జగన్ విద్యారంగంపై ఆసక్తి ని స్వాగతిద్దాం

జగన్ విద్యారంగం లో సంస్కరణలకు , ప్రోత్సాహకాలకు పూనుకోవటం ఆహ్వానించదగ్గ పరిణామం. జగన్ తన ఎన్నికల ప్రణాళికలో అక్షరాస్యతపై నవరత్నాల్లో చేర్చటమే కాకుండా ఆ దిశలో ప్రయాణం చేస్తున్నట్లుగా తన నిర్ణయాలు చూస్తే అర్ధమవుతుంది. ప్రభుత్వ పాఠశాలలకు ఊతమిచ్చే పలు చర్యలను ప్రకటించాడు. ఖాళీగావున్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయటంతో పాటు , ప్రభుత్వ పాఠశాలల కు మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని చెప్పటం కూడా ముదావహం. అయితే దీని అమలు ఎలా ఉంటుందో చూడాల్సి వుంది. ఇప్పటివరకు తను ఎక్కడమాట్లాడినా అక్షరాస్యత పై గట్టిగా మాట్లాడటం సంతోషంగా వుంది. ఇది నిజంగా అత్యంత ప్రాధాన్యతా అంశమని చెప్పటం వలన వచ్చే అయిదు సంవత్సరాల్లో ఆంధ్ర ప్రదేశ్ అక్షరాస్యతా శాతం పెరుగుతుందని ఆశిద్దాం.

2011 జనాభాలెక్కలప్రకారం అక్షరాస్యతా విషయం లో దిగువన వున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ ఉండటం వినటానికే బాధగా వుంది. దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా కేరళ, తమిళనాడు దేశం లో అగ్రగామిగా వుంటే ఆంధ్రప్రదేశ్ దిగువన ఉండటం చూస్తున్నాము. తెలంగాణ కూడా ఇదే స్థితి లో వుంది. ఉత్తర్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల సరసన మన తెలుగు రాష్ట్రాలు ఉండటం మన దౌర్భాగ్యం. ఇప్పటికైనా దీని ప్రాధాన్యతను గుర్తించినందుకు సంతోషం. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కూడా ఇదే బాటలో నడవాల్సి వుంది. జగన్ మాట్లాడుతున్నట్లుగా , కెసిఆర్ ఈ సమస్యపై మాట్లాడుతున్న దాఖలాలు కనబడటం లేదు. ఆయన ప్రాధాన్య అంశాల్లో ఇది లేదు. జగన్ విద్య, మద్య నిషేధంపై తీసుకుంటున్న చర్యలను అందరం స్వాగతించాలి.

జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నా ఈ రెండు విషయాల్లో ఎటువంటి వివాదం లేకపోగా ప్రజలందరిలో ఏకీభావముంది. దురదృష్టవశాత్తు మీడియా వివాదాస్పద అంశాలకు ఇచ్చిన ప్రాధాన్యం ఇటువంటి పాజిటివ్ విషయాలకు ఇవ్వకపోవటం చూస్తున్నాము. విద్యావంతుల శాతం పెరిగి , పేదప్రజల్లో మద్యపాన సేవనం తగ్గుముఖం పడితే అది సామాజిక మార్పుకి దారితీస్తుందనటంలో సందేహంలేదు. ఇప్పటికైనా ప్రచార సాధనాలు ఈ వార్తలను ప్రాచుర్యం లోనికి తీసుకొస్తే సామాజిక మార్పునకు దోహదం చేసిన వాళ్లవుతారని గ్రహిస్తే మంచిది. త్వరలో ఆంధ్రప్రదేశ్ కూడా అక్షరాస్యత లో అగ్రభాగాన వున్న రాష్ట్రాల జాబితాలో చేరుతుందని ఆశిద్దాం.

 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.