జగన్ ప్రభుత్వం విద్యుత్తు ఒప్పందాలను తిరగదోడటం సరికాదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు విద్యుత్తు ధరల సమీక్షపై ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం లేని అధికారాన్ని ఉపయోగించిందని స్పష్టం చేసింది. అంటే ధరల సమీక్ష కరెక్టు కాదనే దానికన్నా ఎవరికి అధికారముందనే సాంకేతికత అంశంపై తీర్పు ఇచ్చింది. ఈ అధికారం విద్యుత్తు నియంత్రణ మండలి కి ఉందని, ఆ సంస్థనే తేల్చాలని తీర్పునిచ్చింది. దీనిపై ప్రభుత్వం ఏమి చేయబోతుందనేది ఇంకా స్పష్టత రాలేదు. ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలి ( AP ERC ) పై ప్రభావం తీసుకొచ్చి తిరిగి సమీక్ష చేయించే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. నిజంగా అదే జరిగితే అది మంచి సంప్రదాయం కాదు. దీన్ని ఇక్కడితో వదిలిపెడితే హుందాగా ఉంటుంది.

ప్రాజెక్టుల రివర్స్ టెండరింగ్ వ్యవహారానికి, విద్యుత్తు ధరల సమీక్ష కు హస్తిమసికాంతం తేడా వుంది.ప్రాజెక్టులు సివిల్ కాంట్రాక్టులు . వాటిపై ఇప్పుడు సమీక్ష చేసినా దాని విలువ అంచనా కట్టొచ్చు. ఎందుకంటే సివిల్ కాంట్రాక్టులో దాని విలువ ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో అప్పటికన్నా ఎక్కువే వుంటుందికానీ తక్కువ ఉండదు.దానికి వాడే మెటీరియల్ కానీ లేబర్ ఖర్చులుకాని పెరుగుతాయే కానీ తగ్గవు. అయినా పాత టెండర్ల కన్నా తక్కువ కోట్ చేసి పాడుకున్నారంటే అప్పుడు ఇంకా ఇప్పుడు కోట్ చేసిన దానికంటే తక్కువనే వుండి వుంటుంది . అంటే ఇప్పుడు రివర్స్ టెండరింగ్ లో వచ్చిన లాభానికి ఇంకా కొంత కలుపుకోవాల్సి వుంటుంది. అంటే 841 కోట్ల లాభానికి కనీసం పది శాతం కలుపుకోవాల్సి వుంటుంది . కాబట్టి దాంట్లో ఖచ్చితంగా అవినీతి జరిగి వుంటుంది.

కానీ విద్యుత్తు ఒప్పందాల్లో ప్రాజెక్టుల్లో లాగా అంచనా వేయటం కష్టం. ఎందుకంటే విద్యుత్తు ఒప్పందాలు అప్పుడున్న మార్కెట్ పరిస్థితుల్ని బట్టి జరుగుతాయి. ఒక యూనిట్ విద్యుత్తు ఖర్చు ఒకనాటితో పోలిస్తే ఇప్పుడు బాగా తగ్గింది. ఇంకా అర్ధమయ్యేటట్టు చెప్పాలంటే ఎలక్ట్రానిక్ వస్తువులు మార్కెట్లో ప్రవేశపెట్టినప్పటికీ ఆ తర్వాత దాని విలువ తగ్గుతుంది. అలాగే ఇక్కడ సౌర విద్యుత్తు , పవన విద్యుత్తు ల్లో రాను రాను సాంకేతికత అభివృద్ధి అయ్యి ఖర్చు తగ్గింది. కాబట్టి సివిల్ కాంట్రాక్టుల మాదిరిగా కరెక్ట్ అంచనా కి రావటం కష్టం. అయితే ఆరోజు టెండర్ పిలిచేనాటికి దేశం లో యూనిట్ ఖర్చు ఎంత వుంది , మనమేమైనా మార్కెట్ ధరలకన్నా ఎక్కువ పెట్టామా అనేది సమీక్షించుకోవచ్చు. అంతే కానీ ఆ టెండర్ రద్దు చేసి ఇప్పుడు టెండర్ పిలిస్తే ఖచ్చితంగా అప్పటికన్నా తక్కువకే వస్తుంది. ఎందుకంటే సాంకేతికత అభివృద్ధివలన విద్యుత్తు ఫలకాలు దగ్గర్నుంచి అన్ని ఉత్పత్తులు ధరలు తగ్గాయి. కాబట్టి పాత టెండరుతో పోల్చి ఇప్పుడు తక్కువకు కోట్ చేసారు కాబట్టి అవినీతి జరిగిందని చెప్పలేము. సివిల్ కాంట్రాక్టులకు, విద్యుత్తు ధరలకు ఈ తేడాని గమనించక పోతే గుర్రాన్ని, గాడిదను ఒకే గాట కట్టినట్లవుతుంది.

అయితే పాత కాంట్రాక్టుల్లో అవినీతి జరగలేదని చెప్పటం దీని ఉద్దేశం కాదు. ఈ రాజకీయ వ్యవస్థలో అవినీతి జరగలేదని చెప్పటం ఓ పెద్ద సాహసమే అవుతుంది. సివిల్ కాంట్రాక్టుల్లాగా పాత కొత్త టెండర్లను పోల్చటం విద్యుత్తు ధరల్లో సాధ్యంకాదని మాత్రమే చెబుతున్నాము. దాని కల్లా అప్పటి మిగతా రాష్ట్రాల ఒప్పందాలను పోల్చటం వరకే పరిమితం కావాలి. ఆ ధరలతో ఇప్పటి ధరలు పోల్చి ఒప్పందాలను రద్దు చేయటం వ్యాపార సూత్రాలకే విరుద్ధం. అందుకే కేంద్ర ప్రభుత్వ విద్యుత్తు శాఖా మంత్రి పాత ఒప్పందాలను రద్దు చేయొద్దని సలహా ఇవ్వటం జరిగింది. ఎందుకంటే దీన్ని చూపించి అన్ని పాత ఒప్పందాల్ని ఎక్కువ ధర ఉందని రాష్ట్ర ప్రభుత్వాలు రద్దుచేస్తే ప్రపంచంలో మనదేశానికి చెడ్డ పేరువస్తుందని , దాని ప్రభావం రాబోయే పెట్టుబడులపై పడుతుందని ఇది చాలా ప్రమాదకరమని చెప్పటం జరిగింది. అందుకనే ప్రాజెక్టుల రివర్స్ టెండరింగ్ విజయవంతమైన నేపథ్యంలో విద్యుత్తు ధరలపై కూడా అదే పధ్ధతి అవలంబిస్తే దేశం మొత్తం పెట్టుబడులపై ప్రభావముంటుందనే విషయం గ్రహించాలి. అందుకనే ఈ వ్యవహారాన్ని ఇంతటితో ఆపేయగలిగితే మంచిది. కొత్తగా చేపట్టే ప్రాజెక్టుల్లో అన్ని జాగ్రత్తలూ తీసుకొని టెండర్ విధానం జరిపితే మంచిది . ఇది రాష్ట్రానికి, దేశానికి కొత్త తలనొప్పులు తేకుండా వుంటుంది.

ఇది చదవండి: నిన్న సీఎం సతీమణి నేడు డోనాల్డ్ ట్రంప్..!

 
 

1 Comments

Write a comment ...
Post comment
Cancel
 1. 27 Sep, 7:52 pm
  Kavi
  Reply

  Short-sighted and immature politics

  Post comment
  Cancel