జగన్ నెలరోజుల పరిపాలన తీపి, చేదుల కలయిక

జగన్ అధికారం చేపట్టి నెలరోజులు దాటింది. ఈ నెలరోజుల పరిపాలన చూస్తే ప్రజల్లో మంచి స్పందనే వచ్చింది. సంక్షేమ పధకాలు విస్తరించటం ప్రజల్లో అనుకూల వాతావరణం వచ్చింది. అలాగే ఆంధ్ర-తెలంగాణ ముఖ్యమంత్రుల సఖ్యతపై కూడా ప్రజలు అనుకూలంగానే స్పందిస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే గతం గతహా అనుకోని ముందుకు సాగకపోతే ఇరు రాష్ట్రాల ప్రజలే నష్టపోతారు. కలిసి ముందుకు సాగితే నీళ్ల పంపకం దగ్గరనుంచి, ఆస్తుల విభజన వరకు అన్నీ సామరస్యంగా పరిష్కారమవుతాయి. లేకపోతె ఇంకో అయిదు సంవత్సరాలు ఇలాగే గడిచిపోతుంది. అందుకే ఈ సఖ్యతను ప్రజల ప్రయోజనాల రీత్యా స్వాగతించాల్సిన అవసరం వుంది.

అంతవరకూ బాగానే వుంది. సమస్యల్లా మిగతా విషయాల్లో దూకుడుగా వెళ్లటంపైనే. ముందుగా చెప్పుకోవాల్సింది . ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేయటం. ఇది ఆర్థికపరంగా చూస్తే ఆందోళనకరం . ఇప్పటికే భారతదేశంలో ప్రభుత్వ నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. మిగతా దేశాలతో పోలిస్తే మనదేశంలో ప్రభుత్వ నిర్వహణ ఖర్చులు చాలా ఎక్కువగా వున్నాయి. అందునా రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక పరిస్థితి మరీ దారుణంగా వుంది. ఈ పరిస్థితి మారకపోతే అభివృద్ధి పథకాలకు నిధులు మిగలవు. ఇప్పటికే సంక్షేమ పధకాలు తలకుమించినభారంగా తయారయ్యాయి. ఈ నేపథ్యంలో నిర్వహణ ఖర్చులు పెంచుకోవటం ముందు ముందు తలనొప్పిగా తయారయ్యే ప్రమాదం ఉందని కొత్త ప్రభుత్వం ఎంత తొందరగా గ్రహిస్తే అంత రాష్రానికీ , ప్రజలకీ మంచిది.

ఈ నెలరోజుల్లో నవరత్నాలలో చెప్పినవే కాకుండా ఎన్నో ఆర్థికనిర్ణయాలు ఎడా పెడా తీసుకోవటం జరిగింది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామంకాదు. ప్రస్తుతం రాష్ట్రాలు ప్రత్యామ్నాయ వనరులు సమీకరించుకొనే మార్గాలు పరిమితంగా ఉన్నాయని మరిచిపోవద్దు. అలాగే రెండోది, పాత ప్రభుత్వం పై కక్ష సాధింపుకి దూకుడుగా ముందుకెళ్తుందనే అభిప్రాయం ప్రజల్లో రాకుండా చూసుకోవాల్సిన భాద్యత కూడా కొత్త ప్రభుత్వంపై వుంది. ఎందుకంటే అర్జెంటుగా ఒక నెలా రెండు నెలల లోపే ప్రభుత్వం ఏదో చేయాలనే తాపత్రయం తప్పుడు సంకేతాలు ఇస్తుంది. ప్రభుత్వానికి ఇంకా అయిదు సంవత్సరాలు సమయముంది. రాగానే ఇదే ప్రాధాన్యమనే భావన రావటం మంచిదికాదు. జగన్ యువకుడు కాబట్టి కొంత దూకుడు ఉండటం సహజమేకానీ తాను మొత్తం ఐదుకోట్ల ప్రజానీకానికి ప్రతినిధి అని మరిచిపోవద్దు. మొత్తం మీద ఈ నెల రోజులూ అన్ని విషయల్లో దూకుడుగానే వుంది. ఇందులో ప్రజలు హర్షించేవే ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.