పెరుగుట విరుగుట కొరకే

రాజకీయపార్టీల విన్యాసాలు ఒక్కోసారి వాళ్ళకే ఎదురుదెబ్బ తీస్తుంటాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు 20 మందికి పైగా వైస్సార్సీపీ ఎమ్యెల్యే లను తెలుగుదేశంలోకి చేర్చుకున్నాడు. అది చివరకి తనకే బెడిసికొట్టింది. అలాగే కెసిఆర్ గత ప్రభుత్వం లో కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యే లను తెరాస లో చేర్చుకున్నాడు. అయితే ఎన్నికల్లో దాని ప్రభావం పడకుండా తెలంగాణ సెంటిమెంట్ రగిలించి తిరిగి అధికారం లోకి రాగలిగాడు. కానీ వచ్చినతర్వాత కష్టాలు మొదలయ్యాయి. ఉద్యమకాలం నుంచీ ఉన్నవాళ్లకు, కొత్తగా చేరిన వాళ్లకు వాళ్ళ నియోజకవర్గాల్లో పడటం లేదు. ఇంతమంది కోరికలు తీర్చటం అంత తేలికైన పనికాదు.

ఇటీవలే ఈటెల రాజేందర్ మాట్లాడుతూ మేము పార్టీకి అసలైన ఓనర్లమని చెప్పాడు. అది పెద్ద సంచలనమయ్యింది. అలాగే కొత్త మంత్రుల చేరిక తర్వాత అసంతృప్తి స్వరం పెరిగింది. ఎలా సంతృప్తి పరచాలో అర్ధంకావటంలేదు. సందట్లో సడేమియా అన్నట్లు ఈ అవకాశాన్ని బీజేపీ కలిసివచ్చిన అదృష్టంగా అనుకుంటుంది. అసంతృప్తి గణమంతా ఒక్కొక్కరుగా బీజేపీ గొడుగు కిందకు చేరుతున్నారు. ఇది కెసిఆర్ కి ఆందోళన కలిగిస్తుంది. బీజేపీ యంత్రాంగాన్ని తేలికగా తీసిపారేయలేమని లోలోపల ఆందోళన చెందుతున్నాడు. అందుకే హరీష్ రావు విషయం లో తిరిగి రాజీ ధోరణి అవలంబించాడని అందరూ అనుకుంటున్నారు.

ఇది బీజేపీ కి కూడా వర్తిస్తుంది. వచ్చే వాళ్ళు ఎటువంటివాళ్ళు, వాళ్ళమీద ప్రజలకున్న అభిప్రాయాలేంటి అనే ఆలోచనకూడా లేకుండా గేట్లు బారా తెరిచారు. ఇది చివరకు తెరాస పరిస్థితే ఎదురవుతుంది. తీసుకునే వాళ్ళ చరిత్ర తో పనిలేదనుకుంటే ప్రజల ను తక్కువగా అంచనా వేసినట్లే. ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు. వాళ్ళను అమాయకులుగా అనుకొని ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే తగిన బుద్ధిచెబుతారు. ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు పసుపుకుంకుమ పేరుతో చివరి క్షణంలో మహిళా ఖాతా ల్లో డబ్బులు జమ చేసినా వాళ్ళు చంద్రబాబు నాయుడు ని ఓడించారు. ఇప్పటికే సుజనా చౌదరి , సీఎం రమేష్ లాంటి వాళ్ళను చేర్చుకోవటంపై ప్రజల్లో అసంతృప్తి వుంది. తెలంగాణాలో ఇప్పటివరకూ అటువంటి అసంతృప్తి రాకపోయినా చేర్చుకునే వాళ్ళ విషయం లో ఆచి తూచి వ్యవహరించకపోతే ఇక్కడకూడా అటువంటి అసంతృప్తి వచ్చే అవకాశముంది. టీడీపీ అయినా , తెరాస అయినా , బీజేపీ అయినా ప్రజల్ని తక్కువగా అంచనావేస్తే మొదటికే మోసమొస్తుందని గ్రహిస్తే మంచిది.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.