కోడెల మరణంలో నిజానిజాలు తేలాలి

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య ఒక్కసారి ఆంధ్రరాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపింది. తెలుగుదేశం అగ్రనాయకుల్లో ఒకరైన కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకునే అంత పిరికిపంద కాదని అనిపిస్తుంది. తన గతం చూస్తే ఎన్నో డక్కా ముక్కలు రుచి చూసిన వైనం. కేవలం ఆరోపణలు ఎదుర్కోలేక ఆత్మహత్య చేసుకునేంత బలహీనుడు కాదు. ఎందుకంటే మొదట్నుంచి వర్గాలు, ఫ్యాక్షన్ రాజకీయాల్లో మునిగితేలిన వ్యక్తి.

పల్నాడు ప్రాంతమే ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టిందిపేరు. ఒకసారి తన ఇంట్లో బాంబులు దొరికాయని పత్రికల్లో తాటికాయంత అక్షరాల్లో పేపర్లలో వచ్చింది. ఒకరినొకరు నరుక్కోవటం, చంపుకోవటం ఆ ప్రాంత వర్గపోరులో సాధారణం. దానికి తోడు కులరాజకీయాలు ఎక్కువ. ఊళ్లన్నీ వర్గాలుగా, కులాలుగా విడిపోయాయి. అందులో ఒకవర్గానికి నాయకుడు కోడెల శివప్రసాద్. సహజంగానే ఈ వర్గపోరులో ద్వేషించేవాళ్ళు ఎంతమందివుంటారో అభిమానించేవాళ్ళు అంతమంది వుంటారు. ఈ ఫ్యాక్షన్ రాజకీయాల్లో వుండేవ్యక్తులు తొందరపడి ఆత్మహత్యలు చేసుకొనే అంత మానసిక బలహీనులుగా వుండరు. అందుకనే ఈ ఆత్మహత్య అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

కోడెల శివప్రసాద్ పై ఎన్నో తీవ్ర ఆరోపణలున్నాయి. అందులో ప్రముఖమైనది వంగవీటి మోహన రంగా హత్య. నిరాహార దీక్ష శిబిరంలో వున్న వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా హత్య చేయటంలో కోడెల పాత్ర ఉందని రంగా వర్గీయులు చాలా బలంగా నమ్ముతున్నారు. అప్పుడు కోడెల హోం మంత్రి. రాష్ట్ర ప్రభుత్వమే కుట్రచేసి రంగాను చంపించిందని , అందులో హోం మంత్రిగా వున్న కోడెల వ్యూహరచనలో భాగస్తుడని ఇప్పటికీ రంగా అభిమానులు నమ్ముతున్నారు. దురదృష్టవశాత్తు ఆ తర్వాత జరిగిన హింసనే ఆనాటి ప్రచార సాధనాలు హైలైట్ చేసి హింసకు కారణమైన నిర్దాక్షిణ్య హత్యను తక్కువచేసి చూపించారని పరిశీలకులు విశ్లేషించారు. అందుకే ఆ తర్వాత జరిగిన హింసపై ప్రజలందరిలో కోపం వుండాల్సివున్నా ఈ హత్య వలన సామాన్య ప్రజలు రెండుగా చీలిపోయారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాతకూడా రంగా వర్గీయుల్లో ఆ కసి అలానే ఉండటం ఆశ్చర్యమేస్తుంది. ఆశ్చర్యమేమంటే అది కోడెల శివప్రసాద్ ఆత్మహత్య పై కూడా ప్రభావం చూపింది. సహజంగా అయితే ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిపై సానుభూతి ఉంటుంది. కానీ విజయవాడలో కోడెల చావుపై తన నాయకుడి హత్యకు కారణమైన వ్యక్తి చనిపోయాడనే కసి వ్యక్తపరుస్తూ బహిరంగంగా మాట్లాడటం ఆశ్చర్యంగా వుంది. అంటే ఒకవర్గాన్ని ఆ హత్య ఎంత గాయపరిచిందో మూడు దశాబ్దాల తర్వాత కూడా అదే కసి ఉండటం చూస్తే అర్ధమవుతుంది. కోడెల జీవితంలో ఎన్నో వైవిధ్యాలున్నా ఈ ఘటనే అన్నింటికన్నా ఎక్కువ విమర్శలకు దారి తీసిందని చెప్పొచ్చు.

ఏది ఏమైనా కోడెల హఠాత్మరణం పెద్ద సంచలనం. రాజకీయాల్లో ఓ వెలుగువెలిగిన వ్యక్తి ఈ విధంగా జీవితం వెళ్ళబుచ్చటం బాధాకరం. అసలు ఈ ఆత్మహత్యవెనుక నిజానిజాలు బయటకు రావలసివుంది. విషయం తెలిసిన వెంటనే ఇది ప్రభుత్వ వేధింపులవల్లనే అని చంద్రబాబు నాయుడు , ప్రచార సాధనాలు పెద్దఎత్తున ప్రచారం చేయటం సబబుగా లేదు. అలాగే వైస్సార్సీపీ నాయకులు ఇది చంద్రబాబు నాయుడుకి, వాళ్ళ కొడుకు, కూతురికి ఆపాదించటం కూడా సబబు కాదు. ఇరువర్గాలు విచారణ పూర్తయిందాకా ఆగకుండా రాజకీయం చేయటం ఆంధ్ర రాజకీయాలు ఎంత దిగజారాయో అర్ధమవుతుంది. మనస్థాపం అనేది రెండు రకాలుగా జరిగే అవకాశం వుంది. ఒకటి అయినవాళ్లు అర్ధంచేసుకోలేకపోతేనో, వాళ్ళ ప్రవర్తన భాదిస్తోనో అలాగే రెండోది ప్రజల్లో పరువుపోయిందని , తలెత్తుకోలేనని అనిపించినప్పుడో మనస్థాపం చెందుతారు. ఇందులో ఏ కారణం వల్ల ఈ పనికి పూనుకున్నాడో దర్యాప్తు లో తేలాల్సివుంది. అప్పటిదాకా ఆగకుండా రాజకీయానికి ఇరుపక్షాలు దిగజారడం దురదృష్టం. తెలంగాణ పోలీసులు దర్యాప్తును వేగిరపరిచి నిజానిజాలు త్వరగా తేల్చాల్సివుంది. అప్పుడే ఈ రొచ్చు రాజకీయాలకు ఫులుస్టాపు పడుద్ది.

ఇది చదవండి

: నల్లమలను ఎందుకు సేవ్ చేయాలంటే..?

 
 

2 Comments

Write a comment ...
Post comment
Cancel
 1. 18 Sep, 9:42 pm
  Sameera
  Reply

  After achieving so much... After facing 72yrs of life... One old man.. Why will he suicide... Is the society became so vulnerable to face...

  Post comment
  Cancel
 2. 19 Sep, 5:33 pm
  Rajesh
  Reply

  2019 ఓటమి , ఫామిలీ మెంబెర్స్ కేసులు , తనపై వచ్చిన ఆరోపణలన్నీ సోషల్ మీడియా లో వైరల్ అవ్వటం తట్టుకోలేకపోయివుంటారు.

  Post comment
  Cancel