని ప్రమాదానికి కారణాలేమిటి?

విశాఖ తీరానికి సమీపంలో నౌకాశ్రయ సింగిల్‌ పాయింట్‌ మూరింగ్‌ (ఎస్‌.పి.ఎం) వద్ద కోస్టల్‌ జాగ్వార్‌ అగ్ని ప్రమాదానికి గురవటం తీర భద్రతలోని డొల్లతనాన్ని బయటపెట్టింది. నౌకాశ్రయ అధికారులకు గుత్త సంస్థ కొమాకో ఇచ్చిన సమాచారం ప్రకారం ఆఫ్‌షోర్‌ సపోర్ట్‌ వెసల్‌ కోస్టల్‌ జాగ్వార్‌ టగ్‌లో మొత్తం 20 మందే ఉండాలి. ప్రమాదం తరువాత అక్కడికి చేరుకున్న కోస్ట్‌గార్డ్‌ అధికారులు టగ్‌లో మొత్తం 30 మంది ఉన్నట్లు తేల్చారు. వారిలో ఒకరు చనిపోగా.. మరొకరు గల్లంతైనట్టు నిర్ధరించారు. నౌకాశ్రయ అధికారుల నుంచి అనుమతి తీసుకున్నవారికంటే ఎక్కువ మంది అక్కడ ఎందుకు ఉన్నారన్నది పెద్ద మిస్టరీగా మారింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ 15 మందిని నగరంలోని మైక్యూర్‌ ఆసుపత్రిలో చేర్చారు. వారి పేర్లు, చిరునామాలను పోలీసులు సేకరించారు. మిగిలినవారి వివరాలు మాత్రం గోప్యంగానే ఉన్నాయి. చనిపోయిన ఆశిష్‌కుమార్‌, గల్లంతైన విక్కీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని కొమాకో సంస్థ పోలీసులకు సోమవారం రాత్రి వరకు ఇవ్వలేదు. ఈ సంస్థకు నిర్వహణ బాధ్యతలు అప్పగించిన హెచ్‌.పి.సి.ఎల్‌. సంస్థ వద్ద కూడా వారికి సంబంధించిన దస్త్రాలు లేకపోవడం గమనార్హం. టగ్‌లోని సిబ్బంది సంఖ్యలో తేడాలు రావడంతో పోర్టు అధికారులు హెచ్‌.పి.సి.ఎల్‌. అధికారులతో మాట్లాడినా.. వారు చేతులెత్తేశారు. ఈ విషయాన్ని నౌకాశ్రయ అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎస్‌.పి.ఎం. సౌకర్యం దేశభద్రతకు సంబంధించిన అంశం. అక్కడ ఎలాంటి సమస్య తలెత్తినా చమురు దిగుమతికి చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. అంతటి కీలకమైన ప్రాంతం వద్దకు అనుమతి లేకుండా సిబ్బందిని పంపాల్సిన అవసరం ఏమిటన్నది నౌకాశ్రయ అధికారుల ప్రశ్న.

టగ్‌లో ప్రమాదం సంభవించిన వెెంటనే ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. సమీపంలోనే ఉన్న ఎనిమిది మంది వెంటనే సముద్రంలోకి దూకేశారు. వారిలో ఆరుగురు ఈదుకుంటూ సురక్షిత ప్రాంతానికి రాగా, రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన ఆశిష్‌కుమార్‌ (26), ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూ ప్రాంతానికి చెందిన విక్కీచౌహాన్‌ (22) గల్లంతయ్యారు. ఆశిష్‌ మృతదేహం లభ్యం కాగా, విక్కీ ఆచూకీ తెలియలేదు.

టగ్‌లో 29 మంది ఉన్నట్టు తొలుత కొమాకో సంస్థ నిర్వాహకులు చెప్పారు. మరొకరి ఆచూకీ తెలియడం లేదని సోమవారం రాత్రి చెప్పడంతో అధికారులు విస్మయానికి గురయ్యారు. విధి నిర్వహణలో ఎంతమంది ఉన్నారో కూడా సరిగా తెలుసుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

క్షతగాత్రుల బంధువులు ఒక్కొక్కరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. గాయపడ్డవారిలో కొందరు మాట్లాడలేని స్థితిలో ఉన్నారు.

క్షతగాత్రులు ఒక్కొక్కరు ఒక్కోరకంగా సమాచారం చెప్పడం అధికారులను గందరగోళానికి గురిచేస్తోంది. సిబ్బంది బృందాలుగా ఒక్కో విభాగం వద్ద ఉండడంతో ఎవరికీ వాస్తవం ఏమిటన్నది స్పష్టంగా తెలియడం లేదని తెలుస్తోంది.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.