రాజుగారి గది 3 మూవీ రివ్యూ

నటీనటులు : అశ్విన్‌ బాబు, అవికా గోర్‌, అలీ, అజయ్‌ ఘోష్‌, ఊర్వశీ, బ్రాహ్మాజీ, గెటప్‌ శ్రీను, శివశంకర్‌ మాస్టార్‌, హరితేజ
సంగీతం : ష‌బీర్‌
దర్శకత్వం : ఓంకార్‌
నిర్మాణం : ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌
రేటింగ్: 2.5/5

కథ:
మాయ (అవికా గోర్‌) వృత్తిరీత్యా వైద్యురాలు. ఆమెని తాకాల‌ని ఎవ‌రు ప్రయ‌త్నించినా వాళ్లు మ‌ర‌ణం అంచుల‌దాకా వెళుతుంటారు. ఎవ‌రికీ క‌నిపించ‌ని ఒక ఆత్మ ఆమెకి క‌వ‌చంలా ఉంటూ కాప‌లా కాస్తుంటుంది. ఆటోడ్రైవ‌ర్ అయిన అశ్విన్ (అశ్విన్ బాబు) కాల‌నీలో ప్రశాంత‌త‌కి భంగం క‌లిగిస్తున్నాడ‌ని ఇరుగుపొరుగువాళ్లు అత‌న్ని మాయ ప్రేమ‌లో ప‌డేలా చేస్తారు. ఇద్దరూ ప్రేమ‌లో ప‌డితే మాయ వెన‌కాల ఉన్న ఆత్మ అశ్విన్‌ని చంపేస్తుంద‌నేది వాళ్ల ఆలోచ‌న. మ‌రి అశ్విన్ మాయ‌ని ప్రేమించాక ఏం జ‌రిగింది? ఇంత‌కీ మాయ వెన‌కాల ఉన్న ఆ ఆత్మ ఎవ‌రు? మాయ‌కే ఎందుకు కాపలా కాస్తోంది? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

పెర్ఫార్మన్స్:
రాజుగారి గదిలో హీరోగా చేస్తూ వస్తున్న అశ్విన్‌ బాబు.. ఈ సినిమాలోనూ తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. యాక్టింగ్‌ పరంగా, డ్యాన్స్ ప‌రంగా మ‌రింత ప‌రిణ‌తి సాధించారు. అలీ త‌న మార్క్ హావ‌భావాలు, సంభాష‌ణ‌ల‌తో న‌వ్వించారు. అజ‌య్‌ఘోష్‌, ఊర్వశి పాత్రలు ద్వితీయార్ధంలో క‌డుపుబ్బా న‌వ్విస్తాయి. అవికా గోర్‌కి పెద్దగా న‌టించే అవ‌కాశం రాలేదు. ధ‌న్‌రాజ్‌, ప్రభాస్ శ్రీను, బ్రహ్మాజీ, హ‌రితేజ, శివ‌శంక‌ర్ మాస్టర్ పాత్రల ప‌రిధి మేర‌కు న‌వ్వించారు.

ప్లస్ పాయింట్స్:
కామెడీ
బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌
కెమెరా వర్క్

మైనస్ పాయింట్స్:
బలహీనతలు
కథ, కథనాలు సాలీడ్‌గా లేకపోవడం
హార్రర్‌ పెద్దగా లేకపోవడం
ఫస్టాఫ్‌లో సాగదీత ఫీలింగ్‌

విశ్లేషణ:
హర్రర్‌ కామెడీ సినిమాలకు బలమైన కథ, కథనాలు ముఖ్యం. దర్శకుడిగా ఓంకార్‌.. ఈ హర్రర్‌ కామెడీ సినిమాకు ఒకింత డిఫరెంట్‌ పాయింట్‌నే ఎంచుకున్నారు. అమ్మాయి వెంటపడే వ్యక్తులనే యక్షిని రఫ్‌ ఆడటమనే కాన్సెప్ట్‌ బాగానే ఉన్నా.. సెకండాఫ్‌లో రాజుగారి గదిలోకి పాత్రలు ఎంటరైన తర్వాత పూర్తిగా కామెడీ మీద ఫోకస్‌ చేయడం కొంత ప్రేక్షకులకు నిరాశకు గురిచేయవచ్చు. అంతగా భయపెట్టి థ్రిల్‌ చేసే అంశాలు సినిమాలో లేకపోవడం మైనస్‌గా చెప్పవచ్చు. సెకండాఫ్‌లో దెయ్యాలన్నీ వచ్చి కామెడీ పండించడం తప్ప పెద్దగా ప్రేక్షకుడిని ఉత్కంఠకు గురిచేయవు. యక్షిని నేపథ్యాన్ని కార్టూన్‌రూపంలో చెప్పడం కన్విన్సింగ్గానే ఉన్నా.. ఇంకాస్త మెరుగ్గా చెబితే ప్రేక్షకుల్లో నాటుకుపోయేది. దర్శకుడిగా ఓంకార్‌ టేకింగ్‌ బాగుంది. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రఫి.. ష‌బీర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాను బాగా ఎలివేట్‌ చేశాయి. ఎప్పటిలాగే బుర్ర సాయిమాధవ్‌ డైలాగులు హాస్యాన్ని పండిస్తూ.. అదనపు బలాన్ని చేకూర్చాయి. ష‌బీర్‌ పాటలు అంతగా గుర్తుండిపోవు కానీ పాటల టేకింగ్‌ బావుంది. మొత్తానికి ఈ హర్రర్‌ కామెడీలో హర్రర్‌ అంతలేకపోయినా కామెడీ ప్రేక్షకులను మెప్పించవచ్చు.

 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.