పింఛన్ల వయోపరిమితి 57కు కుదింపు సరికాదు

పింఛన్ల వయోపరిమితి ని ఇప్పుడున్న 65 సంవత్సరాలనుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించటం ఏ విధంగా చూసినా హేతుబద్ధంగా లేదు. వృధాప్య పింఛన్లు అనేది ప్రజలు స్వంతంగా పనిచేసుకోలేక విశ్రాంతి తీసుకునే అవసరం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం అటువంటివారికి ఆర్ధిక సహాయంగా ఇచ్చేది . మరి ఇప్పుడు దీన్ని 65 నుంచి 57 తగ్గించటంలో ఆ కారణంతో చేశారని అనుకోవాలా? నాకు తెలిసి ప్రపంచం లో ఎక్కడా 57 సంవత్సరాలకు వృధాప్యం వచ్చినట్లుగా పరిగణిస్తున్నారని అనుకోను. మరి తెలంగాణ ప్రభుత్వ ఈచర్యను ఏ కోణంలో చూడాల్సి వుంది? ఇది కేవలం ఓట్లకోసం తీసుకున్న ప్రజాకర్షక చర్యగానే పరిగణించాల్సివుంది.

స్వతంత్రం వచ్చినకొత్తల్లో భారత ప్రజల సగటు జీవన వయస్సు 40 సంవత్సరాలు లోపే వుంది. అదే ఇప్పుడు 60 సంవత్సరాల పైబడి వుంది. అంటే భారత సగటు జీవన వయస్సు కన్నా తెలంగాణాలో ప్రజలు వృధాప్యం బారిన పడుతున్నారు. ఇది వాస్తవానికి భిన్నంగా వుంది. మొన్ననే లోక్ సభలో ప్రవేశపెట్టిన ఆర్ధిక సర్వే ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 60 నుంచి 62 కి పెంచి క్రమేణా దాన్ని పెంచుకుంటూ పోవాలని సిఫారసు చేసింది. దానికి సహేతుకమైన కారణాలు చెప్పింది. గణాంకాలతో సహా జీవనప్రమాణాలు ఏవిధంగా పురోగమించినవో చెప్పింది. కాబట్టి 57 సంవత్సరాల వృధాప్య లాజిక్ ఏ హేతువు కు అందటంలేదు. కెసిఆర్ గారు ఏ ప్రమాణాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారో చెప్పాలి. 65 సంవత్సరాలు ఎక్కువగాఉందనుకుంటే ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు తో అనుసంధానం చేసి 60 సంవత్సరాలకు తగ్గించటం కొంతమేర సబబుగా ఉంటుంది. కానీ అంతకన్నా మూడు సంవత్సరాలు తగ్గించటం ప్రభుత్వ ధనాన్ని ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకోవటమే.

వాస్తవానికి సగటు జీవనప్రమాణం పెరిగిన నేపథ్యంలో రిటైర్మెంట్ వయస్సు కనీసం 62 కి పెంచి, అదే రీతిలో సీనియర్ పౌరులకిచ్చే రాయితీలకు కూడా 62 సంవత్సరాలు పెంచాల్సివుంది. దానివలన ప్రభుత్వ ఖజానా కు కొంత మేలు జరుగుతుంది. రాజకీయనాయకులు వాళ్ళ స్వంతడబ్బులు కానంతవరకూ చాలా ఉదారంగా వుంటారు. ప్రజలడబ్బులకు వాళ్లు ట్రస్టీలు మాత్రమేనని మరచిపోవద్దు. ప్రభుత్వప్రాధామ్యాలు ఇంకా పేదరికందిగువనున్న ప్రజలను దానినుంచి ఎలా బయటకు తీసుకురావాలనే దానిపై వుండాలికానీ ప్రజలడబ్బులను వృధాచేయకూడదు. ఇప్పటికైనా విజ్ఞత తో ఆలోచించి వృధాప్య పింఛన్ల వయోపరిమితి ని ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సుకు అనుసంధానంచేసి 60 సంవత్సరాలకు పెంచుతారని ఆశిద్దాం.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.