మళ్ళీ మొదలైన ‘మా’ లో గొడవలు

తెలుగు సినీ నటీనటుల సంఘటిత, సంక్షేమ, స్వయం సమృద్ధి సాధనే లక్ష్యాలుగా ఆవిర్భవించిన ఒక వెల్ఫేర్ అసోసియేషన్. ఆవిర్భావ లక్ష్యాలు చాలా బాగున్నాయి… ఆవిర్భావ కాలం నుండి జరిగిన కార్యక్రమాలు, కార్యాచరణ చాలా బాగున్నాయి… సభ్యుల సంక్షేమం మొదలుకొని వృద్ధ కళాకారులకు పింఛన్లు, సభ్యులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్, ఫండ్ రైజింగ్, సొంత భవన నిర్మాణం, చనిపోయిన వారి కుటుంబాలకు తక్షణ సహాయం వంటి సంక్షేమ కార్యక్రమాలతో అతితక్కువ కాలంలోనే తన ఉనికిని గొప్పగా ఆవిష్కరించుకుంది ‘ మా’.

చిత్ర పరిశ్రమలోని 24 శాఖల అసోసియేషన్లన్నింటికంటే గ్లామరస్ అసోసియేషన్ కావటంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు సంబంధించిన ప్రతి చిన్న వార్త మీడియాలో పతాక శీర్షికలకెక్కి ప్రాచుర్యాన్ని పొందింది. ఇలాంటి నేపథ్యంలో ప్రతిష్టాత్మక సంస్థగా ఎదిగిన ‘మా’ గత కొన్నేళ్లుగా వివాదాలకు, కీచులాటలకు, అంతర్గత కుమ్ములాటలకు కేరాఫ్ అడ్రస్ గా మారటం చిత్ర పరిశ్రమకు అప్రదిష్టగా పరిణమించింది.

ముఖ్యంగా గత రెండేళ్ల నుండి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సానుకూల విషయాలకంటే ప్రతికూల విషయాల్లోనే తరచుగా వార్తలకెక్కటం జరుగుతుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష, కార్యదర్శి పదవులను రెండు డిఫరెంట్ ప్యానల్ మెంబర్స్ చేజిక్కించుకోవడంతో వారి మధ్య ఏర్పడిన సయోధ్యా లోపం ‘మా’ కు శాపంగా పరిణమించింది. ఆ సయోధ్యా లోపంతోనే రెండు టరమ్స్ గడిచిపోయాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నరేష్ అధ్యక్షుడిగా, అదే ప్యానల్ కు చెందిన హీరో రాజశేఖర్, ఆయన సతీమణి శ్రీమతి జీవిత రాజశేఖర్ వైస్ ప్రెసిడెంట్, కార్యదర్శి పదవులకు ఎన్నికయ్యారు. మిగిలిన కార్యవర్గ సభ్యులు కూడా ఎక్కువశాతం అదే ప్యానల్ కు చెందిన వారు ఎన్నిక కావడంతో ఇకముందు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏ కార్యక్రమం చేపట్టినా ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతుందని ఆశించారు అందరు. కానీ తాజా పరిస్థితులు అందుకు భిన్నంగా పరిణమిస్తున్నాయని తెలుస్తుంది.

అధ్యక్షుడు నరేష్, ఉపాధ్యక్షుడు రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి శ్రీమతి జీవితల మధ్య ప్రతి విషయంలోనూ అభిప్రాయ బేధాలు పొడ చూపుతున్నాయని తెలుస్తుంది. ఎవ్వరు బయటపడక పోయినప్పటికీ ఇంటర్నల్ గ్రూప్స్ లో ఒకరినొకరు బాగా విమర్శించుకుంటున్నారన్నది లోపాయకారీ సమాచారం.

మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అధికార టిఆర్ఎస్ పార్టీకి ప్రచార చిత్రాలు తీసిపెట్టమని కొందరు పార్టీ ప్రముఖులు కోరగా అందుకు ఆనందంగా అంగీకరించి ఆ బాధ్యతలను కొంత మంది సభ్యులకు అప్పగించింది ‘మా’. అయితే 7 ప్రచార చిత్రాలు తీశామని చెప్పి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డబ్బు నుండి ఏడు లక్షల రూపాయలు డ్రా చేసారట. అయితే ఆ 7 చిత్రాలు నిజంగానే తీశారో లేదో తెలియదు. వాటిని టిఆర్ఎస్ పార్టీ వారికి అందజేసిన దాఖలాలు గాని, అది ఎన్నికల సమయంలో టీవీలలో గానీ, ఇతర ప్రసార మాద్యమాలలో ప్రసారం అయిన ఆనవాళ్లు గానీ లేవు. అయితే ‘మా’ సొమ్ములో 7 లక్షల భారీ మొత్తానికి చిల్లి పడింది. అసలు ఆ ప్రచార చిత్రాలను తీయనేలేదని కొందరు… తీశామని కొందరు… తీస్తే చూపించమని ఇంకొందరు వాట్సప్ గ్రూపుల్లో పరస్పర ఆరోపణలు చేసుకుoటున్నారు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.