మనదేశంలో పండగలే పండగలు

పండగల సీజన్ వినాయక చవితితో మొదలయ్యింది శ్రీరామనవమి వరకు కొనసాగుతుంది. ఈ సీజన్లో ప్రజలు పనికన్నా పండగలపేరుతో కాలక్షేపానికే ఎక్కువ సమయం కేటాయిస్తారు. మిగతాదేశాల్లో లాగ పండగంటే ఒకరోజో , రెండు రోజులో కాదు ఏకంగా వారం రోజులు, పదిహేనురోజులు కూడా చేసుకుంటారు. ఇన్నిరోజులు ప్రజలకి టైం ఎలా దొరుకుతుందనేదే ప్రశ్న. ప్రతి కాలనీలో, అపార్టుమెంటుల్లో , ఊళ్లలో అయితే ప్రతి బజారులో ఒక కమిటీ ఏర్పడి కార్యక్రమాల్ని నడుపుతారు. ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు భారతదేశంలో ఇన్ని పండగలను ఎలా నిర్వహిస్తున్నారో చూసి నేర్చుకోవాలి. ఆ మధ్య దీనిపై ఒక సినిమాలో కూడా ఇదే చూపించారు. ఎందుకు చెప్పాల్సివస్తుందంటే ఇన్ని రోజులు సమయాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల పేరిట వినోదానికి కేటాయిస్తున్న దేశం ప్రపంచంలో ఇంకెక్కడా లేదు.

ఇది దేశానికి మంచిదా కాదా అంటే చెప్పలేము. ముందుగా దీనిలోని సానుకూల అంశాలు చూద్దాం. ప్రజలు అందరూ కలిసి మెలిసి సామూహిక కార్యక్రమాలు చేయటం సమిష్టితత్వాన్ని పెంపొందిస్తుంది. ఈ కార్యక్రమాల్లో తలా ఒక పని చేయటం, ఆప్యాయంగా పలకరించుకోవటం , బంధువులు, స్నేహితులు ఇంటికి రావటం , ఊళ్లలోనయితే ఈ పండుగల సందర్భంగా అందరూ పట్టణాలనుంచి వచ్చి కొద్ది రోజులు సరదాగా గడపటం,అంతరించిపోతున్న కళలకు ప్రాణంపోసి ఈ పండగల సందర్భంగా ప్రదర్శించటం ఇవన్నీ సానుకూల అంశాలే. అన్నింటికన్నా ముఖ్యమైనది ఆ కొద్దిరోజులూ ఆనందంగా గడపటం. ఇప్పుడు ప్రభుత్వాలు చెప్పే ' హ్యాపీనెస్ ఇండెక్స్ ' ఈ పండగల వాతావరణంలో ఉఛ్చ దశకు వెళుతుంది. ముఖ్యంగా పేద ప్రజలు ఖర్చులేకుండా వినోదాన్ని పొందగలుగుతారు. ఇంతవరకు ఈ పండగల వాతావరణం సమాజానికి, వ్యక్తులకి చాలా మంచి చేస్తుందనే చెప్పాలి.

అదేసమయంలో కొన్ని ప్రతికూల అంశాలు కూడా చూద్దాం. సమాజం ఆర్ధిక ప్రగతి సాధించాలి అంటే ఉత్పత్తి వృద్ధి చేయాలి. ఆ కోణంలో చూస్తే ఈ వాతావరణం ప్రతికూల అంశమేనని చెప్పాలి. ఉదాహరణకు మన తెలుగు సమాజాన్నే తీసుకుందాం. ఒకనాడు అతితక్కువ పండగలకే ఎక్కువ సమయం కేటాయించేవాళ్లు . ముఖ్యంగా దసరా పండగే అతి పెద్ద పండగగా జరుపుకునే వాళ్ళు. మిగతావి ప్రాంతాలను బట్టి ప్రాధాన్యాలు ఉండేవి. ఇప్పుడు వినాయక చవితి వారం రోజులకి పైగానే జరుపుతున్నారు. దసరా ఒకనాడు కేవలం మూడురోజులే ప్రధానంగా జరుపుకునే వాళ్ళు. నవరాత్రులు వున్నా అందరు ప్రజలూ పూర్తిగా పండగజరుపుకునేవాళ్ళు కాదు. అలాగే శ్రీరామనవమి ఆంధ్రాలో కనీసం వారం రోజులు పందిళ్లు వేసి జరుపుతారు. తెలంగాణాలో బతకమ్మ పండుగ తొమ్మిది రోజులు ఘనంగా జరుపుకోవటం ఇటీవల ప్రాచుర్యం పొందింది. ఇలా చెప్పుకుంటూపోతే ఫులుస్టాప్ కనబడటంలేదు. శివరాత్రి జాగారం, కార్తీక సోమవారం, శ్రావణ శుక్రవారం ఇలా ఒకటేమిటి దీనికి మన ఓపిక . ఒకనాడు ఇన్నిరోజులు జరుపుకునే వెసులుబాటు ప్రజలకు ఉండేది. మరి ఇప్పుడో. ఆధునిక సమాజంలో ఈ ఉత్సవాలను పెంచుకుంటూపోతే ఆ మేరకు ఉత్పత్తికి ఆటంకం కలుగుతుందనే స్పృహ వున్నట్లులేదు.

దీనికి తోడు ఉద్యోగస్తులకైతే ఏ దేశంలో లేనన్ని సెలవులు ఈ దేశంలో వున్నాయి. అన్ని మతాల పండగలకి అందరికీ సెలవులిస్తాం. మనది సెక్యులర్,ఉదారవాద సమాజమని గొప్పగా చెప్పుకోవాలికదా మరి. అదీ కొన్నిరాష్ట్రల్లోనయితే మరీ ఉదారంగా ఏకంగా సంవత్సరానికి 30కి పైగా సెలవులిస్తారు. ఇదికాక మళ్ళా క్యాజ్యువల్ సెలవులు, ప్రివిలేజ్ సెలవులు, సిక్ సెలవులు యధాతధం. ఈరోజుకి అర్ధంకాని విషయం రంజాన్ కి , క్రిస్మస్ కి హిందువులకి ; రామనవమికి , మిగతా హిందూ పండగలకి ఇతర మతస్తులకు ఎందుకు సెలవిస్తారో అర్ధంకాదు. అదేదో ఒక్కో మతంలోవున్న అతిపెద్ద పండగకి కాదు అన్ని మతస్థులకు అన్ని పండగలకి సెలవులిస్తారు. ఇందులో లాజిక్ ఏంటో ఇప్పటికీ అర్ధంకాదు. ఈ టాపిక్ మాట్లాడితే ఉదోగస్తుల దృష్టిలో ఉద్యోగవ్యతిరేకిగా ముద్రపడతాం అని ఎవ్వరూ మాట్లాడారు. ఉత్పత్తి పెరగలేదని ప్రభుత్వాన్ని విమర్శించే మనం మన వైపునుంచి ఉత్పత్తి పెంచటానికి ఏమీ చేయలేమా? ఆర్ధిక విధానాలు , ప్రభుత్వ విధానాలు కొంచెంసేపు పక్కనపెడదాం. ఇన్ని సెలవులు ఉంటే ఉత్పత్తికి ప్రతిబంధకం కాదా? సంవత్సరానికి ఇన్ని సెలవులని నిర్ణయించుకొని ఆ సెలవులను ఎవరికివారు వాళ్ళ మత పండగలకు వాడుకోవచ్చుకదా. అంతకుమించి సెలవు కావాలంటే తమ వ్యక్తిగత సెలవులనుంచి మినహాయించేటట్లు చేయొచ్చు. ఇన్ని సెలవులు బదులు వారానికి ఐదురోజులు పనిదినాలు పెడితే అటు ప్రభుత్వానికి , ఇటు ఉద్యోగస్తులకు మేలు జరుగుతుంది. కాబట్టి సెలవుల్లో సంస్కరణలు రావాల్సివుంది. వారంలో ఐదురోజులు అన్ని కార్యాలయాలు,పరిశ్రమలు, షాపులు తెరచివుంచే పద్ధతుల్లో సెలవుల సంస్కరణలు తీసుకురావాలి.

చివరిగా చెప్పొచ్చేదేంటంటే పండగలు జరుపుకోవటం సమాజంలో సానుకూల పరిణామం. సమిష్టితత్వాన్ని, సంతోషాన్ని పంచిపెడుతుంది. అదేసమయంలో ఆధునిక సమాజంలో ఉత్పత్తి కోణం నుంచికూడా దృష్టిసారించి వ్యవస్థీకరించాల్సిన అవసరం వుంది. ప్రజల ఉత్సాహాన్ని పెంపొందిస్తూనే ఉత్పత్తి కి అవరోధాల్ని తొలగించాల్సిన అవసరం ఎంతయినాఉంది. దీనిపై ప్రజల్లో అవగాహన , చైతన్యం కలిగించి అందుకు అనుకూలంగా సంస్కరణలు చేపడితే దేశ ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది.

 
 

2 Comments

Write a comment ...
Post comment
Cancel
 1. 7 Oct, 9:22 am
  Bhaskar
  Reply

  Good analysis. People mind set should change in our country.

  Post comment
  Cancel
 2. 9 Oct, 5:36 am
  B N Raju:. Well said
  Reply

  Well said

  Post comment
  Cancel