పోలీసుల ఎదుట లొంగిపోయిన జనసేన ఎమ్మెల్యే

తూర్పుగోదావరి జిల్లా మలికిపురం పోలీస్‌స్టేషన్‌పై తన అనుచరుల దాడి కేసులో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ ఉత్కంఠ మధ్య పోలీసులకు లొంగిపోయారు. కొద్ది సేపటి క్రితం ఆయన రాజోలు స్టేషన్‌కు వచ్చి స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోయారు. మలికిపురంలో పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని ఆదివారం రాత్రి ఎస్సై రామారావు ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని వదిలిపెట్టాలని ఎమ్మెల్యే స్టేషన్‌కు వచ్చి పోలీసులతో మాట్లాడారు. వారిలో మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి కూడా ఉన్నారని.. ఆయనను అయినా వదిలిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సై పట్టించుకోలేదు. దీంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి బయటకు వెళ్లిపోగా.. జనసేన కార్యకర్తలు, అనుచరులు మాత్రం స్టేషన్‌ వద్దే ఉండిపోయారు.

ఈ క్రమంలో ఎస్సై రామారావు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్యే రాపాకకు సమాచారం అందడంతో మళ్లీ ఆయన స్టేషన్‌ వద్దకు వచ్చి జనసేన కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగారు. దీంతో పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆయనకు నచ్చజెప్పి పంపించేశారు. ఈ నేపథ్యంలో పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశారంటూ ఎమ్మెల్యేతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేను అరెస్టు చేసేందుకు పోలీసులు సోమవారం చింతలమోరిలోని రాపాక ఇంటికి వెళ్లారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో వెనుదిరిగారు. ఈ మధ్యాహ్నంలోపు ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. తన అరెస్టు తథ్యమని తెలియడంతో చివరకు ఎమ్మెల్యే రాజోలు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయారు. దీంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. కాసేపట్లో ఎమ్మెల్యేను కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసులో మరికొందరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.