కెసిఆర్ రాచరిక పోకడలు

ఆర్టీసీ సమ్మె కథ సుఖాంతమయ్యింది. ఆర్టీసీ సిబ్బంది సంతోషంగా వున్నారు. ప్రచారమాధ్యమాల్లో ఫోటోలు, వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. అంతవరకు బాగానేవుంది. అటు కెసిఆర్ ఇటు ఆర్టీసీ సిబ్బంది నిన్నటి సమావేశంలో చాలా సంతోషంగా పాల్గొనటమే కాకుండా అసలు ఇన్నాళ్లు ఇంతగా విభేదాలున్నాయా అని అందరూ ఆశ్చర్యపోయే విధంగా కలిసిమెలిసి పోయారు. ఈ విధంగా సమాప్తం కావటం రాష్ట్ర ప్రజలకు సంతోషంగా వుంది. ఇకనుంచైనా ఆర్టీసీ లాభాలబాటలో నడుస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తుందని ఆశిద్దాం.

ఇక కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలు చూస్తే చాలా ఆశ్చర్యంగా వుంది. నిన్నటిదాకా మాట్లాడింది , కోర్టులో వాదనలు వినిపించింది ఇప్పుడు మాట్లాడేది పూర్తి వైరుధ్యంగా వుంది. ఆ కెసిఆర్ యేన ఇప్పుడు మాట్లాడేది అన్నంత మార్పు కనబడింది. ఒక్కసారి రీలు వెనక్కి తిప్పి చూద్దాం.

 • 1. అసలు ఆర్టీసీని ఎవరూ బాగు చేయలేరు. నాకుతెలిసినంతగా ఆర్టీసీ ని గురించి ఎవరికీ తెలియదు. ఆర్టీసీ ని నష్టాల్లోంచి బయటపడేయటం బ్రహ్మదేవుడికి కూడా సాధ్యంకాదు.

 • 2. అసలు దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఆర్టీసీ కునారిల్లుతుంది. ఎక్కువరాష్ట్రంలో ప్రైవేటు బస్సులు ఎక్కువ తిరుగుతున్నాయి.

 • 3. కేంద్రమే రూట్ల ప్రైవేటుకు ద్వారాలు తెరిచింది. రూట్ల ప్రైవేటుకన్నా వేరే మార్గంలేదు.

 • 4. 44 కోట్ల రూపాయలు చెల్లించటానికి కూడా డబ్బులు లేవు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా ఇచ్చింది. ఇంకా ఒక్క పైసా కూడా ఇవ్వలేం

 • 5. గత అయిదు సంవత్సరాల్లో మేము పెంచినంతగా ఏ రాష్ట్రమూ పెంచలేదు. ఉద్యోగస్తుల కోర్కెలు గొంతెమ్మ కోర్కెలు. పరిష్కరిస్తే ఆర్టీసీ బుట్ట మునగడం ఖాయం.

 • ఇప్పుడు అదే కెసిఆర్ నోట్లోనుంచి వచ్చిన మాటలు:

  • 1. ఆర్టీసీ ని గురించి నాకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ఆర్టీసీ వచ్చే సంవత్సరానికి లాభాల బాటలోకి తీసుకొద్దాం.

  • 2. ఒక్క రూట్లోకూడా ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇవ్వం. అన్ని రూట్లు ఆర్టీసీ చేతిలోనే వుంటాయి.

  • 3. తక్షణం 100 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నాను. ప్రతి సంవత్సరం 1000 కోట్లు బడ్జెట్లో ఆర్టీసీ కోసం కేటాయిస్తాం.

  • 4. ఎన్నో డిమాండ్లు పరిష్కరించటం జరిగింది. ఇందులో చాలా డిమాండ్లు ఆర్ధిక పరమైనవి. అయినా ప్రభుత్వం ఒప్పుకుంది.

  • 5. ఇంకా 10 వేలమంది ని రిక్రూట్ చేసుకుంటాం. పదవీ విరమణ వయసు ని 60 కి పెంచారు.

  అప్పుడుచేసిన వాదన ఇప్పుడు చేసిన వాదన పోల్చుకుంటే సమ్మె సమయంలో ప్రభుత్వం చేసిన వాదన తప్పని తేలింది. సమ్మెను దెబ్బతీయటానికి అసలు ఆర్టీసీ అవసరంలేదని , అది మనుగడ సాధించలేదని, ప్రైవేటు పరం చేయటమే వున్న ఏకైక మార్గమని వాదించి ఇప్పుడు అసలు ఆర్టీసీ కి ప్రత్యామ్నాయమే లేదని ప్రైవేటుని అడుగుపెట్టనిచ్చేది లేదని వాదించటం ఒక బాధ్యతాయుత స్థానంలో వున్న వ్యక్తికి తగదు.కోర్టుల్లో లాయర్లు డబ్బులుతీసుకొని క్లయింట్ తరఫున మాట్లాడినట్లు వుంది. ప్రజా జీవితంలో వున్న వ్యక్తి కి పరపతి చాలా ముఖ్యం. కార్మిక వివాదంలో రెండువైపులా వైఖరులు తప్పులేదు. కానీ అసలు సైద్ధాంతికంగా విరుద్ధ వాదనలు చెప్పటం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తికి తగదు.

  ఇకపోతే యూనియన్ నాయకుల గురించి , యూనియన్ల గురించి సమ్మె అయిపోయిన తర్వాత కూడా కక్షసాధింపు ధోరణిలో మాట్లాడటం , అసలు రెండు సంవత్సరాలు వాటిని గుర్తించనని చెప్పటం తన రాచరిక చిహ్నం. తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ స్వంత జాగీరు కాదు. పరిపాలనా దక్షత గల రాజులు కూడా కొన్ని కొన్ని పద్ధతులు , నియమాలకు లోబడే నిర్ణయాలు తీసుకుంటారు. ప్రజాస్వామ్యంలో మనకు ఇష్టమయితే ఒకటి లేకపోతే మరొకటి చేయటానికి లేదు. కార్మిక చట్టాలు భారత రాజ్యాంగం ప్రకారం రూపొందించారు. కార్మికులకు సంఘం పెట్టుకొనే హక్కు కెసిఆర్ కు నచ్చితే ఉంచటం లేకపోతే తీసేయటం జరగదు. అది వాళ్ళ ప్రాధమిక హక్కు. వాటిని గుర్తించకుండా వుండే హక్కు కూడా కెసిఆర్ కి లేదు. మరి చట్టాలు వున్నా నా ఇష్టమొచ్చినట్లు చేస్తానని చెప్పటం రాచరిక పోకడ కాక మరేంటి?

  యూనియన్ నాయకులు తప్పు చేసి ఉండొచ్చు. అయితే వాళ్ళు సమ్మెలోకి వెళ్ళటమే తప్పు అని చెప్పే హక్కు కెసిఆర్ కి లేదు. అది చట్టం ప్రసాదించిన హక్కు. కాకపోతే పండగ సమయంలో ప్రజలకి ఇబ్బంది కలిగించే విధంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని హర్షించలేము. పండగ సమయంలోనే ఆర్టీసీ కి ఆదాయం వచ్చేది. ప్రజల ఇబ్బందులు ఒకెత్తయితే ఆర్టీసీ ఆదాయ అవకాశాన్ని దెబ్బతీయటం వాళ్ళు చేసిన తప్పు. అదేసమయంలో ఆర్టీసీ సిబ్బంది లో వున్న బలమైన కోరిక ప్రకారమే విలీనం డిమాండును ప్రధానంగా ముందుకు తీసుకొచ్చారు. అంతవరకు బాగానే వున్నా సమయం, సందర్భం ఎంచుకోవడంలో సభ్యులకన్నా నాయకులదే పాత్ర. మొదలుపెట్టిన తర్వాత మధ్యలో విలీనానికి అవకాశాలు లేవని తెలిసికూడా అదే డిమాండుని పట్టుకొని వేలాడటం వ్యూహాత్మక తప్పిదం. ఇదంతా గత చరిత్ర. ఇప్పుడు కావాల్సింది తిరిగి కార్మిక చట్టాల ప్రకారం ఎలా పనిచేయాలనేదే.

  కెసిఆర్ ఓ విధంగా భోళా. ఇవ్వాలన్న కోపం రేపు ఉండదు. అయితే సమస్యల్లా తను అనుకున్నట్లుగానే జరగాలి. కార్మిక చట్టాల ప్రకారం వున్న గుర్తింపు ప్రక్రియను నోటిమాటతో కెసిఆర్ రద్దు చేయలేడు. అది అందరికి తెలిసిందే. కాకపోతే చట్టం ప్రకారం గుర్తించినా వాళ్ళతో చర్చలు ఇప్పట్లో జరపడనేది అర్ధమయ్యింది. అందుకే కెసిఆర్ ఏం మాట్లాడనే దానికన్నా ప్రభుత్వంతో తిరిగి సత్సంబంధాలు ఎలా పునరుద్ధరించుకోవాలో యూనియన్ నాయకులు కూడా ఆలోచించుకుంటే మంచిది. రాచరిక పోకడలు వున్న వ్యక్తులు కొన్ని సార్లు చాలా ఉదారంగా కూడా వ్యవహరిస్తుంటారు. అందుకు కెసిఆర్ ఉదాహరణ. అందుకే చట్టాలు, హక్కులు కొన్నాళ్ళు పక్కన పెట్టి కార్మికుల్లో తిరిగి సేవతో మన్నన పొందటంపై ఎక్కువ కేంద్రీకరిస్తే మంచిది. కాలంతోపాటు సంబంధాలు మెరుగుపడతాయనే ఆశిద్దాం.

 
 

2 Comments

Write a comment ...
Post comment
Cancel
 1. 2 Dec, 9:53 pm
  కృష్ణ
  Reply

  కేసీఆర్ మనస్తత్వాన్ని, మాటల గారడీని బయటపెట్టే ఆర్టికల్. చాలా బాగుంది.

  Post comment
  Cancel
 2. 2 Dec, 9:53 pm
  కృష్ణ
  Reply

  కేసీఆర్ మనస్తత్వాన్ని, మాటల గారడీని బయటపెట్టే ఆర్టికల్. చాలా బాగుంది.

  Post comment
  Cancel