కెసిఆర్ కొత్త భవనాల నిర్మాణం సమర్ధనీయమేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి మరలా జాతీయ మీడియాలోకి ఎక్కారు. జాతీయ మీడియాలో సానుకూల వార్తలకన్నా ప్రతికూల వార్తలే కెసిఆర్ పై ఎక్కువ వస్తుంటాయి. ఈసారి వంతు కొత్త సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాల నిర్మాణంపై. ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు. అంతకుముందు కొత్త ముఖ్యమంత్రి నివాసం, ప్రగతి భవనంపై సెటైర్లు పేలాయి. బహుశా ఇవేవీ ఎన్నికల్లో గెలవటానికి, ఓడటానికి కారణం కాకపోవచ్చు. కాకపోతే వీటిని కెసిఆర్ ఫ్యూడల్ చర్యలుగా చూపిస్తున్నాయి. ఎందుకంటే అప్పటికే వున్న ముఖ్యమంత్రి నివాసం వాస్తు బాగులేదని ప్రజాధనం వృధాచేసి కొత్త నివాసం కట్టించాడు. అలాగే సెక్రటేరియట్ వాస్తు బాగులేదని ప్రగతి భవనం కట్టించి అక్కడనుంచే పరిపాలన సాగిస్తున్నాడు. ఇవన్నీ అసెంబ్లీ ఎన్నికలముందే జరిగాయి. అయినా వీటిని ప్రజలు పట్టించుకోలేదు. తెలంగాణా ఏర్పడిన తర్వాత జరిగిన రెండోసారి ఎన్నికల్లో కూడా ఆంధ్రకు వ్యతిరేకంగా తెలంగాణా సెంటిమెంట్ రగిలించి గెలవగలిగాడు. దీనితో కెసిఆర్ అపార చాణిక్యుడు గా పేరుపొందారు.

మళ్లీ ఇప్పుడు జాతీయ మీడియా సెక్రటేరియట్ , అసెంబ్లీ భవనాలు ఉండగా కొత్త భవనాలు కట్టించటంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇందులో వాస్తవం లేకపోలేదు. ఈ రోజే వచ్చిన వార్త ప్రకారం 2014-15 లో 79,880 కోట్లు వున్న అప్పు 2018-19 కి 1,80,239 కోట్లు అయ్యిందని రాజ్య సభలో నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అంటే ఐదేళ్లలో రుణభారం 159 శాతం పెరిగిందన్నమాట. పోయిన సంవత్సరం కేవలం వడ్డీలు, రుణాల చెల్లింపులకే 11,691 కోట్లు చెల్లించినట్లు ఆవిడ వెల్లడించారు. అయినా సెంటిమెంటుల కోసం ప్రజాధనం వృధా చేయటం ఏ విధంగా సమర్ధనీయం? సెక్రటేరియట్ వాస్తు బాగులేదని అయిదు సంవత్సరాలు దాంట్లోకి అడుగుపెట్టకపోవటం కెసిఆర్ ఫ్యూడల్ మనస్తత్వానికి పరాకాష్ట. ఇప్పుడు అందుకే పాత భవనాలు కూలగొట్టి కొత్త భవనం కట్టటం హేతుబద్దంగా లేదు. అందులోకొన్ని అంత పాతవీ కాదు. ఇక ప్రస్తుత అసెంబ్లీ భవనం ఐకానిక్ భవనం. చార్మినార్, హైకోర్టు తర్వాత హైదరాబాద్ కి బ్రాండ్ అంబాసిడర్. అయినా ఎందుకోమరి దాన్ని అలాగే ఉంచి ఇంకోచోట అసెంబ్లీ భవనం కడుతున్నారు. దీనికి కారణాలేమిటో ఇదమిద్ధంగా తెలియదు. ఒకవేళ మౌలిక సౌకర్యాలు లేమి, అధునాతన లేమి కెసిఆర్ కి ఇబ్బందిగా అనిపించినట్లుగా తెలుస్తుంది. కొంతమంది మేధావులు దీనిపై ప్రతిస్పందిస్తూ అసలే రద్దీగా వున్న నగరంలో దీన్ని ఓ అవకాశంగా తీసుకొని ఊరిబయట పరిపాలనా నగరం నిర్మిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఇదేమీ కొట్టిపారేయదగ్గ సూచన కాదు. దీని వలన నగర ట్రాఫిక్కుకి మేలుజరిగివుండేది. పరిపాలనా నగరం అప్పుడు కెసిఆర్ అధునాతన ఆలోచనలకు అనుకూలంగానిర్మించవచ్చు. హైదరాబాద్ శివారులో భూసమస్య లేదు. అమెరికాలో పరిపాలనా నగరాలు ఎక్కువభాగం పెద్ద నగరాలకు దూరంగానే వున్నాయి. కెసిఆర్ కి ఏమైనా రాచరిక పోకడలు ఎక్కువ. అందుకే ఎవరి సలహా తీసుకోడు. తనకు తోచిందే చేస్తాడు. అందులో కొన్ని ప్రజలకు మేలు చేస్తాయి ,మరికొన్ని ప్రజల డబ్బులు వృధాగా ఖర్చు చేస్తాయి. తీపీ , చేదుల ఈ కలయికను మనం రుచిచూడక తప్పదుమరి.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.