పెద్దపల్లి స్పూర్తితో నూతన భారతాన్నినిర్మిద్దాం

పెద్దపల్లి . ఓ మూలన వున్న వెనకబడిన జిల్లా. ఇటీవల జిల్లా అవ్వకముందు కరీంనగర్ జిల్లాలో ఓ మండలం. అటువంటి పెద్దపల్లి ఇప్పుడు దేశవ్యాప్తంగా మోగిపోతున్న పేరు. మొత్తం దేశంలోని అన్ని జిల్లాల్లో అతి శుభ్రమైన జిల్లాగా ఈ సంవత్సరం గ్రామీణ స్వచ్ఛ సర్వే లో నిలిచింది. దేశంలో ఎన్నో అభివృద్ధి జిల్లాలు ఉండగా వెనకబడిన పెద్దపల్లి దేశంలో నంబర్ వన్ గా ఎలా ముందుకొచ్చింది? ముందుగా మన తెలుగు రాష్ట్రంలోని జిల్లా ఎన్నిక కావటం సంతోషం. రెండు , ఎన్నో అభివృద్ధి చెందిన ప్రదేశాలను అధిగమించి వెనకబడిన పెద్దపల్లి ఎన్నిక కావటం అత్యంత సంతోషం. అసలు వెనకబడటం అనే టాగ్ కరెక్టా? వెనకబడటం, ముందుండటం అనే నిర్వచనం మార్చుకోవాల్సి వుంది. ప్రజల చైతన్యం ఈ నిర్వచనాన్ని మార్చేసింది. పెద్దపల్లి జిల్లాలోని కొన్ని గ్రామాలు ఇప్పుడు దేశానికే ఆదర్శం.

ఉదాహరణకు స్త్రీలు పీరియడ్స్ టైం లో ఉపయోగించే సానిటరీ పాడ్స్ వాళ్ళే తయారు చేసుకుంటున్నారు. స్ఫూర్తి స్త్రీ అభివృద్ధి సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాలో పెద్దపల్లి దగ్గరలోని శాంతినగర్ లో 'సబల పాడ్స్ ' తయారు చేసుకుంటున్నారు. 90 శాతానికి పైగా స్త్రీలు వాటిని వాడుతున్నారు. అవి పూర్తిగా ఆరోగ్యకరమైనవి. యునెస్కో తరఫున ఇటీవల సర్వే కూడా చేశారు. అలాగే పెద్దపల్లి జిల్లాలో ఈ సంవత్సరం డెంగ్యూ , చికెన్ గున్యా కేసులు గణనీయంగా తగ్గాయి. కారణం , ఊపిరి బిగించి వినండి. బహిరంగ మురుగు కాల్వలు లేని జిల్లాగా పెద్దపల్లి రికార్డు సృష్టించింది. ఇది ఓ మారుమూల ప్రాంతపు జిల్లాలో జరిగింది. ఎన్నో ' అబివృద్ధి ' జిల్లాలుగా ముద్ర వేసుకున్న జిల్లాలు చేయలేనిపని ఈ పెద్దపల్లి చేసిందని చెప్పటానికి గర్వంగా వుంది. మొత్తం జిల్లాలో ఒక లక్ష ఇంకుడు గుంతలు కట్టాలని టార్గెట్ గా పెట్టుకొని ఇప్పటికి 66 వేలు పూర్తిచేశారు. అన్ని గ్రామాల్లో ఒక్కోటి 1. 5 లక్షల రూపాయల ఖర్చుతో కమ్యూనిటీ టాయిలెట్లు కట్టించారు. మొత్తం 263 గ్రామాల్లో చెత్త డంప్ యార్డులు కట్టించారు. సగానికి పైగా గ్రామాల్లో ఇప్పటికే అధునాతన స్మశానవాటికలు కట్టించారు. 60 కిలోమీటర్లు రోడ్డుకి ఇరువైపులా చెట్లు క్రమపద్ధతిలో పెంచారు. విశేషమేమంటే 400 ఎకరాల్లో 230 వానర తోటలు కట్టారు. ఈ జిల్లాలో కోతుల బెడద ఎక్కువగా ఉన్నందున గ్రామం కు దూరంగా రకరకాల పండ్లతోటలు, చెట్లు, నీటికుంటలు కట్టించారు. ఇవి ప్రత్యేకంగా కోతులకోసం నిర్మించారు. కోతులు ఈ తోటలవలన వూళ్ళలోకి రావని చెబుతున్నారు. ఒకటేమిటి ఇలా ఎన్నో పనులు చేసుకొని మానవుడు ప్రయత్నిస్తే సాధించలేనిదేమీలేదని నిరూపించారు. ఇంతకన్నా ఏం కావాలి?

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేన ఎంతో శ్రద్ధతో దగ్గరుండి ప్రజలను నడిపించారు. నాయకుడు సమర్ధుడు, నిబద్ధతగలవాడు అయితే చేయలేనిదేమీ లేదని జిల్లా నాయకురాలైన దేవసేన నిరూపించింది. ప్రజల్ని భాగస్వామ్యం చేసింది. వాళ్లలో చైతన్యం తీసుకొచ్చింది. అధికారులు, ప్రజాప్రతినిధులు , ప్రజలు కలిసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఇది ఓ స్ఫూర్తి స్టోరీ . దేశం యావత్తూ పెద్దపల్లి ప్రయోగాన్ని ఆదర్శంగా తీసుకుంటే వచ్చే అయిదు సంవత్సరాల్లో సమాజమే మారిపోతుంది. ఎన్నో జబ్బులు దూరమవుతాయి. పేదప్రజలు అందరికన్నా లబ్దిదారులవుతారు. పరిశుభ్రత అదేదో కడుపునిండిన వాళ్ళు ప్రచారంచేసే పనిగా కొంతమంది అక్కడక్కడా మాట్లాడుతుంటారు. ఎందుకంటే వాళ్ళు గత 70 సంవత్సరాల్లో ఎక్కువకాలం పరిపాలనలో వుండి చేయలేనిపని గత అయిదు సంవత్సరాల్లో ఎందుకు ప్రజల కార్యక్రమంగా మారిందో జవాబు చెప్పాల్సిన అవసరంవుంది కాబట్టి. మోడీ ఎర్రకోట నుండి మొదలుపెట్టిన పని దేశం మొత్తాన్ని కదిలించింది. గత అయిదు సంవత్సరాల్లో ప్రజల్లో ఎంతో చైతన్యం వచ్చింది. అందులో భాగమే ఇటువంటి స్ఫూర్తి కార్యక్రమాలు. అయితే ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాల పూర్తి సహకారం అవసరం. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో ముందుందని చెప్పాలి. గత నెల రోజుల్నుంచి చేపట్టిన గ్రామాల్లో స్వచ్ఛత కార్యక్రమం అభినందించదగ్గది. దయచేసి దీన్ని రాజకీయకోణంలో చూడకండి. వస్తున్న వార్తల్ని బట్టి ఈ కార్యక్రమం అనేక గ్రామాల్లో ఎంతో ప్రభావితం చేసిందని తెలుస్తుంది. నెలరోజులు గ్రామాల్లో పేరుకుపోయిన ఎన్నో సమస్యలు ఈ కార్యక్రమంలో పరిష్కరించబడినవని తెలుస్తుంది. అంటే రోడ్ల పక్కన చెత్త చెదారం, ప్రభుత్వ కార్యాలయాల్లో , పబ్లిక్ స్థలాల్లో ఇంకా అనేక చోట్ల శుభ్రం చేయటం ఇందులో భాగం. ఇంకా చెట్లు నాటటం, వాటి సంరక్షణ చర్యలు, కరెంటు స్థంబాలు సరిచేయటం, వ్యర్ధపదార్ధాల యార్డులు, పనికిరాని చెట్ల తొలగింపు లాంటి అనేక పనులు ఇందులో వున్నాయి. ఇవి అభినందించదగ్గ కార్యక్రమం.

మొత్తం మీద చూస్తే దేశం సరైన ప్రాధాన్యాలతో ముందుకెళ్తుందనిపిస్తుంది. ఇప్పుడు ప్లాస్టిక్ రహిత దేశంగా తయారు అయ్యే అవకాశం కనబడుతుంది. మోడీ ఈ సారి దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టటం జరిగింది. ఇటీవల జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో కూడా మోడీ ఈ విషయం ప్రస్తావించాడు. గత అయిదు సంవత్సరాలు స్వచ్ఛభారత్ మిషన్ లో భాగంగా 11 కోట్ల టాయిలెట్లు నిర్మించి చరిత్ర సృష్టించటం జరిగింది. ఈ అయిదు సంవత్సరాల్లో వాడిపారేసే ప్లాస్టిక్కుపై విజయం సాధిస్తాడని ఆశిద్దాం. పెద్దపల్లి జిల్లా అనుభవాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం లోకి తీసుకురావాలి. ఇటువంటి సక్సెస్ స్టోరీలే మిగతావారికి స్ఫూర్తినిస్తాయి. ఇంత గొప్ప స్వచ్ఛతా కార్యక్రమాన్ని దేశం గర్వపడేవిధంగా నిర్వహించినందుకు పెద్దపల్లి అధికారయంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు, జిల్లా ప్రజానీకానికి శిరస్సువంచి నమస్కరిస్తున్నాము. రాజకీయాలకు అతీతంగా మిగతా జిల్లాల ప్రజలు, నాయకులు పెద్దపల్లికి వెళ్లి అక్కడ గ్రామాలు ఎలా ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించినాయో పరిశీలించి తమ తమ జిల్లాల్లో అమలుచేస్తే మొత్తం దేశం స్వచ్ఛదేశంగా మారటం ఖాయం. ప్రజలు తలుచుకుంటే చేయలేని పనంటూ ఏదీ లేదు. కదలండి , దేశం మొత్తం పెద్దపల్లిగా మార్చండి. నూతన భారతాన్ని నిర్మించండి.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.