సింగరేణి కార్మికులకు దసరా కానుక లక్ష రూపాయలు..!

సింగరేణి కార్మికులకు దసరా కానుకను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రతి కార్మికుడికి రూ.1,00,899 బోనస్‌గా అందించనున్నట్లు వెల్లడించారు. గురువారం అసెంబ్లీలో సింగరేణి కార్మికులకు బోనస్‌పై సీఎం ప్రకటనచేశారు.

సమైక్య పాలనలోని చివరి సంవత్సరమైన 2013-14లో కార్మికులు ఒక్కొక్కరికి రూ. 13,540 చొప్పున మాత్రమే బోనస్ చెల్లించారని, గడిచిన ఐదేండ్లలో తెలంగాణ ప్రభుత్వం ఈ బోనస్‌ను పెంచుతూ వస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. 2017-18లో లాభాల్లో 27% వాటాగా.. ఒక్కో కార్మికుడికి రూ.60,369 చొప్పున చెల్లించిందని చెప్పారు. ఈసారి లాభాల్లో వాటాను మరో శాతం పెంచుతున్నట్టు సీఎం కేసీఆర్ సంతోషంగా ప్రకటించారు. సింగరేణి లాభాల్లో వాటా పెంచడం వల్ల ప్రతి కార్మికుడికి రూ.1,00,899 చొప్పున బోనస్ అందుతుందన్నారు.

నిరుటికంటే రూ.40,530 అదనంగా ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. ఇది దసరా పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అందిస్తున్న కానుక అని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని స్ఫూర్తిగా తీసుకొని కార్మికులు, సిబ్బంది మరింత అంకితభావంతో పనిచేసి సింగరేణి సంస్థకు మరిన్ని లాభాలు, విజయాలను సాధించిపెట్టాలని సీఎం పిలుపునిచ్చారు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.