గ్రామ వలంటీర్ల చేతిలో జగన్ భవిష్యత్తు!

అధికారం కోసం హామీలిచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి, ఆ హామీలను నెరవేర్చడానికి శాయ శక్తుల ప్రయత్నిస్తున్నారు. ఒక వైపు నవరత్నాలు అమలు పరుస్తూనే, మరో వైపు ఎన్నికల మ్యానిఫెస్టోను కూడా ఒక్కొక్కటిగా ఆచరణలోకి తెస్తున్నారు ప్రతి 2000 జనాభా ఉన్న గ్రామంలో ఒక గ్రామ సచివాలయం నిర్మించాలి అని జగన్ తీసుకున్న నిర్ణయం చిన్న విషయమేమి కాదు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోని నిర్ణయం, ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం. జాతిపిత మాహాత్మ గాంధీ కలలు కన్న 'గ్రామ స్వరాజ్యం' ఇదే. దేశంలో పెద్ద పెద్ద రాజకీయ నాయకులే చేయని పని, తల పండిన ప్రముఖులే తీసుకొని సాహసోపేతమైన సంచలనాత్మక నిర్ణయం ఈ గ్రామ సచివాలయ నిర్మాణం. ఈ నిర్ణయంతో "ప్రజల వద్దకే పాలన" అనే నినాదం అక్షరాలా నెరవేరుతుంది. అంటే ప్రభుత్వ పాలన క్షేత్ర స్థాయిలో జరుగుతుందని అర్థం. ఏ మాత్రం తేడాలొచ్చినా ఏ ముఖ్యమంత్రి మూట కట్టుకోలేని అప్రతిష్ట రావొచ్చు, కనుకనే ఈ నిర్ణయం ఒక సాహసం అని చెప్పక తప్పదు. 'మాది పారదర్శక పాలన, అవినీతి రహిత పాలన' అని చెప్పుకునే జగన్. తన పాలనను పూర్తిగా గ్రామ వలంటీర్ల చేతుల్లో పెడుతున్నారు, ప్రజలు వారి పాలనను ప్రత్యేక్షంగా చూడబోతున్నారు. గ్రామ సచివాలయం నిర్వహణ విషయంలో గ్రామ వలంటీర్లు పక్షపాతం చూపెట్టినా, అవినీతికి పాల్పడినా, వారికి అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చలేకపోయినా.. అది నేరుగా సీఎం జగన్ పైనే పడుతుంది. ఎలాగూ చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూపించే ప్రతిపక్షాలు ఉంటూనే ఉన్నాయి. కాబట్టి గ్రామ వలంటీర్లు జగన్ ని ముంచుతారో లేక నిలబెడతారో..?. ప్రజల ముందు ఆయన్ని హీరోని చేస్తారో..? లేక జీరోని చేస్తారో ? వేచి చూద్దాం...
 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.