కెసిఆర్-జగన్ మైత్రి బంధం ప్రజలకు మేలు జరగాలి

ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇటీవలికాలంలో క్రమం తప్పకుండా కలుస్తుండటం అభినందించాల్సిన విషయమే. సంప్రదింపులకు మించిన పరిష్కారం ఇంకోటి లేదు. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు స్థూలంగా చూస్తే మేలు చేస్తుంది. అయితే ఇది ఉభయుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జరగాలి. ఇప్పటికీ పరిష్కారం కాని అంశాలు చాలా వున్నాయి. మధ్యవర్తిత్వం వహించాల్సిన కేంద్రప్రభుత్వం కాడి కిందపడేయటం వలన ఇవి ఇన్నాళ్లు అపరిష్కారంగా ఉన్నాయని చెప్పక తప్పదు. నిజం మాట్లాడితే ఎవరికి కోపం వస్తుందోనని దీన్ని కాలానికి వదిలివేసింది. ఈసారి ఎన్నికలైన తర్వాత కెసిఆర్ చొరవ తీసుకొని మేమిద్దరమే పరిష్కరించుకుంటాం కేంద్రతో పనిలేకుండా అని ప్రకటించటం ముదావహం. ఇది ఆచరణాత్మక వైఖరని చెప్పాలి.

ప్రస్తుతం ఆంధ్ర-తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య బాన్ హోమీ నడుస్తుంది. అది ఎంతగానంటే పైకి చెప్పకపోయినా ఒకరి ఆంతరంగిక విషయాలు ఇంకొకరు పంచుకొనేదాకా అని అక్కడక్కడా వార్తలు వినబడుతున్నాయి. ఇది ఇరు రాష్ట్రాల సమస్యలు పరిష్కరించగలిగేటట్లయితే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పక తప్పదు. ఇటీవలి సమావేశంలో జల వనరుల సమస్య తప్పించి మిగతా సమస్యలన్నీ వచ్చే డిసెంబర్ లోపల పూర్తిచేయాలని నిర్ణయించుకున్నారు. వీటిలో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిస్తే జటిలమైన సమస్య ఏమీ కాదు. ఇదే జరిగితే రాజకీయ మైలేజీ కూడా ఇరు పార్టీలకు వస్తుంది.

ఇకపోతే అసలు సమస్యల్లా జలవనరుల పంపిణీ. ఇది అత్యంత క్లిష్టమైనది. దీని ప్రభావం దీర్ఘకాలం ఉంటుంది. సున్నితమైన సమస్యకూడా. ఎన్నో సంవత్సరాలుగా నానుతూ వుంది. దాదాపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఇదే సమస్య. నీరు ప్రజలకు జీవనాధారం కాబట్టి ఇందుకోసం ఎవరకు వారు తమకే లబ్ది చేకూరాలని అనుకోవటం సహజం. అందువల్లే ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించటం అంత తేలికైన పని కాదు. ఏ చిన్న తేడా వచ్చినా ప్రజల్లో తిరుగుబాటు వచ్చేటంత అతి సున్నిత సమస్య. ఇప్పటివరకు కెసిఆర్-జగన్ మైత్రి మూడు పువ్వులు ఆరు కాయలు లాగా సాగిపోతూవుంది. వాళ్లకు అగ్నిపరీక్షల్లా జలవనరుల పంపిణీనే . ఇప్పటికే అక్కడక్కడా ఈ సంప్రదింపుల్లో కెసిఆర్ మార్కు ఆధిపత్యం కనబడుతుందని చిన్న చిన్న గొణుగుడులు వినబడుతున్నాయి. కెసిఆర్ బహిరంగంగానే జగన్ పరిపాలన కు కొత్త కాబట్టి నేను సలహాలతో పెద్దన్న పాత్ర పోషిస్తానని ప్రకటించటం జరిగింది. తెలుగుదేశమైతే ఇంకొంచెం ముందుకెళ్లి అసలు ఆంధ్ర ఎన్నికల్లో కెసిఆర్ జగన్ తరఫున డబ్బులు కుమ్మరించాడని ప్రచారం చేసిన విషయం తెలిసిందే.

వాస్తవానికి హైదరాబాద్ లాంటి నగరం ఆంధ్రాకి లేకపోయినా ఇప్పటికీ అన్నింటిలో ఆంధ్రానే పెద్దది. అటు జనభాపరంగా కానీ , బడ్జెట్ పరంగా కానీ ఆంధ్రానే పెద్ద రాష్ట్రం. దానిపై రెండో రాష్ట్రం పెత్తనం చేస్తుందనే అభిప్రాయం వస్తే జగన్ ఇబ్బందులు పాలవుతాడు. అందుకే మొన్న జరిగిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం తర్వాత పరిపాలనా అంశాలు తప్పిస్తే రాజకీయాలు చర్చకు రాలేదని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వటం జరిగింది. ఇటీవల జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నియామకాల్లో తెలంగాణకు దాదాపు ఆంధ్రతో సమాన ప్రాతినిధ్యం కలిపించటం ఆహ్వానించదగ్గ పరిణామం. బోర్డుని విస్తరించి ఎక్కువ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కలిపించటం జగన్ మార్కు పరిపాలనగా చెప్పుకోవాలి. ఏదిఏమైనా ఇరు రాష్ట్రాలు సమాన స్థాయిలో చర్చించుకొని పరిష్కారాలు చూపగలిగితే దేశానికే ముందుబాట చూపినవాళ్లవుతారు. అలాజరగాలని ఆశిద్దాం.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.