ఓ బేబీ మూవీ రివ్యూ

తారాగణం : సమంత, లక్ష్మీ, నాగశౌర్య, రాజేంద్ర ప్రసాద్‌, రావూ రమేష్‌, తేజ
సంగీతం : మిక్కీ జే మేయర్‌
దర్శకత్వం : నందినీ రెడ్డి
నిర్మాత : సురేష్ బాబు, సునితా తాటి, టీజీ విశ్వప్రసాద్‌, హ్యూన్వూ థామస్ కిమ్
రేటింగ్: 3/5

కథ :
సావిత్రి అలియాస్ బేబి (లక్ష్మీ) 70 ఏళ్ల వృద్ధురాలు. కొడుకు (రావూ రమేష్)తో కలిసి ఉండే సావిత్రి తన అతి ప్రేమ, చాదస్తంతో అందరినీ ఇబ్బంది పెడుతుంటుంది. ఒక దశలో తన మాటలు, చేతల వల్ల కోడలు ఆరోగ్యం పాడవుతుంది. దీంతో మనస్తాపం చెందిన సావిత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. అంతేకాదు తన యవ్వనం తిరిగి వస్తే బాగుండు అని కోరుకుంటుంది. వెంటనే దేవుడు ఆమెకు యవ్వనాన్ని తిరిగి ఇచ్చేస్తాడు. అలా తిరిగి పడుచు పిల్లగా మారిన బేబీకి (సమంత)కి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఆమె ప్రయాణం ఎలా సాగింది? చివరకు బేబీ తన అసలు వయస్సుకు వచ్చిందా.. లేదా..?అన్నదే మిగతా కథ.

పర్ఫామెన్స్‌:
ఇది పూర్తిగా సమంత సినిమా. తన బాడీ లాంగ్వేజ్‌కు, ఎనర్జీకి తగ్గ పాత్రలో సమంత జీవించారనే చెప్పాలి. బేబి పాత్రలో మరో నటిని ఊహించుకోలేనంతగా సమంత మెప్పించారు. కామెడీ సీన్స్‌తో పాటు ఎమోషనల్‌ సీన్స్‌లోనూ సమంత అద్భుతమైన పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నారు. సినిమా బాధ్యత అంతా తన భుజాల మీదే మోసిన సమంత వందశాతం సక్సెస్‌ అయ్యారు. కీలక పాత్రలో సీనియర్‌ నటి లక్ష్మీ కూడా జీవించారు. సీనియర్‌ నటులు రాజేంద్ర ప్రసాద్‌, రావూ రమేష్‌లు తమకు అలవాటైన పాత్రల్లో అలవోకగా నటించారు. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్, సమంత కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక క్లైమాక్స్‌లో సమంత, రావు రమేష్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు గుండె బరువెక్కిస్తాయి. నాగశౌర్యకు పెద్దగా నటనకు అవకాశం లేకపోయినా ఉన్నంతలో తనవంతుగా మెప్పించాడు. బాలనటుడుగా సుపరిచితుడైన తేజ ఈ సినిమాతో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు మంచి నటనతో ఆకట్టుకున్నాడు. అతిథి పాత్రల్లో జగపతి బాబు, అడవి శేష్‌లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

ప్లస్‌ పాయింట్స్‌ :
సమంత న‌ట‌న
ఫస్ట్‌ హాఫ్‌ కామెడీ
ఎమోషనల్‌ సీన్స్‌
పాత్రల‌కి త‌గ్గ న‌టీన‌టులు

మైనస్‌ పాయింట్స్‌ :
ద్వితీయార్ధం సుదీర్ఘంగా సాగ‌డం
సంగీతం

విశ్లేషణ :

కథకు తగ్గట్లు మంచి ఫీల్ తో సంగీతం అందించే మిక్కీ జే మేయర్ ‘ఓ బేబీ’లో నిరాశ పరిచాడు. పాటలు అతడి స్థాయికి తగ్గట్లు లేవు. మ్యూజిక్ చుట్టూ తిరిగే కథలో అతడిచ్చిన పాటలు తీవ్ర నిరాశకు గురి చేస్తాయి. ‘చాంగుభళా’ను మినహాయిస్తే పాటలు సాధారణంగా అనిపిస్తాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా మామూలే. రిచర్డ్ ప్రసాద్ ఛాయాగ్రహణం బాగుంది. సినిమా థీమ్ కు తగ్గ విజువల్స్ తో అతను ఆకట్టుకున్నాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. లక్ష్మీభూపాల్ డైలాగులు సినిమాకు ప్లస్. నా వయసు 45 మాత్రమే అంటే.. ‘మోకాలి వరకు చెబితే సరిపోతుందా.. మిగతాది’ అంటుంది హీరోయిన్ పాత్ర. ఇలాంటి చమక్కులు కొన్ని భలే మెరిశాయి. సెంటిమెంట్ సీన్లలో కూడా డైలాగులు బాగున్నాయి. ఇక దర్శకురాలు నందిని రెడ్డి ఎప్పట్లాగే కామెడీని డీల్ చేయడంలో తన పట్టు చూపించింది. చాలా వరకు సినిమాను ఆహ్లాదకరంగా నడిపించింది. ఎమోషన్లు పండించడంలో మాత్రం తడబడింది. ఓవరాల్గా ఆమె పనితీరు ఓకే.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.